రెండు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంకురాత్రి అల్లుళ్ళు కూడా రావడం మొదలైంది. వెండితెరపై సంక్రాంతి సంబరాలు మొదలెట్టడానికి నిర్మాతలు వారం వ్యవధిలో సినిమాలు విడుదల చేయడానికి అన్ని చేశారు. కథా పరిమళంలో అందంగా పొదిగిన ఊహలు, ఆలోచనలు, భావాలు, కథనాల సమాహారం సంక్రాంతి పందెంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి రెండు తెలుగు సినిమాలు జనవరి 9వ తేదీకే విడుదల కావడం విశేషం. ఇప్పుడు వస్తున్న సినిమాలు జాగ్రత్తలు, వర్ధమాన తారలవి కావడం విశేషం. జనం అంతరంగాల్ని పరవశింపజేసే అనుభవాలకు సాక్ష్యంగా నిలుస్తాయి వెండితెర కథలు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వంటి వారందరూ తమ కొత్త చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ప్రేక్షకులు తమ అభిమాన నటుల చిత్రాలను మాత్రమే చూసేవారు. ఇప్పుడు వారి అభిరుచులు మారాయి. ఇప్పుడు
వచ్చిన ఆరోగ్యకరమైన మార్పు ఏమిటంటే అందరి సినిమాలు చూడటం, అభినందించడం. కుటుంబ సభ్యులందరూ కలసి ఒకేసారి సినిమా చూసే అరుదైన సందర్భం సంక్రాంతి అంటే అతిశయోక్తి కాదు. కుటుంబ సభ్యులే కాకుండా బంధుగణం అందరూ తమ సంతోషాల్ని సినిమాపరంగా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తోంది.

సంక్రాంతి మొదట వచ్చిన సినిమా రాజాసాబ్ . ఈ చిత్రం హాస్యాన్ని తనదైన శైలిలో పండించే మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా. మారుతి సినిమానాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. గతంలో వచ్చిన మహానుభావుడు సినిమా అందరికీ విపరీతంగా నచ్చింది. ప్రభాస్ సినిమాలు సాధారణంగా యాక్షన్ కథలతో నిండి ఉంటాయ్. ఇప్పుడొచ్చిన రాజాసాబ్ చిత్రం హార్రర్ కామెడీని కలిగి ఉంది. చాలాకాలం తరువాత ప్రభాస్ నుంచి కామెడీ జోనర్ పై వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి ఉంది. సంక్రాంతికి వచ్చిన మొదటి చిత్రం కావడం, ఈ ఏడాది పండగ చిత్రాలకు పచ్చ జెండా ఊపడం ద్వారా ఈ చిత్రం ప్రతి వారికి ఆకర్షణగా నిలిచింది.
కుటుంబ నేపథ్యంతో తీసిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్ప్పుడూ ఉంటుంది. కుటంబ కథలకు హాస్యాన్ని మేళవించి సినిమాకు రూపకల్పన చేయడంలో తిరుమల కిషోర్ దిట్ట. రవితేజ కామెడీ మార్క్ తెరపైన
బాగా పండుతుంది. ఈ సారి చాలా గ్యాప్ తరువాత రవితేజ సంక్రాంతి పందెంలో నిలుస్తున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనేది కుటుంబ కథాచిత్రం అని పేరుతోనే అర్ధం అవుతోంది. సినిమాలో విపరీతంగా గ్లామర్ కూడా రంగరించారు. ఈ చిత్రం ప్రేక్షకులలో ఆదరణ పొందుతుందని సినిమా బృందం ఆశిస్తోంది.

రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ రచనలకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇటీవల కాలంలో సినిమాలు తగ్గి నిర్మాణం వైపు దృష్టి సారించారు. తన మిత్రుడు సూర్యవంశీ నిర్మాతగా చిత్ర నిర్మాణం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హాస్య భావోద్వేగంతో ప్రేక్షకుల తీర్పునకు రావడం కొసమెరుపు. శర్వానంద్ చిత్రాలకు కుటుంబ ప్రేక్షకులలో విపరీతమైన ఆరాధన. గతంలో వచ్చిన ‘రన్ రాజా రన్’ , శతమానం భవతి చిత్రాలు ఆయా సంవత్సరాల్లో సంక్రాంతి విజేతలుగా నిలిచాయి. ఈ సారి నారీ నారీ నడుమ మురారీ చిత్రం కుటుంబ నేపథ్యంలో తయారైంది.

సంక్రాంతి అనువాద చిత్రాలు రావడం సర్వసాధారణమైన విషయం. తమిళనాట తమిళ వెట్రి కళగం (టివికె) ప్రాంతీయ పార్టీ స్థాపించిన విజయ్ హీరోగా నటించిన ‘జననాయకుడు’ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టు వ్యాజ్యాల కారణంగా విడుదల వాయిదాపడింది. సినీ హీరోల ఆశలు, కలలు సంక్రాంతికి నెరవేరగలవని, వెండితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచగలదని ఆశతో వేచిచూద్దాం.
— డాక్టర్ దువ్వూరి సుబ్రమణ్య శర్మ
సినీ పరిశోధకులు





