
***భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం***
గుజరాత్‌లోని చారిత్రాత్మక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 8 నుంచి 11 వరకు ఘనంగా ‘సోమనాథ్ అమృత మహోత్సవాలు’ (సోమనాథ్ అమృతపర్వ్) అద్భుతంగా నిర్వహించారు. భవిష్యత్ తరాలకు, యావత్ ప్రపంచానికి దేశం అందించిన ఒక సందేశంలా ఈ ఉత్సవం సాగింది. ఈ ఉత్సవం భారత దేశ సనాతన ధర్మశోభతో ముడివడి ఉంది. దీనినికి స్వాభిమాన్ పర్వ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఉత్సవం ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా నిర్వహించారు. కానీ మే 11న తిరిగి నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉంది. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సోమనాథ్ ఆలయ నిర్మాణం పునఃప్రారంభం జరిగింది. 75 ఏళ్ల తరువాత ఈ సుదినాన్ని పురస్కరించుకుని (అమృత కాలం) వేడుకగా అభివర్ణిస్తున్నారు. భారత నాగరికత పునరుజ్జీవనానికి మరియు సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా సోమనాథ్ ఆలయ వైభవాన్ని చాటిచెప్పడానికి చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకఇది. ఇది ఎంతో సుదినం. ఈ వేడుకలో మేము పాల్గోన్నామనే భావన హృదయాలను పులకరింపజేస్తోంది. ఎందరో ఆత్మత్యాగాన్ని గర్వంగా చాటిచెప్పే నిలువెత్తు పండుగ. సోమనాథ్ ఆలయ చరిత్ర ఈ నాటిదికాదు. యుగయుగాలుగా భారతీయ జీవనానికి, చరిత్రకు నిలువెత్తు దర్పణంగా నిలిచే విధంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంవత్సరం మరోమారు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి గుర్తుగా 75 రూపాయల స్మారక నాణెం, తపాలా బిళ్ళను ఆవిష్కరించారు. భవిష్యత్ తరాలవారు గుర్తుంచుకునేలా వేడుకలను నిర్వహించారు.

సోమనాథ్ ఆలయంలో మహా పూజ, కుంభాభిషేకం మరియు ధ్వజారోహణ కార్యక్రమాలలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ హోదాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయాన్ని అద్భుతంగా అలకరించారు. ఆలయ ప్రాంగణం రంగురంగుల కాంతులతో వెలిగిపోయింది, అంతేకాకుండా భారత వైమానిక దళం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘సూర్య కిరణ్’ ఎయిర్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శన ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కరించింది. చూచువారులకు చూడముచ్చటను తలపించేలా చక్కని దృశ్యాలను ఆవిష్కరించేలా వైమానిక ప్రదర్శన ఔరా! అన్న చందంగా సాగింది.
భారతదేశంలో పునర్నిర్మితమైన ఈ ఆలయం, స్వాభిమానానికి మరియు స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. చేదు జ్ఞాపకం 1026లో జరిగిన దాడుల తర్వాత, ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి సోమనాథ్ క్షేత్రం ప్రతీక. నేడు సరికొత్త చారిత్రక ఘట్టానికి సోమనాథ్ వేదికైంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమ లింగమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు. ‘సోమనాథ్ అమృత మహోత్సవ’ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధిని కోరుతూ మహాదేవునికి ‘విశేష్ మహా పూజ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎన్నో విషయాలను చారిత్రక ఘట్టాలను ప్రస్తావించారు. దేశప్రజలు జాతీయ స్పూర్తితో ముందుకుకదిలేలా వెన్నుతట్టారు. అంతే కాకుండా భారత దేశాభివృద్ధిని కోరుతూ మహాదేవునికి ‘విశేష్ మహా పూజ’ నిర్వహించారు. వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయంపై జరిగిన దాడులను గుర్తు చేసారు. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, భారతీయుల విశ్వాసం మళ్లీ మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించిందని ఆయన కొనియాడారు. ఆలయానికి వెళ్లే ముందు గిర్ సోమనాథ్‌లో భారీ రోడ్‌షో నిర్వహించిన ప్రధాని, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించడం సందర్శకుల హృదయాలను హత్తుకున్న విధంగా పులకించి పొయారు. ఈ మధుర క్షణం అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయ ప్రాంగణం భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటిచెప్పింది. భారత వైమానిక దళానికి చెందిన ‘సూర్య కిరణ్ ఏరోబిక్ పటిమ’ ప్రదర్శించిన వాయు విన్యాసాలు యాత్రికులను ఉర్రూతలూగించాయి. ఈ విన్యాసాలు భారత వైమానిక శక్తిని చాటిచెప్పాయి.
శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని రక్షించి, పునర్నిర్మించిన మహనీయులకు ప్రధాని నివాళులర్పించారు. సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారత నాగరికత యొక్క దృఢమైన సంకల్పానికి చిహ్నమని ప్రధాని పేర్కొన్నారు. ఈ అమృత మహోత్సవం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.
–వొద్దిపర్తి రామచంద్రమూర్తి
(సీనియర్ జర్నలిస్ట్)


