మీరు ఆదర్శ దంపతులేనా? ప్రశ్న చిన్నదైనా ప్రతి ఒక్కరినీ తికమక పెట్టడం తథ్యం. ఈ ప్రశ్నే ఈ పుస్తకం కోసం జరిపిన పరిశోధనకు పునాది. పుస్తక రచయిత ఆచార్య శిలగాని మార్కండేయ తమ పరిశోధన ఫలితాలను ఏర్చి, కూర్చి రూపొందించిన పుస్తకం ‘ఈ తరం పెళ్ళి’. ఏ తరం వారినైనా అలరించిన ఆసక్తితో చదివించే ఈ తరం పెళ్ళి పుస్తకం వైవాహిక జీవితంపై నేటి యువత ఆలోచనలో మార్పు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వివాహ బంధం విశిష్టత విశ్వవ్యాపితమైంది. అందులో ముఖ్యంగా భారతీయ వైవాహిక వ్యవస్థ పలు దేశాలలో ప్రశంసలు అందుకుంటున్నది. ‘ఈ తరం పెళ్ళి’ పుస్తకం రచయిత మార్కండేయ పది సంవత్సరాల పాటు పడిన తపన, మధనానికి అక్షర రూపం. ఒక వ్యక్తి శక్తివంతంగా రూపొందించి విశ్లేషణాత్మకంగా పొందుపరచిన వివరాల సమాహారం. పొద్దున్న లేస్తే పెళ్లిళ్ల గురించి వస్తున్న దుర్వార్తలు,ఆ వార్తల్లో నిజానిజాల మాట ఎలా ఉన్నా, సమాజం నమ్ముకున్న ఈ దాంపత్య జీవనం కొన్ని కలుపు మొక్కలతో కలుషితం కాకూడదన్నదే రచయిత ఆవేదన. దంపతులు ఒకరికొకరు మరింత దగ్గర కావడానికి ఎన్నో సామెతలతో , విజ్ఞానదాయక సూక్తులతో వ్యక్తిత్వ వికాసానికి మరింత తోడ్పడేదిగా ఈ గ్రంథాన్ని పాఠకుల ముందుంచినట్లు రచయిత ముందుమాటలో తెలిపారు. పాఠకుల సంతోషమే పరమావధిగా ఈ పుస్తకాన్ని అందించినట్లు కూడా పేర్కొన్నారు. అనుదిన సూక్తి అందరికీ స్ఫూర్తి అయిన ‘ఈ తరం పెళ్ళి’ వివాహితులు, పెళ్లికాని యువత ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథం.





