
వేసవి అనగానే ప్రతివారికి మండుటెండల తాపం విద్యార్థులందరికీ కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు విరామం గుర్తుకు వస్తుంది విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల సెలవులు తగ్గుతున్నాయి. సెమిస్టర్ విధానం, పోటీ పరీక్షలు ప్రవేశించి సెలవులు క్రమంగా తగ్గాయి. వేసవి సెలవులలో గతంలో బంధువులు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లే కొన్నాళ్ళు గడిపే సంప్రదాయం ఉండేది నాగరికత వేగంగా పెరిగి మానవ సంబంధాలు నిజంగానే ఆర్థిక సంబంధాలుగా మారాయి. బాంధవ్యాల బలం కరిగిపోతుంది. ఉమ్మడి కుటుంబాలలో ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాలు తగ్గుతున్నాయి. వేసవి వెన్నెలలో కొత్త ఆవకాయ అన్నం అందరూ కలిసి ఒకేసారి రుచిచూసే అనుభూతికి దూరంగా ఉండడం వేదనాభరితం. వేసవి సెలవులలో పర్యటనలు, దేవాలయ సందర్శనలు, క్యాంపులకు వెళ్లడం ప్రవేశించింది. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితినిబట్టి వేసవిలో పల్లెల నుంచి నగరాలకు, నగరాల నుంచి నుంచి విదేశాలకు వెళ్లే సంస్కృతి విస్తరిస్తోంది
ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నేటితరం బాలబాలికలలో ఊహలు ఎదిగాయి ప్రపంచం నుంచి నేర్చుకునే తెలివితేటలు క్రమంగా వారికి అబ్బాయి. విద్యార్జన కేవలం అక్షరాల నుంచి మాత్రమే కాక కంప్యూటర్ నుంచి నేర్చుకునే వరకు వారు ఎదిగారు. చిన్న వయసులోనే సాంకేతిక విజ్ఞానం పొందగలగడం వారికి వరంగా రావడం విశేషం. వేసవి సెలవులలో కేవలం విద్యాపరమైన అంశాలు మాత్రమే కాకుండా చిన్నారులకు వారి అభిరుచికి తగిన విధంగా సంగీతం, నాట్యం, నటన ఇలా అన్ని సృజనాపరమైన విషయాలలో శిక్షణ ఇప్పించాలి. అంతేగాకుండా విలువైన సంసృతికి సంబంధించిన వీడియోలు, సినిమాలు వారికి చూపించి భారతీయత గొప్పతనాన్ని పరిచయం చేయాలి. వేసవి సెలవులు అంటే బద్దకానికి మితిమీరిన విశ్రాంతికి చిరునామా కాకుండా క్రమశిక్షణని, నడకని, నడతని అందించినప్పుడు మిగతా సమయాలలో ఆత్మబలం, ఆత్మస్థైర్యం అలబడుతుంది. మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అందువల్ల బాలబాలికలకు ఉదయం, సాయంకాలం సమయాలలో శిక్షణ ఇస్తే బాగుంటుంది. వేసవి అభివృద్ధికి విడిది కావాలి. వేసవి మామిడికాయల తీయదనమే కాకుండా చిన్నారులకు జ్ఞానపరమైన తీపిని కూడా అందించాలి. -- డాక్టర్ దువ్వూరి శర్మ, అధ్యాపకులు, 99490 39175





