‘ఎంతో రసికుడు దేవుడు ఎన్నిపూవులెన్ని రంగులిచ్చాడు అన్నిటిలో నిన్నే చూడమన్నాడు’ అని రాశాడో కవి.ప్రకృతి ప్రసాదించిన అన్ని రంగులను చూడటమే కాదు వాటి ఉత్సవాన్ని జరుపుకోవడమే రంగుల పండగ హోలీ. ఈ పండుగను అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు. హొలీ పండుగ దైనందిన జీవిత గమనాన్ని మార్చి బంధుమిత్రులను సన్నిహితం చేసి సానుకూలతను వ్యాప్తి చేయడానికి తోడ్పడుతుంది. రంగులు చల్లుకోవడం, మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది.
సినిమాలు మన నిజజీవితానికి ప్రతిబింబాలు. నాటి నలుపు తెలుపు చిత్రాల నుంచి నేటి ఈస్టమన్ కలర్, ఫ్యూజీ కలర్ వరకు ఎన్ని రూపాలు సంతరించుకున్నా దాని వెనుక వర్ణం
వయ్యారంగా దాగివుంటుంది. దృశ్యం ఏదైనా అది భావాల పల్లకిలో విహరించడానికి సప్తవర్ణ రాజసం కనిపిస్తుంది.
సినిమాలకు ఊపిరి పాటలు. సన్నివేశాన్ని రక్తి కట్టించడంతో పాటు మనల్ని ప్రకృతి దృశ్యాల నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు తీసుకెళ్తాయి పాటలు. రంగుల కుంచెలతో పాటలను అలంకరించినప్పుడు అవి సౌందర్య సమారాధన గావిస్తాయి. దానికి కవుల కల్పన తోడైతే వెండితెర జీవం ఉట్టిపడేలాగ మురుస్తుంది. ఇటీవల వచ్చిన 'అమరన్' చిత్రంలోని 'హే రంగులే' అనే పాట విన్నప్పుడు హృదయం సున్నితంగా స్పందిస్తుంది. సైనిక నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమ కథకు రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన సాహిత్యం నిజంగా కలల రంగుల వాన కురిపించింది. స్వరం, సంగీతం, సాహిత్యం, భావాలు మేళవించి అమృతంలా చిలికాయి. ప్రేయసీ ప్రియుల అనురాగం గాయకుల స్వరంలో చిగురించింది.
ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో ఉన్నప్పుడు 'రంగ్ దే' చిత్రంలో శ్రీమణి ఆంక్షరాలకు అద్దిన అద్దిన అందమైన రంగులు అమ్మాయి అంతరంగాన్ని చిలిపిగా ఆవిష్కరించాయి. రంగుల గురించి చెప్పిన ఆత్మీయ సంగతులు విపరీతంగా నచ్చాయి. కన్నెమనసు కలలకు సాక్షిగా దృశ్యం సంతకం చేసింది. దృశ్యాలకు పులిమిన రంగుల సోయగాలు పాట చిత్రీకరణ రంగుల పాటకు కొత్తదనంగా జీవం పోసింది. దేవిశ్రీ స్వరాలు రంగుల వానలో నడిచి రాగాల చినుకులను అందించాయి.ప్రేయసీ ప్రియుల వస్త్రాలు రంగుల పాటకు భావ హారతులుగా వెలిగాయి. వెండితెర అంతా రంగులు నింపిన పాట 'రాఖీ' చిత్రంలో రంగు గురించి చెప్పడమే కాకుండా అన్ని రంగులు కలసి సందడి చేశాయి. కథనాయకుడి ఆనందమంతా ఈ పాట పల్లవి, చరణాలలో కనిపిస్తుంది.
ఎనభయ్యవ శకంలో ప్రేమకథలన్నీ కవుల ఊహల్లో అందంగా ఒదిగేవి. అభినందన చిత్రంలో తన ప్రేమని 'రంగులో కలవో ' అని పాడటం ద్వారా భావత, ఆర్ద్రత రంగుల ద్రావణంలో జన్మించాయి. ఆమని పాడవే అని గీతాంజలి చిత్రంలో బాలు స్వరాలు, వేటూరి అక్షర వర్ణనలు, ఇళయరాజా సంగీతం, మణిరత్నం ప్రతిభ అన్నీ ఆ భావనలో ఊరేగించారు. రంగస్థలంలో చిత్రంలో 'రంగా రంగా' అనే పాటలో రంగుల వస్త్రాలు ధరించిన కళాకారులు గ్రామీణ సంస్కృతి ప్రదర్శించారు.
బాపు , వంశీ, రాఘవేంద్రరావు భావుకత కలిగిన దర్శకులు. చిత్రకారుడైన బాపు కథాగమనాన్ని తన కుంచెతో చిత్రీకరించేవారు. వంశీ తన సినిమాల్లో పాటలని రసరమ్యంగా చిత్రీకరించేవారు. కృష్ణవంశీ, జంధ్యాల , గుణశేఖర్, తేజ, రాంగోపాల్ వర్మ , శేఖర్ కమ్ముల వంటి నవ్యత గల దర్శకులు రంగులను మురిపెంగా పాటలకు భావకుంచెలతో దృశ్య భావోద్వేగాలతో సమర్పించేవారు. రంగు మానసిక భావన అది ఆనంద విషాదాల సంగమం. రంగులు వెండితెరపై పాటలుగా అడుగులు వేసినప్పుడు మ నసు పులకరించి పరవశిస్తుంది.
డాక్టర్ డి వి ఎస్ ఎస్ శర్మ , సినీ పరిశోధకులు, 99490 39175





