ప్రతిభకు దారులు — ప్రగతికి మెట్లు పరీక్షల సమయం జీవితానికి వరం

జీవితమే ఓ పెద్ద పరీక్ష అని సినీ రచయితే ఎవరో అన్నారు. బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు అన్ని దశల్లో పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాల్యం దాటి కౌమారప్రాయంలో ప్రవేశించగానే పదవ తరగతి,
ఇంటర్మీడియట్ పరీక్షలు కీలకమైనవి. ఇవి జీవనానికి, జీవిత గమనాన్ని నిర్ణయించడానికి దోహదం చేస్తాయి. వచ్చే వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం 23వ తేదీ నుంచి, తెలంగాణ రాష్ట్రంలో 25వ తేదీ బుధవారం నుంచి మొదలవుతాయి. దేశవ్యాప్తంగా సీబీఎస్ఇ పదవ తరగతి పరీక్షలు అప్పుడే మొదలయ్యాయి.

పరీక్ష అనగానే అందరికీ ఆందోళన, భయం కలుగుతాయనే విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. ప్రతి ఒక్క విద్యార్థి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడు విజయం వరిస్తుంది.  సమయపాలన, క్రమశిక్షణ, ఏకాగ్రత, 
మంచి జ్ఞాపకశక్తి ఉన్నట్లయితే అవి నాలుగు దిక్కులై మంచి జీవితానికి స్వాగతం పలుకుతాయి.సామాజిక శాస్త్ర విద్యార్థులు  సూత్రాలను, విజ్ఞాన శాస్త్రాలు చదివే విద్యార్థులు సమీకరణాలు వంద శాతం వచ్చే విధంగా చదవాలి.  
పరీక్షలకు ఏకాగ్రత అవసరమే కాదు కీలకం కూడా. ఏకాగ్రతని పొందడం అంత సులభం కాదు. టీనేజ్ లో ఉన్న  పిల్లలకు సినిమాలు, క్రీడలు, సెల్ఫోన్, సెల్ఫోన్లలో చాటింగులు ఇవన్నీ విజయానికి బ్రేకులు వేస్తాయి.  ఏకాగ్రతను 
అలవరచుకుంటే విద్యాభ్యాసం తరువాత జీవితం ఆనందమయంగా ఉంటుంది.  
పరీక్షలలో విజయానికి పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం తప్పనిసరి. ముఖ్యమైన అంశాలను  ఒక చోట రాసి ఉంచుకోవాలి. కష్టమైన వాటికి సంబంధించిన సందేహాలను గురువుల వద్ద నివృత్తి చేసుకోవాలి.  
పరీక్షలకు ముందు ఇతరుల వద్ద వాదన పెట్టుకోవడం, అనవసర విషయాలను ప్రస్తావించడం చేయకూడదు. సోషల్ మీడియాకు, దూరంగా ఉండాలి.  సినిమాలు, సరదాలకు మనసులో తెరదించాలి.   మీ వయసులో 
చదువు తప్ప మరేదీ ముఖ్యం కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అన్ని సబీజెక్టులకు సమాన ప్రాధాన్యత  ఇస్తూ చదవాలి.  

పరీక్షకు ఎంత బాగా ప్రిపేర్ అయినా పరీక్షా కేంద్రానికి సమయానికి ముందు చేరాలి. హాల్ టికెట్, పెన్ను వంటివి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. పరీక్షలు జరిగే రోజుల్లో బలమైన ఆహారం తీసుకోవాలి. ఆత్మబలం, జీవితంపై ఆశ, కెరీర్ మీద ప్రేమ ఉన్నప్పుడు పరీక్ష స్థాయి ఏదైనా విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది. అన్ని భావోద్వేగాలను నియంత్రణ చేసి ప్రశాంతమైన మనస్సుతో పరీక్ష రాస్తే ఎలాంటి ఒడిదొడుకులు ఎదురుకావు. పరీక్షలను ఉత్సాహంగా రాయవచ్చు.

 -- డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ 
     అధ్యాపకులు ,  99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *