మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఒక మహిళ చేపట్టారు. గత వారం విమాన ప్రమాదంలో మరణించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ కు ఉన్న పలుకుబడి, ప్రజాదరణ అంతా ఇంతా కాదు. ఆయనను ‘దాదా’ (అన్న) అని పిలుస్తారు. అదేవిధంగా సునేత్రను కూడా వదినమ్మ (మరాఠీలో వహిణి) అంటూ గౌరవిస్తారు. ఆమె కూడా నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో 1966 నుంచి ఇప్పటి వరకు కేవలం ఎనిమిది మంది మహిళలు ఉపముఖ్యమంత్రులు అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో మహిళలు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
తొలుత ఒక మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత పంజాబ్ రాష్ట్రానికి దక్కింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజిందర్ కౌర్ భట్టాల్ రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. విచిత్రమేమంటే భట్టాల్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన తరువాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టవలసి వచ్చింది. మన దేశంలో ఇప్పటి వరకు కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రమే మహిళా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. మహారాష్ట్రలో సునేత్రతో పాటు ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నడూ ఉప ముఖ్యమంత్రి లేరు. ఇప్పటివరకు ఎనిమిది మంది మహిళలు ఏడు రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో పాముల
పుష్ప శ్రీవాణి ఉపముఖ్యమంత్రి అయ్యారు.





