
మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా …
పుడమి తల్లి నీడలో స్వేదాన్ని చిందించి
అంకురాల్ని హలంతో పంటల సిరులుగా మార్చి
శ్రమించే రైతన్నలకు వందనం!
గమ్యాల కోసం అరణ్యాల్ని విశాలమైన దారులుగా
రహదారులుగా మార్చి
రేయి పగలు శ్రమించే శ్రమవీరులకు వందనం!
నిశీధి చెంత ఊపిరిని పణంగా పట్టి
గనుల చెంత అనుక్షణం
ప్రమాదాల నీడలో ‘నల్ల బంగారం’ కోసం
ప్రతీక్షణం పరితపించే కార్మికుల కృషికి వందనం!
మట్టిని మాణిక్యంగా మార్చి , భావాలకు జీవం పోసి
అందమైన బొమ్మలుగా అలంకరించే
కళా కార్మికుల సృజనకు వందనం!
అనురాగాలని , ఆత్మీయతలని ఆవలి తీరం వైపు చేర్చే
ప్రతీక్షణం పరుగులు తీయించే
వాహన సాధకులకు వందనం !
సాగరం అలలపై వలలను కనులుగా చేసుకుని
సాగర సంపద మత్స్య సంపదకై సాహసించే
జల కార్మికులకు సహస్ర వందనం !
కెమెరా సాక్షిగా 24 కళ లను కలిపి
తెరపై సమర్పించే వెండితెర కార్మికులకు కళావందనం!
దారాలకు రంగులు అద్ది – అతివ ఆశలకు జీవం పోసి
నిరంతరం శ్రమించే – చేనేత కార్మికులకు వందనం!
అక్షరాలను ఆలోచనలుగా చేసి
బంగారు భవితల్ని వరంగా అందించే
అక్షర కార్మికులకు అక్షర వందనం!
పునాదిరాయిని అందమైన భవంతులుగా మార్చే
శ్రమ శక్తికి శ్రమ వందనం !
రైలు విమానం బస్సు వాహనం ఏదైనా
కదిలించేది కదిలేది శక్తి .
అమ్మ ప్రేమ, పిల్లలపై ప్రేమ
సర్వం శక్తిమయం!
సర్వం శ్రమమయం !!
ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు
—డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ – అధ్యాపకులు, రచయిత : 99490 39175


