కొండా 2

సరదాకి…


” ఇది విన్నావా? రాం గోపాల్ వర్మ కొండా సినిమా పార్ట్ టూ తీస్తున్నాడట!”
ఫిలిం నగర్, కృష్ణా నగర్ సెంటర్లలో ఒక్కసారిగా ఈ వార్త గుప్పుమంది. టాలీవుడ్ కి సంబంధించి ఏ ఇద్దరు కలుసుకున్నా ఈ ముచ్చట్లే.
**
“సురేఖని డిస్మిస్ చేసినప్పుడే అనుకున్నాను, ఈ సబ్జెక్టుతో వర్మ సినిమా తీస్తాడని”
“వర్మ తియ్యడం కాదెహె.. సురేఖ ఫ్యామిలీయే ప్రొడ్యూస్ చేస్తోంది”
“తెలుసులే, మొదటి పార్టుకి సురేఖ వాళ్లమ్మాయి సుస్మిత పేరునే నిర్మాతగా వేశారు. నా ఉద్దేశం వర్మే మళ్లీ దీనిని కూడా డైరెక్టు చేస్తాడని”
“చేస్తే వర్మే చెయ్యాలి. ఇంకెవరు చేసినా బాగుండదు. అసలు కొండా సినిమా చూశావా ఎంత అద్భుతంగా తీశాడో!”
” అవునవును. రాంగోపాల్ వర్మ మనసు పెట్టి తనే స్వయంగా డైరెక్టు చేస్తే ఏ సినిమా అయినా సూపర్ గా ఉంటుంది. హిట్టా, ఫ్లాపా అన్నది వేరే విషయం. మొత్తం బాధ్యతంతా అసిస్టెంట్ల మీదే పడేసి, నిర్మాతగా ఆయన వ్యవహరించిన సినిమాలు మాత్రం, ఒకటీ అరా తప్ప మిగతావన్నీ పరమ దరిద్రంగా తగలబడ్డాయి.”
“ఇంతకీ వర్మ సురేఖమ్మని కలిశాడా? ప్రాజెక్టు ఫైనలైజ్ అయిపోయిందా?”
“ఏమోనబ్బా..తలా ఒక రకంగా చెబుతున్నారు. వర్మ సురేఖ వాళ్లింటికి వెళ్లాడని కొందరు, లేదు, ఫోన్లలోనే డీల్ మాట్లాడుకున్నారని కొందరు చెబుతున్నారు. కరెక్టు ఇన్ఫర్మేషను తెలియడం లేదు.”
” అది సరేగానీ, కొండా పార్ట్ వన్ కథాకాలంలో కొండా మురళీ, సురేఖ యూత్ ఫుల్ గా ఉండేవారు. ఆ ఏజ్ కి తగ్గ హీరో హీరోయిన్లను పెట్టి వర్మ స్టోరీ నడిపించాడు. సురేఖ రాజకీయరంగ ప్రవేశంతో కొండా సినిమా పూర్తవుతుంది. మరి ఇప్పుడేం చేస్తాడంటావ్?”
“ఏముందీ, వెరీ సింపుల్.. ఆ స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ టూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కాదు అసలు సమస్య. ఇప్పుడు మురళి , సురేఖ వయసు 60 ఏళ్లు దాటింది. వాళ్లమ్మాయి సుస్మిత వయసు ఓ నలభయ్ ఏళ్లుంటాయి. ఆ వయసులకి తగ్గ యాక్టర్స్ ని వెతకడమే వర్మకి ఇప్పుడు పెద్ద సవాలు”
“అది వర్మకి పెద్ద సవాలేమీ కాదు. నార్త్ లో ఏదో చిన్న హోటల్లో పని చేసే వర్కర్ కి చంద్రబాబు పోలికలు ఉన్నాయని అతడిని తెచ్చి చంద్రబాబు కేరక్టర్ ని వేయించి మెప్పించిన గొప్పోడు రాం గోపాల్ వర్మ..”
“అది నిజమే గాని సినిమా కమర్షియల్ గా హిట్టవాలంటే సురేఖ కేరక్టర్ కి ఒక పెద్ద నటిని తీసుకురావడమే బెటర్. నన్నడిగితే సురేఖ కేరక్టర్ కి రమ్యకృష్ణ సరిపోతుందని అనిపిస్తోంది”
“రమ్యకృష్ణా? సరిపోయింది. ఆవిడకి ఇచ్చే పారితోషికంతో రెండు కొండాలు తీస్తాడు వర్మ.”
” ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు కొండా పార్ట్ టూ ఉంటుందో లేదో కన్ఫర్మ్ గా తెలియదు గాని మనం అప్పుడే కేస్టింగ్ గురించి మాట్లాడేసుకుంటున్నాం”
” లేదు భయ్యా..ఆలూ చూలూ అన్నీ ఉంటాయి. రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో కొండా పార్ట్ టూ రావడం ఖాయం”.
***
అర్ధరాత్రి… హైదరాబాద్, జూబిలీ హిల్స్ లో రాంగోపాల్ వర్మ ఆఫీసు ‘ఆర్జీవీ డెన్’ లో..
ఒకప్పుడు వర్మ తీసిన దెయ్యాల సినిమాల్లోని దెయ్యాలన్నీ ఇప్పుడు ఏ పనీ పాటా లేకపోవడంతో ఎగురుకుంటూ అక్కడకి చేరి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి.
“అయితే అన్నాయ్..మన గురుడు కొండా పార్ట్ టూ తీస్తాడంటావా?”
” నీకేమనిపిస్తోంది చెప్పు”
“ఎందుకు తియ్యడూ? వాళ్లు బోలెడు డబ్బులిస్తారు కూడా..అసలే మనవాడిప్పుడు ఏ సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు కదా! ఏం..నీకలా అనిపించడం లేదా?”
” ఏమో మరి..నేనయితే ఆయన నిలువెత్తు ధనం పోసినా కొండా టూ తీస్తాడని అనుకోవడం లేదు”
“ఎందుకలాగ?”
” రెండు కారణాలున్నాయి. నెంబర్ వన్..మొత్తం ఎపిసోడ్ లో సురేఖ ఫ్యామిలీ జనం సింపతీ పోగొట్టుకుంది. రకరకాల పార్టీలు మారడం, అహంకారం, నోటి దురుసుతనం.. సురేఖ వాళ్లమ్మాయి సుస్మిత చెయ్యాల్సిన డామేజీ అంతా చేసేసి, చివరికి వీడియోలో వలవల ఏడవడం..ఇవన్నీ మన గురుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇలాంటప్పుడు ఈ కంపని తన నెత్తిన పెట్టుకోవడమెందుకని ఆయన కచ్చితంగా అనుకుంటాడు.”
“నిజమే సుమా నువ్వు చెప్పిందీ”
” వర్మ తనకి ఎలాంటి సెంటిమెంట్లు లేవంటాడు కాని ఆయన ఈ ప్రాజెక్టు చెయ్యకపోవడానికి ఇంకో సెంటిమెంటల్ కారణం కూడా ఉంటుందని అనిపిస్తోంది”
” ఏంటన్నాయ్ అదీ?”
” నాగార్జున… అవును. నాగార్జునే! రాంగోపాల్ వర్మ కి ఇంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం నాగార్జున. ఏ అనుభవం లేని వర్మని నమ్మి ‘శివ’ సినిమాని అతని చేతిలో పెట్టిన నాగార్జున అంటే మన గురుడికి చెప్పలేనంత కృతజ్ఞతాభావం ఉంది. అలాంటి నాగార్జున కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలి రచ్చకెక్కిన కొండా సురేఖని వర్మ ఏనాటికీ క్షమించడని, కొండా పార్ట్ టూ తియ్యడని ఈ ఆత్మ తాలూకు అంతరాత్మ ఘంటాపథంగా చెబుతోంది.”
“ఇంకో కారణం కూడా ఉంటుంది. అదేంటో తెలుసా?’
“తెలీదు, చెప్పు..చెప్పు”
” మన గురుడు హారర్ సినిమాలు తియ్యడం మానేసి చాలా కాలమైంది. ఇప్పుడు కొండా పార్ట్ టూ తీస్తే అది ఇంకో హారర్ సినిమా అవుతుంది. అందుకనీ…”
— మంగు రాజగోపాల్

(లీడర్ దినపత్రిక 10-9-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *