
వివేకానందుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నరేంద్ర నాధ్ గురువు రామకృష్ణ పరమహంస
బోధనలతో కూర్చిన ‘శ్రీ రామకృష్ణ కథామృత సారం’ పై స్వామి త్రివిక్రమానంద వారం వారం
ప్రతి బుధవారం సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో ప్రసంగాలు చేస్తున్నారు. దాదాపు 40 నిముషాల
పాటు సాగే ఆయన ప్రసంగం యావత్తు రామకృష్ణ పరమహంస తన శిష్యులకు చెప్పిన చిన్న చిన్న
కథలతో సాగుతుంది. ముఖ్యంగా రామకృష్ణుడు శిష్యులు అడిగే సందేహాలను నివృత్తి చేయడానికి
ఆయా సందర్భానికి తగ్గిన విధంగా చెప్పిన కథలను త్రివిక్రమానంద ఉదహరించారు. ఈ
సందర్బంగా అయన కలియుగంలో కామినీ కాంచనాలతో మనుష్యులు ప్రభావితమవుతున్న తీరును
వివరించారు. ఈ భూమండలంలో సంచరించే జీవులన్నింటిలో భగవంతుణ్ణి చూడాలని , అయితే
ఇతరులకు హాని తలపెట్టకుండా ఉండటంతో పాటు తనను తాను రక్షించుకోవడం కూడా అంతే
అవసరమని అన్నారు. అన్ని జీవులలో కూడా నారాయణుడు ఉంటాడని చెప్పడానికి
వేదాలలో పేర్కొన్న “ఆపో నారాయణః ” గురించి చెప్పారు. నారము అంటే జీవజలం.
అలా అని నీళ్లన్నీ మంచివా ఆంటే కాదు. సందర్భాన్ని బట్టి చూడాలి అంటూ అన్ని పనులకు
పనికిరావు. కొన్ని తాగడానికి పనికి వస్తే, మరికొన్ని కడుక్కోవడానికి పనికివస్తాయి.
మరికొన్ని తాకడానికి కూడా యోగ్యమైనవి కావు అని వివరించారు. మనుష్యులలో నాలుగు రకాలు
ఉంటారని అంటూ మహాభారతంలో తిక్కన రాసిన భాగంలో పేర్కొన్న మూడు చేపల
కథను ఉదహరించారు. మూడు చేపల పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన దీర్ఘదర్శి ముందుగా తప్పించుకునే, ప్రాప్తకాలజ్ఞుడు సరైన సమయంలో మేల్కొని బయటపడతాడు.
దీర్ఘసూత్రుడు ఏమీ చేయకుండా ఉండిపోయి జాలరి వలకు చిక్కి అంతమవుతాడు.
ఈ సందర్బంగా కలియుగం రెండు విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రామకృష్ణుడు
చెప్పిన విషయాన్ని స్వామి ప్రస్తావించారు. ఆ రెండు విషయాలు సత్యపాలన, సమయపాలన
ఈ రెండింటిని సరిగా నిర్వహించాలని అన్నారు


