సిరి’వెన్నెల’కు అక్షరహారతి

                     తెలుగువారికి రెండు వెన్నెలలు.  నింగి నుంచి జాలువారే వెన్నెల ఒకటైతే 80వ దశకంలో వెండితెరపై జరిగిన  చంద్రోదయంతో సిరివెన్నెల అక్షర వెన్నెలలు కురిపించడం మొదలైంది.   రాత్రివేళ వెన్నెల చల్లదనం అనుభవిస్తుంటాం.  బావుకత కలిగిన మనస్సు సిరివెన్నెల చంద్ర కిరణాలను తరలించి తెరపైన కురిపించారు. వాటిని నిరంతరం అనుభవిస్తుంటాం. అస్తమించని ఆ సిరివెన్నెల అక్షర కాంతిని ఒక అనుభవంగా అదృష్టంగా చిత్తసీమ పొందింది మహనీయుల నిష్క్రమణం,  కాలధర్మం ఏదైనా వారి జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయి. వారు చిరంజీవులుగా ఉంటారు.  తరం నుంచి మరో తరానికి వారి ప్రతిభ చరిత్రగా ప్రయాణిస్తుంది ఏ సందర్భం అయినా వారి స్మరణ వేసవిలో కాసిన వెన్నెల స్పర్శలా  హాయిని కలిగిస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పేరు గాంచిన చేంబోలు సీతారామశాస్త్రిని భారత ప్రభుత్వం 2019లో .పౌరపురస్కారం పద్మశ్రీతో గౌరవించింది.   1955లో మే 20వ తేదీన జన్మించిన సిరివెన్నెల పాటల వనంలో ఒక దేవ పారిజాతం.  ఇది అరుదుగా లభ్యం అవుతుంది అందుకే నా రచనకు సిరివెన్నెల పాటల పారిజాతం అని నామకరణం చేశారు చేశాను.  దానిలో సిరివెన్నెల పాటలు అన్నీ ఉన్నాయి   పంచపాలిలో అన్నీ  ఆరగించే రుషులైనా  అన్నింటినీ ఆస్వాదించలేం.  అందుకే సిరివెన్నెలకు వారే రచించిన శుభాకాంక్షలు చిత్ర గీతాన్ని నా భావనలో  వివరిస్తూ ఈ అక్షర హారతిని అందిస్తున్నాను . ఎప్పుడు విన్నా కోయిల గీతం విసుగనిపించదు ఎంతసేపు ఉన్నా సాగరం వద్ద అలసటగా ఉండదు.  సిరివెన్నెల అక్షరం బాలు స్వరం కలిస్తే అది నారదుని చేత ఉండే మహతి నినాద సంగీత  సంగమం.  కోటి సంగీత దర్శకుడిగా అక్షరాలను రాగార్చన చేసినప్పుడు అది వినిపించే హంపి విజయనగర శిల్పకళా వైభవం.  శుభాకాంక్షలు పలికి 28 వసంతాలు అయినా ఇప్పటికీ అది మంచులో తడిసిన గులాబీ రెక్కల స్వచ్ఛంగా ఉంటుంది.  ఇక అక్షర తెరలు పదాలన్నీ భావపుష్పక విమానంలో  విహరిస్తాయి.
      గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు అని చరణం ప్రారంభమవుతుంది ప్రశాంతమైన నదిలో రాయి విసిరినప్పుడు కలకలం చెలరేగుతుంది సుడులుగా తిరుగుతుంది గుడి గంట ఎప్పుడు మదిని మాధుర్యంగా తాకుతుంది గువ్వల గొంతులు సరిగమలకే తెలియని రాగాలు అవి పారవశ్యాల సంతకాలు కళ్ళనిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు ఇది సినీ కవిత్వపు యోగం ఇవే శుభాకాంక్షలు గా ఊహలలో ప్రేమని ప్రియురాలు చిరునామాగా చెప్పారు ఇది ప్రయోగం సిరివెన్నెల కలం నుండి ప్రియుడి  అంతరంగంలోకి  అడుగులు వేసి ఆ బాధ్యతని ఆస్వాదించినప్పుడు ఇక పదాలు భావ నయాగార జలపాతాలు మనసు వాలడం నీడగా మారడం అవన్నీ ఈ తరం రచయితలకి అందని ద్రాక్షలు.  కదలదు సమయం అని సిరివెన్నెల రాశారు. ప్రియురాలు  ఎదురుగా ఉన్నప్పుడు మనసు కరిగిపోతుంది పలుకు మూగబోతుంది సమయం భారంగా ఉంటుంది ఇంద్రజాలం చంద్రజాలం అనే రెండు భావనలను ఆవిష్కరించారు  భావుకత కాస్త బరువుగా ఉంటుంది అందుకే అవి అక్షర గోరింటాకులా  పండుతాయి ఆశలు ఎవరి జీవితాలని వారికి ఊహలు కల్పిస్తాయి కానీ ఇక్కడ ఆశలు చెలి చెంత వాలిపోయాయి కలలు ఎప్పుడూ నిదురించిన కన్నుల గుండా పుడతాయి గాని ఇక్కడ తెరిచిన కనులు కలలకు నెలవై అని రాశారు కవితలు అన్ని పెదాల దారి గుండా మనసును చేరుతాయి కానీ చిత్రంగా అంతరంగం వీక్షించింది.   నేస్తం జతలో ఒక్క క్షణం చరిత్రగా మారుతుంది ఇది ఆర్ద్రతకి అర్థం అక్షరానికి దృశ్యం కొత్త అందం తెస్తుంది పూల గడియారాల లుంబినీ వనం, తిరుపతి పరిసర ప్రాంతాలు ఇవన్నీ భావ సౌందర్యాలకు అందంగా నిలిచాయి.  సంఘీ దేవాలయం కూడా తెరపై మెరిసింది ఈ చిత్రంలో పాట విన్నప్పుడు చూసినప్పుడు ప్రణయ ఆరాధకులకు గతం తలుపులు తెరుస్తుంది. నటీనటులు  జగపతిబాబు,  రాశి  ఇద్దరు ఈ పాటకు జీవం పోశారు సరస్వతి చెంత వీణ తంత్రిగా నిలవడానికి వెళ్ళిపోయిన సిరివెన్నెలకు మే 20వ తేదీ ఆయన జయంతి సందర్భంగా అభినందన చందనాలు. 

డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, సినీ పరిశోధకులు మొబైల్ 9 9 4 9 0 3 9 1 7 5

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *