ప్రేమకు సిరివెన్నెల స్వరాక్షర నీరాజనం

ఫిబ్రవరి నెల అనగానే తనువుకి గిలిగింతల స్పర్శను అందించే చల్లదనం, చిరుగాలి అందించే శీతల మంచుక్రమంగా ప్రకృతి చిత్రం నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ నిష్క్రమించే జ్ఞాపకం ఒక్కటే కాదు మనస్సుకు ఒక తియ్యని అనుభూతి కలిగించే ప్రేమ భావన స్ఫురణకు వష్తుంది. అదే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ప్రేమ అంటే ప్రణయ భావన, ప్రేయసీప్రియుల మధ్యనే కాదు, సమస్త జీవరాశిని మూగజీవుల్ని సైతం ప్రేమించగల హృదయ భావన ప్రేమ. సిరివెన్నెల పాటల వనంలో మూడువేల పాటలు పరిమళించాయి. సంపెంగలు ప్రతీ క్షణం అందించే సౌరభం అయినా మనకు కొత్తగా అనిపిస్తుంది. అనుభవం చిత్రంగా ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం వెన్నెలను ఎంతగా ప్రేమించిందో అదే విధంగా ప్రేమ బంధాన్ని అక్షరాల సాక్షిగా ఆరాధించింది. అందుకే ప్రేమ ప్రేమ ఇతివృత్తంగా ఉండే చిత్రాలలో ఆయన భావుకత ప్రేమకు అక్షర మంత్రపుష్పాలై శతమానం భవతి అని ఆశీర్వదించాయి.

      ప్రేమ కథలకు, కథనాలకు అక్షరాలు భావ సంజీవనులుగా నిలిచి తెరపై చిరాయువు పోసి వంద రోజుల పండుగలకు అవి బలమైన పునాది అయ్యాయి. న్యూ మిలీనియంలో ఆరంభంలో ప్రేమ కథల ప్రవాహం వచ్చినప్పుడు యువత మనస్సు వేసవి సాయం సంధ్యలో సాగర తీరాన సేదతీరిన జనహృదయంలా సంబరపడింది.  అక్షర కోయిలలను తమ మనస్సు  వృక్షంపైకి సాదరంగా స్వాగతించింది. సిరివెన్నెల పాటలలోని పదాలు ఎప్పుడు విన్నా అప్పుడే కొత్తగా పుట్టిన పాపాయి బోసి నవ్వులా స్వచ్ఛంగా పలకరిస్తాయి.
     ఈ సారి ప్రేమికుల దినోత్సవం సందర్బంగా 'నువ్వే కావాలి' చిత్రంలో సిరివెన్నెల పాటలుగా చుట్టిన పంచధార చిలకల్ని రుచిచూద్దామా మరి!   సిరివెన్నెల గేయ రచయితగా కథ, కథనాల సృష్టిలో ఏ ఒక్క పదాన్ని తనకు తెలియకుండా ప్రయోగించరు.  బాల్యం నుంచి ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే వారు ఎదిగే క్రమంలో వారి మధ్య ఉన్న పరిచయాలు  చిలిపి తగాదాలుగా మారతాయి. మనస్సు ఇదిగాక ఒకరి మనస్సు మరొకరి వైపు అడుగులు వేస్తుంది.  అప్పుడు ఆ ప్రియుడికి లోకం సమస్తం తన ప్రేయసే కనబడుతుంది.  ప్రేమ కామెర్లు సోకినా ఆ కుర్రకారుకి జగతి అంతా ప్రేమ పచ్చగా సందర్శన ఇస్తుందిఅప్పుడు సిరివెన్నెల కలం ప్రేమికుడిగా మారి భావ నేత్రం తెరిచినప్పుడు ఆ అక్షరాలూ పౌర్ణమి రోజున ఎగసిపడిన సాగర కెరటాలుగా మారతాయి.   అలా ఎగసిపడిన అక్షరాలు కుర్రాళ్ళ మనసు అనే ఫ్రేమ్ లో అందంగా బంధీ అయ్యాయి.  వారి మనస్సుకు సాక్షి సంతకాలుగా మారాయి.  

       ప్రేమ అనే ప్రియభావన  పాటల పల్లకిలో సిరివెన్నెల రాశారు.  భావన ఏదయినా అంతరంగాన్ని స్పందింపజేస్తుంది.  అయితే అన్ని భావనలు ప్రియ భావనలు కావు.   ప్రేమ అనేది ప్రియభావన.  సిరివెన్నెల భావం కలకాలం నిలిచి ఉంటుంది. ప్రియుడి భావనలను సిరివెన్నెల అక్షరబద్ధం చేశారు.  అవి తెరపై అందంగా మెరిసాయి.  వెన్నెలకన్నా చల్లనిదిగా చిరునవ్వును, ఎవరు మాట్లాడిన ప్రియురాలు పిలుస్తోందనే  ఊహ ఇవన్నీ వింతగా అనిపించవచ్చు. కానీ ప్రేమికులకు ఇవన్నీ సర్వ సాధారణం. తుంటరి వాగు సంభాషించడం, గుండెల నుంచి ఎగసిపడే ఊపిరి,  చెలికి కబురు పంపడం ఇవన్నీ ప్రేమ తెరలు తీసినప్పుడు కనబడే సత్యాలు.  గీతం ముగింపులో తనలో కలిగిన ఊహలు, చెలికి కూడా అనిపిస్తున్నాయా? అని ప్రశ్నించడం ప్రేమికుడి ఆతృతను తెలియజేస్తుంది.  తరుణ్, రిచా అభినయానికి తోడు విశాఖ సాగరతీరం,  అరకు లోయ అందాలు సాక్ష్యంగా నిలిచాయి.  ఎప్పుడు విన్నా సిరివెన్నెల సాహిత్యం మనస్సుపై వెన్నెల జల్లు కురిపించి సేదతీరుస్తుంది.

— డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, సినీ పరిశోధకులు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *