మూడో కన్ను తెరిచిన చక్రధర్

ఊరికే దిగులెట్టుకుంటాడు. బెంగపడిపోతాడు. దుఃఖం లోపల నిరంతరం కురుస్తూనే ఉంటుంది. రుతుపవనాలు కను కొలకుల దగ్గర సందడి చేస్తుంటాయి. కట్టడి చేస్తుంటాడు చాలా వరకూ. ఎందుకంటే రాసుకోవడానికి కొంత మిగిలి ఉండాలిగా దుఃఖం. కానీ, ఒక్కోసారి దేహమంతా మబ్బులా ఊగిపోతుంది. అప్పుడు ఇక ఎవరూ ఆపలేరు. ఉరుములు మెరుపులేని వర్షం. నిశ్శబ్ద వర్షం. ‘పండిట్ బిర్జూ నా హృదయాన్నిస్తా నీ కాలికి కట్టుకోవూ’ అంటాడు. అలా రవీంద్ర భారతి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్సుకు నడుస్తూ వస్తున్నప్పుడు వాడితో పాటు మనమూ తడిసిపోతాం. అస్టోరియా రెస్టారెంటులో వన్ బై టూ చాయ్ తాగి, పాన్ షాప్ రేకు కప్పు కింద సర్దుకుని గుప్పున సిగరెట్లు పీల్చుకుంటూ కాస్త వెచ్చబడతాం. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కొత్త పుస్తకం ఏదైనా ఆవిష్కరణ జరిగితే అక్కడ ఉండాల్సిందే. అలా అలా ఆ పరిచయం నరేశ్ నున్నాను, చల్లా రామఫణిని వెంటేసుకుని సిద్ధార్థ కోసం ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంపౌండుకు ఆనుకుని ఉన్న జీరాక్స్ షాపు దాకా సాగిపోయింది. నెలనెలా వెన్నెల కోసం సైఫాబాద్ గ్రంథాలయానికి వెళ్ళడం కవిత్వంలో మునిగిపోవడం కోరి తెచ్చుకున్న అనుభవం. అక్కడే సీవీ కృష్ణారావుగారూ, సుమనశ్రీగారూ, వడలి మందేశ్వర్రావుగారూ, రామ్మోహన్ రాజుగారూ ఇలా చాలా మంది పరిచయం. అవన్నీ మామూలు పరిచయాలు కాదు. జీవితంలోకి విత్తనాల్లా చొరబడి వృక్షాల్లా ఎదిగిన అనుభవాలు. ఆ జమిలి బంధాల్లో ఒక బలమైన పాయ నా ముక్కామల చక్రధర్.

