మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కాప్రా పద్మశాలి సంక్షేమ సంఘం 34వ వార్షికోత్సవం డిసెంబర్ 25వ తేదీ గురువారం
ఘనంగా జరిగింది. సమావేశానికి హాజరైన అతిథులు విద్య ద్వారా సాధికారత సాధించి పద్మశాలీలు ముందడుగు వేయాలని తద్వారా అది సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని వక్తలు అన్నారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి శ్రీ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ విద్య, క్రమశిక్షణ, ఐక్యత ఎంతో కీలకమైనవని తద్వారా అవి సమాజ అభివృద్ధికి తోడ్పడగలదని అన్నారు. యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా నైపుణ్యం సాధించడంపాన దృష్టి పెట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా కాప్రా సంఘం రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ ను అతిథులు ఆవిష్కరించారు.
సంఘ అధ్యక్షులు శ్రీ ధార్న మల్లయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇంచార్జి కార్యదర్శి శ్రీమతి రాపోలు హేమలత నివేదిక సమర్పించారు. కోశాధికారి శ్రీ మద్దె ఆనందం ఆదాయ వ్యయ పట్టిక సమర్పించారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కు న్యాయ సలహా దారు డాక్టర్ కె. అజయ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజమే బలమైన సమంజమని, పద్మశాలి సంక్షేమ సంఘం పేదలకు అందిస్తున్న వైద్య, ఆరోగ్య సేవలు అభినందనీయమని అన్నారు. మహిళా సాధికారత దిశగా సంస్థ తీసుకుంటున్న చర్యలు సమాజంలో మార్పునకు నాంది పలుకుతున్నాయని ప్రశంసించారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ కందగట్ల స్వామి మాట్లాడుతూ పద్మశాలీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఐక్యత అవసరమని, స్వయం సహాయక బృందాల ద్వారా కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకు రావాలని ఆకాంక్షించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజకుమార్ మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో గెలుపొందిన కొత్త సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలలో కూడా పద్మశాలీ కులస్థులు ముందుండి విజయం సాధించాలనే అభిలాషను ఆయన వ్యక్తం చేశారు. అఖిల భారత పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వనం దుశ్యంతల, తెలంగాణ రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వెంగల మధుసూదన్ , కోరల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అంబటి చెన్నకిష్టయ్య , సంఘ సేవకులు శ్రీ తాటికొండ పట్టాభి, అవిఘ్న సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రసన్నేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి శ్రీ వనమాల శంకర్, డైరెక్టర్ శ్రీమతి వనమాల వీణాదేవి తదితరులు పాల్గొన్నారు. జంటనగరాలకు చెందిన వివిధ పద్మశాలి సంఘాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. వార్షికోత్సవంలో పద్మశాలి వధూవరుల పరిణయ పరిచయ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు పద్మశాలి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చేసిన అభినయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పబ్లిక్ , ఎంట్రెన్స్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రదానం జరిగింది.
మూడున్నర దశాబ్దాల ముచ్చట
పద్మశాలి సంక్షేమ సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముప్పయి నాలుగేళ్ల ముచ్చట ఇది. రాధికా థియేటర్ దగ్గరి శ్రీనివాస నగర్ లో 18 కుటుంబాల సభ్యత్వంతో కాప్రా సంఘం చిగురించింది. ఆ తరువాత కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మొగ్గ తొడిగి ఇంతింతై మానుగా మారింది. సంఘం అభివృద్ధికి నైతిక బలాన్ని చేకూర్చిన మహనీయుడు అందరూ ‘కాకా’ అని పిలుచుకునే కీర్తిశేషులు పులిపాటి స్వామి. పద్మశాలీల కోసం సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి శ్రావణ పూర్ణిమకు గాయత్రీ ధారణ, విహార యాత్రలు, దీపావళికి సహకార పద్ధతిలో చౌక ధరల్లో టపాకాయల పంపిణీ, ఆర్ధిక తోడ్పాటు వంటివి ఉన్నాయి. ఆయా సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో రిటైరైన ఉద్యోగులకు సన్మానం, వార్షిక, ఎంట్రెన్స్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం, పద్మశాలి వధూవరుల పరిణయ/పరిచయ వేదిక నిర్వహించడం వంటివి జరుపుతారు. ఆపద కాలాలలో మంచిచెడుల్లో సహచరులకు తోడుగా ఉండటం జరుగుతోంది. భవిష్యత్తులో సంఘ భవనాన్ని విస్తరించి విద్యార్థులకు వసతి గృహం నిర్మించాలనే ప్రతిపాదనఉంది.








