వరప్రదాత వరాహ లక్ష్మీనరసింహ స్వామి

** సింహాచలంలో చందనోత్సవ వేడుక

   భగవంతుని అవతారాలు అన్ని మంచిని రక్షించి చెడుని శిక్షించాయి.  
ఎప్పుడు ఏ అవతారం ఆవిర్భవించినా దాని వెనుక పరమార్ధం దాగి ఉండే
సృష్టి, స్థితి, లయ అన్నియు దేవుడు అనే సంగతి అందరికీ తెలుసు. శ్రీహరి
దశావతారాలు అన్ని ధర్మాన్ని పరిరక్షించాయి. విలువలను సమర్ధించాయి.
కొన్ని అవతార స్వరూపాలు మానవ జీవనానికి నడకను, నడతను ఎలా ఉండాలో
నిర్దేశించాయి. సన్మార్గం కరువై దుర్మార్గం కట్టలు తెంచుకున్నప్పుడు
భగవంతుడు ఒక్కొక్కసారి జంతు రూపంలో కూడా దర్శనం ఇవ్వడం విశేషం.
   వరాలను పొందిన భక్తులు విర్రవీగి అహంభావంతో ప్రవర్తించినప్పుడు,  
భగవంతునికన్నా అధికులమని గర్వంగా జీవించి అందరినీ వేదనకు గురిచేసినప్పుడు
కాలం వారికి కఠినమైన తీర్పును ఇస్తుంది. కాలస్వరూపుడు ఖచ్చితంగా భగవానుడే.
   చర్యకు ప్రతి చర్య దాగివుంటుంది.  ప్రతి ఒక్క అవతారం ఊపిరి పోసుకోవడం వెనుక 
పవిత్రమైన ఆశయం మంచి ప్రతీకగా ఉంటుంది. నరసింహ అనే పదం రౌద్ర
భావోద్వేగానికి అచ్చమైన ప్రతీక. తెలుగునాట నరసింహ స్వామి ఆరాధన విశేషంగా ఉంది.
అంతటా ప్రాచుర్యం పొందిన నవనారసింహ స్వామి క్షేత్రాలు ప్రతి ఒక్కరికీ పరిచయం.
సింహాచలం, అహోబిలం, దిగువ అహోబిలం, మంగళగిరి, అంతర్వేది, యాదాద్రి, కోరుకొండ
వంటివి ప్రసిద్ధి చెందాయి. ఇలా ఈ క్షేత్రాలు నరసింహ స్వామి భక్తులకు నవపారిజాతాలు.
వైశాఖం అనగానే ప్రతివారికి అక్షయ తృతీయ, సింహాచలం చందనోత్సవం స్మరణకు వస్తాయి.
ఒక్క వైశాఖ తృతీయ నాడు మాత్రమే స్వామి నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. నరసింహ స్వామి
ఉగ్రరూపాన్ని చల్లబరచడానికి ఏడాది పొడవునా మూల విరాట్ ను చందనంతో కప్పిఉంచుతారు.
వరహ ముఖం సింహరూపం కలబోసిన స్వామిని వీక్షించి మురిసిపోతారు. తెలుగు రాష్ట్రాల నుంచే
కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు సింహాచలం వస్తారు.
    సింహాచల దర్శనం  మనసుకి  ఆధ్యాత్మికతను అందించడంతో పాటు ప్రకృతి రమణీయత 
, సౌందర్యం ప్రశాంతతను కలిగిస్తుంది. పచ్చని వృక్షాలు , శిఖర శిరస్సుల నుంచి జాలువారే జలపాతాలు
అనుభూతిని సమర్పిస్తాయి. సింహాచలం అనగానే శిల్పరమణీయత , కోర్కెలు తీర్చే నరసింహ స్వామి
కప్పు స్తంభం మన మదిలో మెదులుతాయి. చందనోత్సవ వేళ సింహాద్రి అప్పన్న దర్శనం
పూర్వజన్మ సుకృతం. విశాఖ నగరం వచ్చిన పర్యాటకులు ఖచ్చితంగా సింహాచల క్షేత్రం
వెళతారు.

–డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *