
*మిత్రులు కలిసే సమయం*
*******
మీకు ‘దిక్కులు కలిసే సమయం’ అనే పాట తెలుసా? పోనీ, అది గుర్తు లేక పోయినా ‘ఏనాడో వేచిన ఉదయం’ అనే పాట తప్పకుండా వినే ఉంటారు. ఇప్పుడీ ‘శ్రోతలు కోరని పాటలు’ కార్యక్రమం ఎందుకంటారా? మీరు గనక నాలో ఇప్పుడు పరకాయ ప్రవేశం చేస్తే ఆ రెండు పాటలు నా చెవుల్లో లూపులో ప్రతిధ్వనించడం వింటారు.
ఇప్పుడీ పాటోద్ఘాతం ఎందుకంటే..
” 1976, మార్చి 9…నేను, నాతోపాటు మరో 25 మంది పిల్లకాయలు ఈనాడు జర్నలిజం స్కూల్లో మొదటి బ్యాచ్ విద్యార్ధులుగా కళ్లు తెరిచిన రోజు..” అంటూ ప్రతీ ఏటా ఒకే పోస్టుని రీ రిలీజ్ చేస్తుండటం పరిపాటి. అయితే ఇప్పుడు పెడుతున్న రీ రిలీజ్ పోస్టులో కొత్త విశేషాలు బోలెడు ఉన్నాయి.
మొదటిది.. మా ఈనాడు జర్నలిజం స్కూలు మొదటి బ్యాచ్ విద్యార్ధులం రేపటి రోజును మా స్వర్ణోత్సవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే యాభయ్ ఏళ్ల తర్వాత అందరం ఒకే చోట కలుస్తున్నామన్నమాట.
నిజం చెప్పాలంటే, 2006 లో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా బ్యాచ్ మేట్ దేవులపల్లి అమర్ అధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో గ్రాండ్ గా సమావేశం జరుపుకున్నాం. ఇదిగో, రేపటి స్వర్ణోత్సవ వేడుకకి సన్నాహకంగా పోయిన డిసెంబర్ చివరి వారంలో మా బ్యాచ్ మిత్రుడు విశ్వేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో అందుబాటులో ఉన్న బ్యాచ్ మిత్రులు ప్లాజా హోటల్ లో సమావేశమై ఏం చేయాలన్నదాని గురించి చర్చించాం. మా మిత్రులందరి ‘ఈనాడు’ జ్ఞాపకాలతో ఒక ప్రత్యేక సంచిక ప్రచురించాలని నిర్ణయించాం.
ఈ సంచికకి సంబంధించి పని విభజన ఇలా చేసుకున్నాం. బ్యాచ్ మిత్రులందరి దగ్గర్నించి వ్యాసాలు, ఫోటోలు సేకరించడం, సంచికని వైవిధ్య భరితంగా, వినూత్నంగా తీర్చిదిద్దడం విశాఖలో ఉన్న నా పని. నేను మొత్తం కంటెంటుని నమూనా పేజీలుగా తయారు చేస్తే, వాటిని లే అవుట్ డిజైనర్ దగ్గర పేజీలుగా తయారు చేసే బాధ్యతని హైదరాబాదులో ఉన్న మా బ్యాచ్ మిత్రులు యడవిల్లి సూర్యనారాయణ మూర్తి, నిడమర్తి రాజశేఖర్ తీసుకున్నారు. సావనీర్ ప్రింటింగ్ బాధ్యతని అమర్ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు.
సావనీర్లు వెయ్యడం చాలామంది చేస్తారు. మనది విభిన్నంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే, వ్యాసాలు రాసే మా మిత్రుల ఇప్పటి ఫోటోలు, యాభయ్ ఏళ్ల కిందటి ఫోటోలు కలిపి వారి వ్యాసంతో ప్రచురించాలని అయిడియా తట్టింది. నా ప్రయోగానికి మా వాళ్లందరూ బాగానే సహకరించారు. ఇప్పటి ఫోటోలు రెడీగానే దొరుకుతాయి. యాభయ్ ఏళ్ల కిందటి ఫోటోలంటే మాటలా? మొత్తానికి కిందా మీదా పడి అందరూ పాత ఫోటోలు సంపాదించి పంపారు. ‘ఈనాడు’ అనంతర జీవన ప్రయాణంలో వారు గుర్తుంచుకోదగ్గ సన్నివేశాల ఫోటోలుంటే పంపమంటే వాటిని కూడా పంపారు. మొత్తం మీద అందరూ చాలా చక్కటి వ్యాసాలు రాసి పంపారు. యాభయ్ ఏళ్ల కిందట మా బ్యాచ్ లో 26 మందిమి ఉండగా, ఈ మధ్య కాలంలో పరమపదించినవారు, ఆచూకీ లభ్యం కానివారు మినహా మిగిలిన 14 మంది వ్యాసాలతో , ఫోటోలతో నమూనా పేజీలు తయారు చేశాను.
