ముచ్చింతల్ లోని సమతామూర్తి సన్నిధిలో సమతాకుంభ్-2026 బ్రమోత్సవాలూ వైభవంగా, భక్తులకు కన్నుల పండువగా జరుగుతున్నాయి. జనవరి 30న ప్రారంభమైన ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. భాగ్యనగర శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా ఘనంగా సమతా కుంభ్ ఉత్సవాలుగా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తుంటారు.సమతా కుంభ్ ఉత్సవాలలో ఇది నాల్గవది. 4వ వార్షిక సమతా కుంభ్-2026లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమంజన సేవ భద్రపీఠంలో 120 కిలోల బంగారు శ్రీరామానుజాచార్యులకు, మూలవిరాట్‌లకు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. పూర్ణిమరోజు గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిపారు. శాంతి కల్యాణ మహోత్సవం108 దివ్యదేశాల దేవీ, దేవతలకు నిర్వహించారు.ఈ వైభవాన్ని తిలకించడానికి ఈ సంవత్సరం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 9వ తేదీవరకు నిర్వహించే ఉత్సవాలలో రథోత్సవం, పుష్పయాగం, వాహన సేవలు, తెప్పోత్సవం, వసంతోత్సవం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఉత్సవాలు నిర్వహిస్తున్న 11 రోజుల వేడుకల్లో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఇల వైకుంఠాన్ని తలపించేలా ముచ్చింతల సమతామూర్తి సన్నిధి వెలుగొందుతున్నది. దాదాపు 45 ఎకరాలలో వ్యాపించి ఉన్న సువిశాల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. విశేషించి ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం – సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.





