అంతులేని కథ చిత్రానికి యాభై ఏళ్ళు. దక్షిణాదిలో పేరొందిన దర్శకుడు కె. బాలచందర్ తెలుగులో 1976లో దర్శకత్వం వహించిన అంతులేని కథ యాభయ్యవ పుట్టిన రోజు ఫిబ్రవరి 27. 1976 ఫిబ్రవరి 27వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ఇంకా మరో చరిత్ర , కోకిలమ్మ , ఇది కథ కాదు , రుద్ర వీణ , ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాలకు కూడా బాలచందర్ దర్శకత్వం వహించారు. మొదట 1974లో తమిళంలో నిర్మించిన అవళ్ ఒరు తొడరు కథై చిత్రంలో సుజాత పోషించిన కథానాయిక పాత్రకు తెలుగులో జయప్రద జీవం పోశారు. తనకు నచ్చిన, ప్రేక్షకులు మెచ్చిన పాత్రగా జయప్రద చెప్పుకున్నారు. ఈ చిత్రంలో ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి, రజనీకాంత్ , శ్రీప్రియ , అతిథి పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు. ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ తెలుగులో కూడా తమిళంలో పోషించిన పాత్రలనే పోషించారు. రజనీకాంత్, కమల్ హాసన్ లకు తెలుగులో ఇది మొదటి చిత్రం. ఈ సినిమాలో అవుట్ డోర్ సన్నివేశాలు విశాఖలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ‘తాళికట్టు శుభవేళ’ పాటలో మిమిక్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పాటలన్నీ ఆచార్య ఆత్రేయ రచించగా, ఎం. ఎస్. విశ్వనాథం సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో కూడా రామ అరంగణణల్ నిర్మించారు.






