వెండితెరపై ‘శివతత్వం’

భావోద్వేగాలకు చిరునామా వెండితెర. ప్రారంభచిత్రం కూడా భక్తి భావోద్వేగ అంశం కావడం గమనార్హం.హరిహరాదులు ఇద్దరిపట్ల జనం భక్తి ప్రదర్శనలో తేడా ఉండదు. అయితే ఎక్కువమంది శివయ్యేనే అధికంగా ఆరాధిస్తారు. సృష్టిలో సమస్త జీవరాశి శివపరమాత్మను కొలుస్తారు. సాలెపురుగు, ఏనుగు, సర్పం పోటీపడి శివుణ్ణి పూజించడంవల్ల శ్రీకాళహస్తి క్షేత్రం ఆవిర్భవించింది. కవి సార్వభౌముడు శ్రీనాథుడు, తెనాలి రామలింగడు, ధూర్జటి వంటి కవిపుంగవులే కాకుండా అక్షర జ్ఞానం లేని కన్నప్ప వరకు అందరూ శివసాన్నిహిత్యం గురించి పరితపించారు.

  తెలుగు సినిమాలలో ప్రేమ,వినోదం రెండు భావోద్వేగాల కన్నులుగా నిలిచాయి.అయితే ప్రశాంతతతో నిండిన భక్తిరస ప్రధాన చిత్రాలు ప్రేక్షక హృదయాలను అపార కైలాసంగా మార్చి వారిలో ఆధ్యాత్మికతను పెంచాయి.రెబెల్ స్టార్ గా పేరొందిన కృష్ణంరాజు తన చిత్రాలలో శివుడికి సంబంధించిన దృశ్యాలను చిత్రంలోని సన్నివేశాలను కలిపేవారు.నటుడిగా నిలదొక్కుకొన్న కొద్దీ సంవత్సరాలకు తన సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ ద్వారా ఎంతో పరిశోధన చేసి 'భక్త కన్నప్ప'చిత్రాన్ని చిరస్మరణీయంగా,తెరస్మరణీయంగా ప్రేక్షకలోకం మరచిపోలేని స్మృతికావ్యంగా తీర్చిదిద్దారు.  వేటూరి భావసంపద  తోడుకావడంతో శివతత్వాన్ని బాగా సాన్నిహిత్యం చేసింది.  బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో అపర శివభక్తుడిగా నటించిన కృష్ణంరాజు నటనకు ఎస్పీ బాలు ఆలపించిన శివతాండవ స్తోత్రం తోడు కావడంతో అందరి ప్రశంసలు పొందింది.  వినాయక విజయం చిత్రంలో  కృష్ణంరాజు శివుడిగా కనిపించారు. పులిబిడ్డ చిత్రంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ,వారణాశి తీరాన కాశీ విశ్వనాథ అనే పాటను బాలు తన స్వర నీరాజనంగా సమర్పించారు.వేటూరి,సినారె,ఆరుద్ర వంటి కవులు కూడా శివుడికి అక్షరమంత్రపుష్పాలు సమర్పించారు.  

  ఎన్ఠీఆర్ అనగానే ప్రతి ఒక్కరికీ రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వర సామి, అర్జునుడు, దుర్యోధనుడుతో పలు పౌరాణిక పాత్రలు కళ్ళముందు కదులుతాయి.  దక్షయజ్ఞం చిత్రంలో ఎన్ఠీఆర్ నీలకంఠుడిగా మెరిశారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్ఠీఆర్ కు జరిగిన విషాదం వలన శివుడి పాత్రలు ధరించరాదని నిర్ణయం తీసుకున్నారు.ఎన్ఠీఆర్ వారసుడు బాలకృష్ణ సీతారామకళ్యాణం చిత్రంలో ఒక పాటలో శివుడిగా కనిపించారు. బాలకృష్ణ  నటించిన అఖండ చిత్రం ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉంటుంది.  

   శివుడు అనగానే మునుపటి తరం  ప్రేక్షకులకు   కళాతపస్వి కె.విశ్వనాథ్ గుర్తుకువస్తారు.  ఆయన దర్శకత్వంవహించిన చిత్రాలు శివతత్వాన్ని వివరించే పాటలు, దృశ్యాలు, కథ కథనాలతో నిండివుంటాయి.సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది,సాగర సంగమం పేర్కొనాలి.అంతేకాక శృతిలయలు,సిరివెన్నెల చిత్రాలు ఉత్తరాదిలో పుణ్యక్షత్రాలైన సారానాథ్, రుషికేశ్, గయ,  ప్రయాగతో పాటు కాశీలో కూడా చిత్రీకరించారు.  

   ఇంకా అనేక సాంఘిక చిత్రాల్లో కూడా ఈశ్వరుడికి ప్రాధ్యానత ఉంటుంది. డమరుకం, పౌర్ణమి, మయూరి, ఎదురులేని మనిషి చిత్రాలు ఇందుకు ఉదాహరణ. వేంకటేశ్వర స్వామి భక్తుడు మంజునాథుడి కథను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు   శ్రీ మంజునాథగా దృశ్యభరితంగా మలిచారు. 

    రెబెల్ స్టార్ వారసుడు ప్రభాస్ ప్రారంభ చిత్రం ఈశ్వర్. బాహుబలి చిత్రంలో కేరళ వద్ద జలపాతంలో శివలింగం పట్టుకుని వెళ్లే దృశ్యాలు, శివతాండవ స్తోత్రం ఇవన్నీ ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తాయి. ఆ విధంగా భూ కైలాస్ వంటి పౌరాణిక చిత్రాలలో ఘంటసాల, ఎస్పీ బాలు గానం చేసిన శివస్తుతి ఇవన్నీ చిత్ర గీతాల ద్వారా శివతత్వాన్ని నిత్యం సాక్షాత్కరింపజేస్తున్నాయి.  

— దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , సినీ పరిశోధకులు
మొబైల్ — 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *