వేదుల శ్రీనివాసరావు శర్మ రచించిన (సేకరించి కూర్చిన) ‘సుందర అశోకవనం’ పుస్తకం చాలా గొప్పది మరియు అందరికీ సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ఉంది. నవతరానికి పురాణ గాథలను సరళమైన తెలుగు భాషలో అందించవలసిన అవసరం ఉంది. ఆ అవసరం గుర్తెరిగిన వేదుల శ్రీనివాసరావు శర్మ ఈ పుస్తకాన్ని ఎంతో అందంగా అందరికీ సులభంగా అర్ధమయ్యే సరళమైన భాషలో తీర్చిదిద్దారు. మామూలుగా మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాల వలె కాకుండా పెద్ద సైజులో (మునుపు యువ మాసపత్రిక వారు దీపావళి సంచికలు వేసినట్లు) అందంగా మంచి కాగితంపై ముద్రించారు. అక్షరాలు కూడా పెద్ద వయసువారు సులభంగా చదువుకోవడానికి వీలుగా ఉన్నాయి.
జాంబవతాదుల నుంచి సెలవు తీసుకొని సముద్ర మార్గంలో లంకకు చేరేవరకు ఎక్కడా విశ్రమించకుండా సాగుతుంది హునుమ ప్రయాణం. మధ్యలో మైనాక పర్వతంపై విశ్రాంతి తీసుకొమ్మని కోరినా మారుతి నిరాకరిస్తాడు. తన స్వామిపట్ల సేవకుడిగా హనుమ విధినిర్వహణకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో మనకు అందులో కనిపిస్తుంది. బ్రహ్మచారి అయిన హనుమంతుడు స్త్రీల పట్ల వ్యవహరించే తీరు ఎంతో మర్యాదగా, గౌరవప్రదంగా ఉంటుంది. రావణుడి అంతఃపురం చేరి ఒక్కొక్క భవనం దాటుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో రావణుడి భార్యలు, వారి భంగిమలు ఎటువంటి వికారమైన ఆలోచనలు కలుగకుండా రచయిత పదబంధాలు కట్టడిచేశారు. హనుమంతుని అన్వేషణ సాగిన తీరును రచయిత బాగా వర్ణించారు. మండోదరిని చూడగానే ఆమెను సీతగా భావించి వెంటనే ఆ అనుభూతికి పశ్చాత్తాపపడి మళ్ళీ అన్వేషణకు పూనుకోవడం, అశోకవంలో సీతను గుర్తించిన తర్వాత హనుమంతుడు ఒక కంట ఆనందభాష్పాలు, మరో కంట కన్నీరు కారడాన్ని రచయిత రాసిన తీరు అద్భుతం.
సీతను ఓదార్చడం, రామబంటుగా నిరూపించుకోవడానికి ఆమె సందేహాలను నివృత్తి చేయడం, హనుమంతునికి జానకీమాత చూడామణి సమర్పించడం వంటివి చాలా ఆసక్తికరమైన రీతిలో ఆయా సర్గాల్లో అందించడం జరిగింది. తల్లీ నిన్ను దలంచి … శ్రీనివాసరావు ఈ పుస్తకాన్ని సీతాదేవి స్మరణలో రాశారు. హనుమంతుని సముద్రయానం నుంచి లంకాదహనం వరకు ఒక్కొక్క ఘట్టం మన కళ్ళ ముందు నుంచి సినిమా రీలుగా కదిలిపోతుంటాయి.
మహర్షి వాల్మీకి విరచిత సుందరకాండ ఆధారంగా రూపొందిన ‘సుందర అశోకవనం’ గ్రంథంలో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి. వాటితో పాటు రాముణ్ణి, హనుమను వర్ణిస్తూ చేసిన ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను చిన్న చిన్న బాక్సులుగా ముద్రించారు. ఈ గ్రంథం తీసుకోవాలనుకునే వారు
వేదుల శ్రీనివాసరావు శర్మ సెల్ 8125687424 నెంబరుకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు.
మొత్తం పేజీలు 140. వెల: రూ. 300/-. -శేషగిరిరావు.