ఆంధ్రభూమిలో అప్పటికే కల్చరల్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. 1993లో సికరాజు ఎడిటరయ్యాడు. అప్పటికే రామఫణి అక్కడ పని చేస్తున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి కంపెనీ సెక్రటరీ కోర్సు వెలగబెడదామనుకుని కవిత్వంలో కూరుకుపోయాను. ఈ పిచ్చికి జర్నలిజం నప్పుతుందిలే అని పొలోమని ఆంధ్రభూమిలో సబ్బెడిటర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. రెండు వ్యాసాలు, ఓ ఫోటో స్టోరీ రాయమని ఎడిటర్ గారు పరీక్ష పెడితే, మరో రెండు వ్యాసాలు బోనస్‌గా ఇచ్చి మరునాడే అంటే మార్చి నెలలో ఓరోజు ఉద్యోగంలో చేరిపోయాను. కుర్ర వయసులోనే బాల చెలిమికి ఎడిటర్ గా ఉన్న మిత్రుడు చల్లా శ్రీనివాస్ అదే నెలలో ఆంధ్రభూమిలో సబ్బెడిటర్‌గా డీమోట్ అయ్యాడు. సైట్ ఇంజనీర్ పనితో చిర్రెత్తిపోయిన నరేశ్ నున్నా కూడా మరికొన్ని రోజులకు మా గుంపులో చేరిపోయాడు. అలా మేం మ్యాగ్నిఫిసియెంట్ ఫైవ్‌గా చెలరేగిపోయాం. మాలోంటళ్ళకు గురువు అంటే ఎలా ఉండాలి? ‘మిట్ట మధ్యాహ్నం నగరం నడి మధ్యలో వెండి సముద్రం’ అని రాసిందెవరని మూడో అంతస్తుకు వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్న తాడి ప్రకాశ్‌లా ఉండాలి. హెడ్డింగు ఎవరో మార్చారని జనరల్ డెస్క్ కింద ఉన్న చెత్త బుట్టను ఎడమకాలితో తన్నిన న్యూస్ ఎడిటర్లా ఉండాలి. అలా మాకూ ఆయనకూ కుదిరిపోయింది. సీనియర్ అంటే లోపల కెలికే బెరుకు ముల్లును స్వయంగా పీకి పారేయడం ప్రకాశ్ గారి స్టైల్.
రవీంద్రభారతి, త్యాగరాయగాన సభ, హరిహర కళాభవన్ సాంస్కృతిక ఆరామాల్లో ఏ కార్యక్రమం జరిగినా చక్రధర్ రిపోర్ట్ చేయాల్సిందే. ఏదో రిపోర్ట్ పట్టుకుని సాయంత్రానికల్లా డెస్కు దగ్గరకు వచ్చేవాడు. స్వాతి సోమనాథ్ ఇంటర్వ్యూ లాంటివి చూసినప్పుడు వాడి Emotional narration చూసి మురిసిపోయేవాడ్ని. వాడి వాక్యం మీద నాకు అప్పటి నుంచే అమితమైన ఇష్టం. ఆఫీసు పని అయిపోయి కట్టగట్టుకుని బయట పడ్డామంటే.. ఇహ చూస్కోండి హైదరాబాద్‌‌లో‌ఇటు చిక్కడపల్లి, అటు కూకట్ పల్లి, ఆ వైపు నల్లకుంట, ఇంకో వైపు మాసాబ్ ట్యాంక్.. ఎటకేగుటకనే సమస్య ఉండేది కాదు. నలుగురు కలిసి కవిత్వం చదువుకునే షెడ్యూల్ ఎక్కడో ఫిక్సయిపోయి ఉండేది. నిజం చెప్పొద్దూ… ఆ రోజులు చాలా వైబ్రంట్. కవిత్వం పఠనంలో పక్కన చక్రధర్ ఉంటే ఓ టెన్షన్. ఇది కవిత్వం కాదు, కపిత్వం అని మొకం మీదే తిట్టేస్తాడని. నచ్చితే మాత్రం ఉప్పెనలా అల్లుకుపోయేవాడు. గోదారోల్ల ఎటకారాల సంగతి ఎలా ఉన్నా కవిత్వం, కథ విషయానికి వస్తే వాడు సీరియస్ అయిపోయేవాడు. గార్డెన్ హోటల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ దాకా కవితా ఓ కవితా అని పాడుకుంటూ పోయేవాడు. ఫుట్ పాత్‌ల మీద పుస్తకం చదువుతూ నడుచుకుంటూ ఎదురయ్యేవాడు. నల్లకుంటలో పతంజలిగారి ఇంట్లోకి గుడిలోకి అడుగుపెట్టినట్టు వెళ్ళేవాడు. రావిశాస్త్రిని ఏమైనా అంటే కొంత ఓర్చుకునేవాడేమో కానీ పెద్దిభొట్లనీ, పతంజలిగారినీ ఏమైనా అంటే కరిచేవాడు.

ఉద్యోగంలో చేరిన కొత్తలో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని నా గదిలో ఉన్నదాని కంటే, చక్రధర్‌తో కలిసి వాళ్ళ అక్క, బావల ఇంట్లో ఉన్నదే ఎక్కువేమో. వాళ్ళ అన్నయ్యతోనూ ఉండేవాడు. తరువాత సొంతంగా రూమ్ తీసుకున్నాడు. అది మాకు ఓ అడ్డా. మనసు బాగా లేకపోతే ఆ గదిలో అర్ధరాత్రులు ముచ్చటలతో తేలికపడ్డ రోజులు చాలానే ఉన్నాయి. ఇద్దరి జేబుల్లో కలిపి ఇరవై ఉంటే ఓ పది నీకు, ఓ పది నాకు అన్నట్లు సాగింది ఆ స్నేహం. ఆ తరువాత రెండేళ్ళకు 1995 ఫిబ్రవరిలో నేను ఇండియా టుడే ఉద్యోగం కోసం మద్రాసు వెళ్ళిపోయాను. కానీ, ఎప్పుడూ దూరం కాలేదు. కవిత్వం బాగా రాయగలడు. కానీ, తక్కువ రాస్తాడు. ఎక్కువ రాస్తే అవతలి వాళ్ళను తిట్టే విగర్ తగ్గిపోతుందేమోనని వాడి భయమేమో! ఏమైనా సారంగలో ‘కూచిమంచి అగ్రహారం’ కథలతో తన వచనాన్ని పరుగులెత్తించడం నాకొక గొప్ప సాటిస్‌ఫ్యాక్షన్. ‘వెన్నెల మీద అమావాస్య తెరలు తెరలుగా ఉన్నట్లు భ్రమించే జుట్టున్న’ భోగం వీధి సుగుణ గురించి చెప్పి ఒకసారి, రాసి ఒకసారి కంటతడి పెట్టించాడు. అమలాపురం తీసుకెళ్లి గోదారి మీది వెన్నెలనీ, కొబ్బరితోటల గాలుల్నీ నా కవిత్వంలోకి ఒంపాడు.

