స్టార్ కార్టూనిస్టు సురేంద్ర గుర్తున్నాడా?
మనుకున్న మంచి పొలిటికల్ కార్టూనిస్టుల్లో ఒకడు. పాత కాలం ప్రసిద్ధ రచయిత పి. రామ కృష్ణారెడ్డి గారి అబ్బాయి. హిందూ లాంటి జాతీయ ఇంగ్లీషు డైలీలో కార్టూన్ లు వేసి మెప్పించడం అంత తేలికైన పని కాదు. చెన్నైలో చాలా ఏళ్లు సెన్సిబుల్ కార్టూనిస్టు గా ఒక వెలుగు వెలిగాడు. తెలుగులో కవి గజ్జెల మల్లారెడ్డి పొట్టి రాజకీయ కవితలకి వందల బొమ్మలు వేసి మంచి పేరు తెచ్చుకు న్నాడు. అవతలి వాళ్ళని తిట్టడంలో మల్లారెడ్డి గారిది సూపర్ స్పెషాలిటీ. ఆయన అక్షింతలకి సురేంద్ర వేసిన బొమ్మలతో 400 పేజీల పుస్తకం వచ్చింది. ఫిబ్రవరి 22 ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ సభ.
సురేంద్ర గొప్ప సమయస్ఫూర్తి , సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు.అందమైన రేఖా చిత్రాలే కాదు,
సుతారంగా చమత్కారంగా కూడా రాయ గలడని అక్షింతలకి సురేంద్ర రాసిన ముందు మాట చదివితే అర్థం అవుతుంది….. —తాడి ప్రకాష్
మార్నింగ్ షో సినిమాలకు నన్ను మల్లారెడ్డి తీసికెళ్లే వారు: సురేంద్ర
…………………………………………
చురకలూ, అక్షింతలూ ఒకదానికొకటి సంబంధంలేని వేరువేరు పదాలుగా కనిపించినప్పటికీ, ఆ రెండు ఒకటేననిపించేంత సన్నిహిత సంబంధం కలవి. ఆ రెండు మల్లారెడ్డిగారే రాసినందువల్ల కాదు, అర్థరీత్యా కుదిరిన సామ్యం అది. అందులో అక్షింతలకు రెండు అర్థాలు ఉన్నాయి. శుభాకాంక్షలు సూచిస్తున్నది ఒకటైతే, ‘తప్పు చేస్తున్నావు’ అని హెచ్చరించేది మరొకటి. ఇందులో నా జ్ఞాపకంలో ఉన్నది మొదటిది. ఆ మొదటిది ఇలా మొదలయ్యింది.
ఆ మధ్య ట్రంకు పెట్టెలో బిగించి పెట్టిన చురకలు, అక్షింతలు అనుకోకుండా భళ్ళున బయటపడ్డాయి. అవీ చిన్న సంఖ్యలో కాదు, దాదాపు వేల సంఖ్యలో పైగా! అవి ఆశ్చర్యమూ, ఆనందము కలిగించాయి. దాంతో, వాటికి సంబంధించిన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. వాటిలో కొన్నయినా చెప్పుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. అప్పటికి విజయవాడలో విశ్వేశ్వర్రావు, శ్రీశ్రీ విశ్వేశ్వర్రావుగా పెరగలేదు. మైత్రి బుక్స్ విశ్వేశ్వర్రావుగానే ఉండేవారు. మా నాన్నగారి దగ్గరకు (ఆంధ్రజ్యోతి ఆఫీస్) వస్తూ పోతూ ఉండే నాకు, ఎదురుగా ఉన్న మైత్రితో మైత్రి అంకురించింది. ఆయన నాకు ‘బాల కుంచె’ అని ముద్దు పేరు పెట్టుకున్నారు.
83లో అనుకుంటాను, విశ్వేశ్వర్రావుగారు ఈ బాల కుంచెను హైదరాబాద్లో దించారు. చిన్న చిన్న పత్రికల్లో పెద్దపెద్ద కష్టాలు పడుతూ కొనసాగాను. అప్పుడు ‘ఆంద్రభూమి’ని గజ్జల మల్లారెడ్డిగారు ఏలుతున్నారు. అంతకు కొద్ది నెలల ముందు నాతో ఉద్యోగం లేదన్న ఆయన, సిగరెట్ పీలుస్తున్న ఒక యువకుడిని పిలిచి, ఆయనతో ఏదో చెప్పారు. ఆ యువకుడే సజ్జల రామకృష్ణారెడ్డి. సిగరెట్ పీలుస్తున్న ఆయన’ అని చెప్పటం ఎందుకంటే మల్లారెడ్డిగారు నచ్చిన సహోద్యోగులతో ఎంత చనువుగా ఉంటారో తెలియ చేయటానికే. అదిగో… అలా మల్లారెడ్డిగారికి దగ్గర అయ్యాను. ఆ తరవాత మల్లారెడ్డిగారు చురకలతో, అక్షింతలతో నన్ను ఆక్రమించుకున్నారు. నేనూ అందుకు ఉత్సాహంతో, సంతోషంతో ఒప్పుకున్నాను.
