మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు

  శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామచంద్రుని వ్యక్తిత్వం ఒక్కసారి అక్షరాలలో స్మరించినప్పుడు మానవాళికి నిజమైన ఆదర్శ పురుషుడనే  విషయం  ప్రతిబింబిస్తుంది. ఇతిహాసాలు ఎన్ని ఉన్నా జనానికి సందేశాన్ని అందించిన మహాకావ్యం రామాయణం.  చిత్ర విచిత్రంగా శ్రీరామచంద్రుడు తాను అవతార స్వరూపం అనే విషయాన్ని  మరిచిపోతాడు. మనిషిలోని భావోద్వేగాన్నిఅనుభవంలో చవిచూశాడు.  వేదన, విరహం, విషాదం, ఆనందం, ప్రేమ, భయం ఇలా ప్రతీ ఉద్వేగాన్ని  తన జీవనంలో అనుభవించి జగతికి  ఒక నడకని, నడతని సమర్పించారు. మనిషికి ఒకవిధంగా రాముడి జీవనం ఒక సందేశం, మార్గదర్శకం.  అందుకే రామో విగ్రహ ధర్మః అన్నారు.  శ్రీరాముని చర్య బాధిత వ్యక్తిని రక్షించడానికేనని, కేవలం వారిని రక్షించడం కోసమే శ్రీరాముడు మారీచుని  శిక్షించవచ్చని సూచిస్తుంది.
 శ్రీరాముని జననం నుంచి మరణం వరకు మనం నిశితంగా గమనిస్తే ఒక్క బాల్యంలోనే ఆనందాన్ని పొందారు. శ్రీరామచంద్రుడు నిజంగా నిరాడంబరం, సహన, సౌశీల్య, వినయ వ్యక్తిత్వాల చిహ్నం. గారంగా పెరిగినా, గురువుల ఆదేశాలు అనుసరించి రాక్షస సంహారానికై  బయలుదేరాడు. బల, అతిబలమంత్రాలని అభ్యసించాడు. విశ్వామిత్రుని నుంచి సాహసం, వశిష్టుల నుంచి వినయం నేర్చుకున్నారు. స్త్రీలను గౌరవించే సంస్కారం అలవడింది. ఒకరకంగా శూర్పణక సంహారం చేయకపోవడం సీతాదేవిని అపహరించే ప్రమాదం తెచ్చింది. శివధనస్సుని సంధించే సమయంలో గురువులకి వందనం చేశాడు. సీతాదేవి మనస్సు నారిని సంధించాడు. పరశురాముని గర్వభంగం చేసాడు. సీతారామకళ్యాణం జగతికి ఒక విధమైన అనుబంధం అది అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించింది. మిథిలానగరం, అయోధ్యనగరాల ఆత్మీయతని ఆవిష్కరించింది.   అందుకే యుగాలు గడచినా నేటికి కళ్యాణం కమనీయం.
కర్మఫలితం కేవలం పెద్దవారికే గాదు వారి వారసత్వానికి చెందుతుంది. దశరధుడు శ్రవణ కుమారుడిని సంహరించినప్పుడు శాపం ఫలితం రామయ్య అనుభవించాడు. పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో  శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. ఒకరకంగా స్థితప్రజ్ఞత అనేది రామాయణం నేర్పుతుంది. సుఖాన్ని, దుఖాన్ని సమంగా స్వీకరించారు.   సీత, లక్ష్మణులను తన వెంట రావద్దని వారించినా శ్రీరామచంద్రునితో గల అనుబంధాన్ని ఆత్మీయతని వదులుకోకుండా ఇద్దరు అనుసరించారు. రాముడు రాజు కాకపోయినా మహారాజుగా ప్రజలు అభిమానించారు. ఇది ఎక్కడ కనబడదు. వనవాసం వద్దని తన వెంట పరుగులు తీస్తున్నజనసందోహాన్ని అప్యాయంగా అక్కడే ఆపిన అయోధ్య రాముడు దశరధుడు దివంగతుడు  అయినప్పుడు కన్నీరు కార్చాడు. 
 సాధారణంగా ఉన్నత స్ధాయిలో గల వ్యక్తులకి సామాన్య జన సాన్నిహిత్యం  పరిమితంగా ఉంటుంది.

పడవ నడిపే గుహుడ్ని ఆత్మీయంగా ఆదరించిన నిర్మల హృదయుడు రాముడు. రాముని స్పర్శ పవిత్రమైనది. తన స్పర్శ ద్వారా అహల్యకు శాప విమోచనం కలిగించారు. ఇది ఎక్కడ కనబడదు. వనవాస సమయంలో శ్రీరాముని జీవనం చాలా ఆశ్చర్యకంగా ఉంటుంది. సీతారాముల వనవాస జీవితం అత్యంత సరళంగా, ధార్మికంగా సాగింది. రుషులు, మునీశ్వరులు అనుసరించిన ధర్మాల్ని ఆచరించారు. నారతో నేసిన దుస్తులు ధరించారు. ఉడతని స్పశించి తన ఆజన్మాంత గుర్తుగా ఉంచారు
సీతా వియోగం నిజంగా ఒక మంచి భర్త తన సహచారిని కోల్పోయినప్పుడు ఏకరంగా నైరాశ్యానికి గురిఅవుతారో అదే విధంగా వేదన పడ్డాడు. ఒక అవతార పురుషుడు అన్నసంగతి మరిచిపోయాడు. వానరులు తెచ్చిన ఆభరణాలని చూసి విలపించాడు. ఒక్కహనుమంతుని గుర్తించినప్పుడు మాత్రమే తన మహిమను ప్రదర్శించాడు.
శ్రీరామచంద్రుడి ఆగ్రహం పరిమితంగా కనిపిస్తుంది. సీతాఅన్వేషణ, సాగరాన్ని హెచ్చరించినప్పుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రామచంద్రుడు రౌద్రానికి గురిఅయ్యాడు శ్రీరాముడి స్నేహ ధర్మం గొప్పది. సుగ్రీవుడిని, విభీషణుడిని సమంగా ప్రేమించాడు. కర్మఫలితం రామయ్యకి తప్పలేదు. ధర్మం కోసం వాలిని సంహరించిన తరువాత కాలంలో శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆశాపం అనుభవించవలసి వచ్చింది.
శ్రీరామచంద్రుడు రావణుడు, ఇద్దరు శివభక్తులే. రామచంద్రుడు ఒక్కసారి రావణునితో అలసిపోయిన వీరుడ్ని తరువాత రమ్మని చెప్పాడు. సినిమాలలో చెప్పిన విధంగా రాజనీతిని నేర్చుకోలేదు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని లంక ఎంత అందంగా ఉన్న అయోధ్యే సర్వం అని జన్మభూమి గొప్పతనం చెప్పారు.
ఆదర్శ పాలకుడిగా సీతను వనవాసానికి పంపి ఒంటరిగా మిగిలిపోయాడు. లవకుశులని రాజ్య సింహాసనంపై అధిష్టింపజేసి
చివరికి యమధర్మరాజు గుర్తుచేసినప్పుడు అవతారం చాలించాడు.
శ్రీరామచంద్రుని వ్యక్తిత్వం సదా ఆచరణీయం. రామాయణంలో అంతా ప్రేమ, విషాదం, రౌద్రం,భయం, సంతృప్తి, ప్రశాంతత వంటి భావోద్వేగాలు కనబడ్డాయి. ఎప్పటికీ రామాయణం ఆదర్శ గ్రంథం.

డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
పరిశోధకులు – సెల్ : 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *