కాప్రా సర్కిల్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో ఆదివారం రాత్రి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.శివరాత్రి వేడుకలలో పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. టౌన్షిప్ తో పాటు దమ్మాయిగూడ, సాయినగర్, జమ్మిగడ్డ, నాగారం తదితర ప్రాంతాలకు చెందిన వారు హాజరయ్యారు. పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు దీప అరవింద్ ఆధ్య్వర్యంలో కార్యదర్శి పున్న రమేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. దీప అరవింద్ ఆధ్య్వర్యంలో జరిగిన దీపాలంకరణలో దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యలు కర్నాటి భాగ్య , పున్న నవనీత , బింగి ఉదయశ్రీ, దొంత మాధవి సహకరించారు. దీపారాధన తరువాత గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలలో తొలుత నక్షత్ర నాట్యమండలి గురువు శ్రీ అంకం శిరీష శిష్య బృందంచే నృత్య ప్రదర్శన తరువాత, దేవాలయ భక్త బృందం భజన, అర్దరాత్రి లింగోద్భవం సమయంలో పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. కాలనీ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపిన అభిషేకం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే దేవాలయం పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి వస్తుందని దేవాలయ సముదాయ ట్రస్ట్ చైర్మన్ సీత ఆంజనేయులు తెలిపారు. దేవాలయంలో గత రెండు సంవత్సరాలుగా శివ మార్కండేయ దేవాలయంలో వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు , మార్కండేయ జయంతి, శ్రావణ పౌర్ణమి రోజున జంధ్యాల ధారణ, సీతారామ కళ్యాణం వంటి అనేక దైవిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని దేవాలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు నారా జనర్దన్ , సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓవల్దాస్ చక్రపాణి, ఉపాధ్యక్షులు దొంత శ్రీనివాస్ ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.