‘ఆంధ్రప్రభలో దేవిప్రియ, మోహన్ల ‘రన్నింగ్ కామెంటరీ’ బాగా పాపులర్ అయింది. ఆ ఇద్దరూ ‘ఉదయం’ డైలీలో చేరారు. అప్పుడు ‘ఆంధ్రభూమి’ని వదిలి ఉదయం సంపాదకుడుగా వచ్చిన మల్లారెడ్డిగారు ‘చురకలు’ పేరు మార్చి ‘అక్షింతలు’గా ప్రారంభించారు. అయితే మోహన్, దేవిప్రియల బదులు నన్ను కోరుకుని, యాజమాన్యంతో మాట్లాడి నన్ను ఉదయం డైలీకి రప్పించారు. నన్ను కోరుకోవటానికి కారణం ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య. ఉదాహరణకు మల్లారెడ్డిగారి వ్యాఖ్యను మించి నా బొమ్మ ఉండకూడదు, కానీ అనుగుణంగా వ్యాఖ్యలో లేనిదయినా ఉండవచ్చు. నేను ఆవిధంగా గీసినవి ఉన్నాయి.
కేంద్ర మంత్రి త్రిపాఠి మీద మల్లారెడ్డి వ్యాఖ్యకు నేను ‘ఘనాపాఠీ’ అన్నాను. అది మల్లారెడ్డి మాట కాదు. అలాగే సినారె, నన్నపనేని రాజకుమారి ఒకరినొకరు ప్రశంసించుకోవటం గురించిన మల్లారెడ్డిగారి వ్యాఖ్యకి నేను గీసిన బొమ్మ మరింతగా నచ్చింది. సినారె, నన్నపనేని రోకళ్ళతో దంచుతూ “దంచవే మేనత్త కూతురా!” అని పాడుతుంటారు. ఈ దంపుళ్ళ పాట పూర్తిగా నాదే. సినారెకి ఏమీ సంబంధం లేదు. ఈ పాట అప్పటికి ఆంధ్రప్రదేశ్ అంతట మారు మ్రోగిపోతోంది. సాహిత్యాన్ని ఆ పాట పూర్తిగా డామినేట్ చేసింది. మల్లారెడ్డిగారు సంతోషించారే తప్ప ‘నేను అలా రాయలేదే’ అనలేదు. ఇక బొమ్మలా? విజయవాడ రోజుల నుండి, నేను కార్టూనిస్ట్గా అవతారం దాల్చక ముందే మోహన్ అభిమానిని. ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడ్ని. కనుక ఆ వరవడి నాకు వచ్చింది. దీంతో మోహన్కీ, నాకూ పెద్ద తేడా లేకపోయింది (అక్షింతల వరకు మాత్రమే). ఇంతేకాక నేను ఎప్పుడు స్వతంత్రం తీసుకున్నా ఆయన ఏనాడూ ప్రశ్నించలేదు. ఒక్కోసారి ఆయన పద్యాన్ని బుట్టదాఖలు చేసినా ‘ఏంబాలేదా’ అని అడిగితే “ఇది మీ స్థాయిలో లేదు”
అనేవాణ్ణి. గురులఘువులు తెలియని, మాత్రా ఛందస్సు తెలియని కుర్రకుంకని, ఆయన పద్యాలను నేను చించిపడేయటం, ఆయన నవ్వుతూ చూడటమా? ఒక్కోసారి పొద్దున్నే ఆఫీస్కి వచ్చి
“పా.. సినిమాకి పోదాం” అని మార్నింగ్ షోకి తీసుకుని వెళ్ళేవారు. తను సంపాదకుడనని, గొప్ప కవి అని ఏనాడు అనుకోలేదు.
అయిదేళ్ళపాటు సాగిన మా స్నేహంలో ఎన్నని గొప్ప సన్నివేశాలు ఉటంకించేది. అందుకే మౌనంగా, మనసారా ఆ మహత్తర స్నేహాన్ని అక్షింతల రూపంలో ఆయనకు సభక్తికంగా సమర్పిస్తున్నాను.
………….. సురేంద్ర , కార్టూనిస్టు
కృతజ్ఞతలు
బడాయి అనుకోండి కాని, నేను పని చేసిన డజను పైగా పత్రికల సంపాదకుల్లో ఒకటీ అర తప్ప అందరు నన్ను ప్రోత్సహించినవాళ్ళే. నా కార్టూన్ల విషయంలో జోక్యం చేసుకోకుండా పూర్తి స్వతంత్రం ఇచ్చిన వాళ్ళే. ‘అక్షింతలు’ ఇలా పుస్తకంగా రావటానికి కారకులయిన నాన్న, అమ్మ, శారద, గజ్జెల అశోక్, మిత్రుడు అన్వర్ కి నా కృతజ్ఞతలు.
Star Cartoonist Surendra




