
*కె.వి.ఎస్. వర్మ కథలు*
మనం నిత్యం చూసే జీవితం చూసినా పట్టించుకోని జీవితం కాదంటే పట్టించుకోవడానికి ఇష్టపడని జీవితం
కె.వి.ఎస్. వర్మ కథల్లో మనకు కనిపిస్తుంది. వాస్తవికత బాట వీడకుండా, సామాజిక మార్పు కాంక్షిస్తూ
రాస్తున్న కథకుడు వర్మ. దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో ఉన్న వర్మ ఎన్నో కథలు రాశారు.
కథా సంకలనాలలో ఇది ఏడవది. ఆయన వజ్రోత్సవం సందర్బంగా వెలువడిన కథల సంపుటి ‘అనుకోనిది’.
ఈ పుస్తకంలో ఇరవై ఒక్క కథలున్నాయి. ప్రతి కథా మనల్ని చదివిస్తుంది. అన్నింటిలోనూ మనిషిలో
ఉండే లోపలిమనిషి మనకు కనిపిస్తాడు. ఆ రెండో మనిషి ఒక కథలో మంచివాడిగా ఉంటే, ఇంకో కథలో
చెడ్డవాడిగా ఉంటాడు. వృత్తిరీత్యా జరలిస్ట్ వర్మ జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తాంశాలను కూడా
కథలుగా మలిచారు. ‘అనుకోనిది’ కథల సంపుటిలోని కథల్లో వచ్చే సంభాషణల్లో కొన్ని ..
“నువ్వు చెప్పింది విన్నాక జీవితం కంటే సిద్దాంతమే ముఖ్యమైనది అనిపిస్తోంది” అన్నాడు వీరభద్రం.
“అదెలా కుదురుతుందది. సిద్ధాంతమే ముఖ్యమైనప్పుడు జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా” అన్నాడు
నరసింహమూర్తి. “ఆ పిల్ల కలగడానికి కారణం యెవరో నాకు తెలీదు. సుమతిని నేనడగలేదు. అడగలేను కూడా.
ఈ విషయం నీలోనే వుంచుకో. చదివిన తరువాత ఈ ఉత్తరాన్ని చింపివేయ్. ఉత్తరాలు రాస్తుండు — నీ మల్లీశ్వరరావు. ఆ లెటర్ చదివిన తర్వాత ముక్కలు ముక్కలుగా చింపేశాడు శంకరం. భారంగా నిట్టూర్చాడు. గుండె దడదడలాడింది. కొద్దిసేపటికి కానీ మామూలు మనిషి కాలేకపోయాడు.” . ఎప్పుడూ వుండే దేవుడి స్థానంలో తన ఫోటో ! “నర్మదా, ఏంటిది ? నీకేమన్నా పిచ్చా …” అన్నాడు సుదర్శన్. తలూపుతూ “ఎవరి పిచ్చి వారికి ఆనందం” అంది ప్రశాంతంగా వున్న మొహంతో. (అనుకోనిది — కె.వి.ఎస్. వర్మ కథలు — అనల్ప ప్రచురణ)
–ఎం.ఎస్.శర్మ.