ఈ మధ్యే ‘మూడో కన్ను’ తెరిచాడు, రావిశాస్త్రి నుంచి సామల సదాశివ దాకా, అద్దేపల్లి, పతంజలి శాస్త్రి నుంచి గద్దర్ వరకూ తన పాఠక హృదయాన్ని ఆత్మీయంగా నివేదించాడు. హైదరాబాద్‌ నగరంలో యౌవనాన్నంతా గడిపిన వాడు ప్రాంతీయ ఉద్యమాల మధ్య తెలంగాణ గొంతునే వినిపించాడు. ఆ తరువాత నేనేక్కడి వాడిని అని ఓ క్షణంలో ఉనికిని తడుముకుని కొంత దుఃఖించాడు. భౌగోళిక విభజనకు భాషతో, సాహిత్యంతో సంబంధం లేదని నిలబడ్డాడు. అందుకే, చక్రి అందరివాడు.జీవితంలో అందరిలాగే కొన్ని పొందాడు. చాలా ఎక్కువ కోల్పోయాడు. సహచరి ఈశ్వరి ఒక కూతుర్నిచ్చి వెళ్ళిపోయింది. అదొక ఘనీభవించిన దుఃఖం. కరగదూ, పెగలదూ. ఇప్పుడు కూతురు సాంకృతలో ప్రపంచాన్ని చూసుకుంటున్నవాడు, జ్ఞాపకాల కొలనులో మునిగి తేలుతున్నవాడు అక్షరాన్నే ఆలంబన చేసుకున్నాడు. నీకిష్టమైన కవి గుల్జార్ చెప్పినట్లు, ‘చేయి వదిలేసినంత మాత్రాన బంధాలేమీ ముగిసిపోవు / కాలం కదిలిపోతున్నంత మాత్రాన జ్ఞాపకాలేమీ వీడిపోవు’ కదా చక్రీ. గుర్తు పెట్టుకో.

నాకు తెలిసి చక్రి చదవని రోజంటూ లేదు. వాక్యాన్ని పట్టుకుని రాసినవాడి గుండెలోకి చొరబడతాడు, టార్చి లైటు పట్టుకుని వాక్యం వెనుక దాగిన రహస్యాల్ని వెతుక్కుంటాడు. పాఠకత్వానికి అది పరాకాష్ట. చక్రధర్‌ను నేను ఒక్కోసారి ఎక్స్‌ట్రా అనేది అందుకే. కొత్త కవిత రాస్తే వాడికి వినిపించేదాకా మనసు ఊరుకోదు. ఇది ముప్ఫయ్యేళ్ళుగా వ్యసనంగా మారిన ఆరాటం.
‘కాశీభట్లకు ఏం మిగిలింది? ఆ బారెడు గడ్డమూ బూడిదైంది.’ అంటాడోచోట వాక్యాన్ని గీకి దుఃఖాన్ని వెలిగిస్తూ. ‘దేశభక్తి కన్నా హీనమైన పాపానికి పాల్పడుతున్న పబ్లిషర్లు’ అంటాడు మరో చోట నిజంగానే మూడో కన్ను తెరుస్తూ. ఇట్లాంటి వాక్యాలు ఇంకా కావాల్రా చక్రీ. రాస్తూనే ఉండు. ఇంతకన్నా గొప్ప కారణం లేదు బతకడానికి. అదీ అరవై దాటాక ఎంతుంటుంది చెప్పుకోవడానికి!
Turning 60 isn’t about getting older, it’s about becoming a classic.

–పసునూరు శ్రీధరబాబు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *