
సరిగమలకు అచ్చమైన అందం స్వరంలో వినపడుతుంది. ఒక్కొక్కసారి పదాలోని అన్ని భావుకత నిండారా ఆస్వాదించాలి అంటే మధురమైన సంగీతం స్వరం సాహిత్యాన్ని అందంగా ఆవిష్కరిస్తాయి. దక్షిణాది సినీ సంగీతం గర్వపడే గాయని జానకమ్మ స్వరం నిజంగా సంగీత ప్రియుల నుంచి సామాన్య ప్రజల వరకు ఒక అనుభూతిని వరంగా మిగిల్చింది. తెలుగు పాటకి దశాబ్దాలుగా అజరామరమైన సేవను అందించిన జానకమ్మ మన మధ్య నుంచి భౌతికంగా నిష్క్రమించినా నిత్యం పాట పారవశ్యంగా నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వేలాది పాటలకు తన అద్వితీయ ప్రతిభ ద్వారా జీవం పోశారు. చిత్రాల విజయం వెనక పాటల ప్రభావం ఎంతైనా ఉంది. సహ గాయకుడు ఎస్ పీ బాలు గాన సాహచర్యంలో ఎన్నో వందల గీతాలకు మాధుర్య గాన స్పర్శ అందించారు. ఇప్పటికీ అవి ఆపాత మధురాలు. దర్శకులు బాపు, విశ్వనాధ్ , రాఘవేంద్రరావు, దాసరి భావచిత్రాలకు జానకమ్మ గానం అద్వితీయంగా నిలిచింది. పాటలో సాహిత్య విలువలున్నీ అపురూప గానం ద్వారా ఆవిష్కరించారు పాటల్లో విభిన్న భావోద్వేగాలు ప్రతిబింబించాయి. వేదన, ఆనందం, ప్రేమ, కోపం ఇలా విభిన్న భావాలు రంగరించారు. సిరిమల్లె పువ్వా పాటలో కన్నె మనసు అంతరంగాన్ని, మంచు కురిసే వేళ పాటలో ప్రేమ లాలిత్యాన్ని , కీరవాణి అంటూ సంగీత ప్రపంచాన్ని , సువ్వీ, సువ్వీ అంటూ ఆర్ద్రత స్వరాన్ని, ఓం నమశివాయ అంటూ భక్తి భావాన్ని, సీతాకోకచిలుకలో మాటే మంత్రం అంటూ ప్రేమనీ, ఏ లీల పాడెద దేవా అంటూ నాదస్వరాన్ని, వెన్నెల్లో గోదారి అందం అంటూ విరహవేదనని, దుర్యోధన దుశ్శాసన అంటూ
ఆక్రోశాన్ని, ఆకాశంలో హరివిల్లు అంటూ అతివ ఆశల అంతరంగాన్ని, మనసు పలికే మౌన గీతం అంటూ మనసు భాషని తన గొంతులో స్వరం ద్వారా అభినయానికి అందంగా జత చేకూర్చర్రు. శంకరాభరణం, సప్తపది చిత్రాల్లోని పాటలు అన్ని తరాల వారికీ నచ్చాయి. జానకమ్మ మన మధ్య లేకున్నా ఆ స్వరం మనల్ని నిత్యం సంగీత ప్రపంచ సరిహద్దుల్లోకి తీసుకుని వెళ్తుంది. అమరపురిలోదేవతల చెంత తన గానాన్ని అందించడానికి వెళ్లిన జానకమ్మకు భారతీయ సంగీత అభిమానుల తరపున అశ్రునివాళి.శృతిలయలలో ఎస్. జానకి అమరజీవి.
–డాక్టర్ డి.వి.ఎస్.ఎస్. శర్మ, సినీ పరిశోధకులు , 99490 39175