ఇక అతి ముఖ్యమైనది కవర్ పేజీ. మేము శిక్షణలో భాగంగా అసెంబ్లీకి వెళ్లినప్పుడు మా బ్యాచ్ మిత్రుడు వంగరి శ్యామ్ సుందర్ కొన్ని కేండిడ్ ఫోటోలు తీశాడు. తవ్వకాల్లో రెండు దొరికాయి. వాటిని కవర్ పేజీ మీద వాడాలని వాటిని చూడగానే అనిపించింది. ఆ ఫోటోలు, ఈనాడు సోమాజిగుడా బిల్డింగు ఫోటోతో పాటు రామోజీరావు గారి ఫోటో కూడా ఉంటే బావుణ్ణనిపించింది. ఫోటో బదులు రామోజీ కేరికేచర్ వేస్తే వెరయిటీగా ఉంటుందనిపించి అమర్ ని సంప్రతించాను. అమర్ ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారితో మాట్లాడాడు. దురదృష్టవశాత్తూ ఆయన దగ్గర మాకు కావల్సిన కేరికేచర్ ఏదీ రెడీగా లేదు.
మరిప్పుడేం చెయ్యాలి? గూగుల్ లో వెతికాను. శ్రీధర్ వేసిన కార్టూన్ ఒకటి దొరికింది. అందులో క్లారిటీ అస్సలు లేదు. ఆ కార్టూన్ లోంచి రామోజీ గారిని విడదీసి మొదటిసారిగా ఏఐ ని ఆశ్రయించాను. ఫలితం చూస్తే నా కళ్లని నేనే నమ్మలేకపోయాను. అంత అద్భుతంగా వచ్చింది రామోజీ రావు గారి కేరికేచర్. సావనీర్ కి ‘స్వర్ణాక్షరి’ అని పేరు పెట్టాలని మిత్రులు అమర్, యడవిల్లి, నిడమర్తికి తెలియజేశాను. వారు కూడా బావుందన్నారు. స్వర్ణాక్షరి టైటిల్ ని ఈనాడు మాస్ట్ హెడ్ గుర్తొచ్చేలా డిజైన్ చేయించాలని ముందే డిసైడయ్యాను.
మొత్తానికి ముఖచిత్రం నమూనా పేజీ కూడా తయారయిపోయింది. చివరిలో నాకే ఒక డౌటు వచ్చింది. పేజీలు పెడుతున్నప్పుడు పేజీలో ఒక ఆర్టికిల్ అయిపోగానే ఖాళీ వస్తే ఏం చెయ్యాలి? సరే, అక్కడో జోకు.. అది కూడా పాత్రికేయులకి, పత్రికారంగానికి సంబంధించినవే వేద్దామని అవి రాసే పనిలో పడ్డాను. మొత్తానికి స్పేస్ ఫిల్లర్స్ పని కూడా పూర్తి చేసి మొత్తం కంటెంటు అమర్, యడవిల్లి, నిడమర్తికి మెయిల్ చేసేశాను. ఈ పని అంతా పూర్తి చెయ్యడానికి నాకు నెల రోజులు పట్టింది.
స్వర్ణాక్షరి సీను విశాఖ నుంచి హైదరాబాదుకు షిఫ్టు అయింది.
ఈలోగా మిత్రుడు నిడమర్తి రాజశేఖర్ తనకు బాగా తెలిసిన బల్లెడ బాబూరావు అనే లే అవుట్ డిజైనర్ తో మాట్లాడి ఉంచాడు. అతని స్టూడియోలో పేజ్ మేకింగ్ ప్రారంభమయింది. ఎక్కడో ఉన్న నిడమర్తి, మరెక్కడో ఉన్న యడవిల్లి, ఇంకెక్కడో ఉన్న బాబూరావు స్టూడియోకి షిఫ్టుల వారీగా వచ్చి పేజీల పని పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ఏ టూ జడ్ ప్రూఫ్ రీడింగు చేశారు. నన్ను అనుక్షణం సంప్రతిస్తూనే ఉన్నారు. ఆ ఫాంటు కాదు, ఈ ఫాంటు వాడండి అని నేను వాళ్ల దుంప తెంచాను. పాపం, వాళ్లు నా సతాయింపులు భరిస్తూనే పని పూర్తి చేశారు.
నేను నెల రోజులు శ్రమ పడితే యడవిల్లి, నిడమర్తి, బాబూరావు ఐదారురోజులు అంతకు అంత శ్రమ పడి, పుస్తకానికి నేను అనుకున్న రూపం తెచ్చి అమర్ కి ‘రెడీ టూ ప్రింట్’ ఫైల్ వేసేశారు. అమర్ ఏ మాయ చేశాడో గాని ‘స్వర్ణాక్షరి’ ని అందంగా అచ్చు వేయించాడు.
మొత్తానికి మా 14 మంది శ్రమ ఫలం మా “స్వర్ణాక్షరి” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ రేపటి మా సమావేశంలో జరగబోతోంది. (ఆ వివరాలు, ఫోటోలతో మరో పోస్టు పెడతాను.)
పత్రికారంగంలో పని చేసిన వారి రీ యూనియన్ మీటింగులు చాలానే జరిగాయి. కాని ఈనాడులో మొదటి బ్యాచ్ గా శిక్షణ పొందిన వారిలో కనీసం సగం మంది యాభయ్ ఏళ్ల తర్వాత ఒక గోల్డెన్ జూబిలీ మీటింగు జరుపుకోవడం, ఒక ప్రత్యేక సంచికని ఆవిష్కరించుకోవడం ఒక అపురూప విశేషంగా నేను భావిస్తున్నాను.
*— మంగు రాజగోపాల్*

