తెలుగువారు ఎంతో ఇష్టంతో కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ప్రతి సంవత్సరం వలెనే ఈ ఏడాది కూడా పెద్ద పండుగను సొంత ఊరిలో, ఆత్మీయులతో జరుపుకోవడానికి పట్టణాల నుంచి జనం పల్లెలకు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజులపాటు జరిగే పెద్దపండుగ సంక్రాంతి. నాలుగు రోజులపాటు జరుపుకుంటున్నందువల్లే సంక్రాంతిని పెద్దపండుగ అంటారు. సంక్రాంతి పెద్ద పండుగే కాదు పల్లెల పండుగ. రైతుల పండుగ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకునే అతి ప్రాచీన పండుగలలో సంక్రాంతి ఎంతో ముఖ్యమైనది. తమిళనాడులో ‘పొంగల్’ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు కూడా వస్తారు. అందుకే కొత్త అల్లుడిని సంక్రాంతి అల్లుడు అంటారు. సినీ రచయిత ఒకరు ‘సంకురాత్రి అల్లుడు సంకలెగరేస్తూ వచ్చిండు’ అని పాట కూడా రాశారు. మొదటి రోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవరోజు కనుమ,
నాల్గవ రోజు ముక్కనుమ అంటారు. సాధారణంగా మన పండుగలు తిథుల ప్రకారం జరుపుతారు. ఒక్క సంక్రాంతిని మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటాం. అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తేదీన సంక్రాంతి జరుపుకుంటారు. ఈ ఏడాది 14న భోగి, 15న సంక్రాంతి వచ్చాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో దక్షిణాయణం ఆరునెలలు. ఆ ఆరునెలలు దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలలు ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. దేవతలు మేల్కొని ఉండే సమయాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. అందుకే ఇచ్ఛా మరణం పొందిన కురు పితామహుడు భీష్ముడు ఉత్తరాయణం వరకు వేచిఉండి అంతిమ శ్వాస విడిచాడు.

జనవరిలో ఇంకా మిగిలి ఉన్న చలిని పారదోలేందుకు వేసే చలి మంటలే భోగిమంటలు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, గాలిపటాలు ఎగురవేయడం, పితృదేవతలకు తిలతర్పణం, డూ డూ బసవన్నలు, పిండివంటలు, భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ తమ గ్రామాలకు చేరి సంతోషంగా జరుపుకునే పండగ కావడం వల్ల తెలుగు సినిమా నిర్మాతలు కూడా సంక్రాంతి రోజున తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతారు. సంక్రాంతి పండుగ దగ్గరలో ఉండే విధంగా విడుదల తేదీలు ప్రకటిస్తూ ఉంటారు.
ప్రజల అవసరాలకు తగినట్లుగా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. రైళ్లలో కూడా సీటు దొరకడం లేదు. చాలా మంది తమ సొంత వాహనాలలో సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దాంతో జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా మీదుగా గత మూడు రోజుల్లో దాదాపు లక్షన్నర వాహనాలు బయలుదేరి వెళ్లినట్లు అంచనా.
హై లైట్స్
** వరంగల్ జిల్లాలో గాలిపటాలు ఎగురవేయడానికి వాడే చైనా మాంజా స్టాకిస్టులపై పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకోవడం
** గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలలో ఉపయోగించే కోడిపుంజులను ఖమ్మం జిల్లాలో పెంచడం





