పంతంగి నుంచి పార్వతీపురం దాకా …….


నాలుగు రోజుల పాటు జనం సరదాగా జరుపుకునే సంక్రాంతి పండగ కోసం సిటీజనం పల్లెలకు తరలి వెళ్ళడానికి బస్సులు, రైళ్లు, లారీలు, ట్రాలీలు కూడా సరిపోకపోవడంతో లక్షలాదిగా తమ సొంత కారుల్లో బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా నుంచి పార్వతీపురం వరకు ఉన్న టోల్ ప్లాజాల మీదుగా లక్షలాది వాహనాలు తరలివెళ్లాయి. దాంతో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు సాఫీగా వెళ్ళడానికి రెండు రాష్ట్రాల పోలీసు శాఖ చేసిన కృషి అభినందనీయం. హైదరాబాద్ నుంచి వాహనాలు వెళ్ళడానికి తెలంగాణ పోలీసు శాఖ, తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రేయింబవళ్లు రహదారిపై ఉండి ట్రాఫిక్ చక్కదిద్దారు. నల్లగొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శరత్చంద్ర పవార్ చిట్యాల వద్ద
రహదారిపై నిలిచి ట్రాఫిక్ పర్యవేక్షించారు. సొంత ఊళ్లకు వెళ్తున్న జనాన్ని తరలించడానికి రెండు రాష్ట్రాల
ఆర్టీసి సిబ్బంది చేసిన సేవలు కూడా ప్రశంసనీయం.

సాగర తీరంలో జనతరంగం
విశాఖ సాగర తీరానికి సంక్రాంతి రోజున జనం వేలాదిగా తరలిరావడంతో జలతరంగాలతో పాటు
జనతరంగం పోటీపడింది. గాలిపటాలు ఎగురవేయడానికి జనం తరలి రావడంతో రామకృష్ణా బీచ్ ప్రాంతం
జనసంద్రంగా మారింది. ఫిషింగ్ హార్బర్ నుంచి జోడుగుళ్లపాలెం వరకు ఇదే పరిస్థితి.
బీచ్ లో భోగిరోజున లక్ష ఆవు పేడ పిడకలతో భోగి మంట వేశారు. సాధారణంగా
సెలవు రోజుల్లో సాయంత్రాలు, ఆదివారాలు జనంతో నిండి ఉండే విశాఖ బీచ్ ఇసుకవేస్తే రాలని జనంతో నిండిపోయింది. నగరంతో పాటు సింహాచలం కొండపై కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

పల్లె పిలుస్తోంది రా !
సంక్రాంతి సంబరాల పుణ్యమా అని పట్టణాలకు పల్లె కలవచ్చింది. పల్లె పిలుస్తోంది అంటూ గ్రామాలకు తరలివెళ్లగా మిగిలిన నగరవాసులు భోగిపళ్ళు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, గాలిపటాలను ఎగురవేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఆలయాలలో భక్తి శ్రద్ధలతో గోదా కళ్యాణం నిర్వహించారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *