
మూడు దశాబ్దాల క్రితం మాట. కొన్ని రాత్రిళ్లు.. బహుశా యే ఏడో దాటిన తర్వాత ఓ విశాలమైన వీధిలోని ఓ పువ్వుల ఇంటి తలుపు తట్టేవాడిని. అవతల నుంచి చక్రీ అని పిలుపుతో పాటే తలుపు కూడా తీసేది ఓ వాక్యం. “లోపలికి రా.. తిన్నావా” అనేది ఆ వాక్యం. నేనూ ” లేదు… తినలేదు. తింటా కానీ.. కొత్త కథ రాసావా.. చెప్తే తింటా” అనే వాడ్ని. నెత్తి మీద ఓ జెల్ల కొట్టి… లోపల్నించి ఓ కంచంలో అన్నం.. కూర తీసుకుని వచ్చేది. ఆ పళ్లెంలో ఓ మూల ఖాళీగా ఉండేది. ఈ ఖాళీ ఏంటీ అని అడిగితే… ” అదా… కధ” అంటూ తాను రాసిన కొత్త కథని వినిపించేది ఆ వాక్యం.
ఇంతకీ ఆ వాక్యం పేరు ఏమిటనుకుంటున్నారా… కుప్పిలి పద్మ. ఆకాశంలో ఎవరో మర్డర్ చేసినట్లు లేదూ అనుకుంటూ విలన్ అవతారమెత్తి ఉన్నపళంగా లేవదీసుకుపోవాలనుకునే వారంతా ఆ పద్మని చూసి. అప్పుడప్పుడే కథలు రాస్తున్న కాలం… కధలు పత్రికల్లో పడితే ఓ వెర్రి ఆనందంలో మునిగి తేలేది పద్మ.
ఇంటికి దూరంగా ఉద్యోగాల కోసమో చదువు కోసమో సిటీకి వచ్చిన ఎందరికో ఇంటి మీద బెంగ ని తీరుస్తూ ఆ చిన్న వయసులోనే తల్లిలా… అక్కలా ఎందరికో అన్నం పెట్టేవి ఆ కథల చేతులు. అందుకే ఆ కథలకి అంత అన్నం పరిమళం.
ఇప్పుడైతే కుప్పిలి పద్మ చుట్టూ సాహిత్య వాతావరణం. కవులు… రచయితలు.. విమర్శకులు… ఉద్యమకారులు… ఫెమినిస్టులు.. ఇలా అందరూ ఉంటున్నారు. ఇప్పుడు ఆమె సమూహ.
ఆ రోజుల్లో కుప్పిలి పద్మ ఒక్కతే నిశ్శబ్దంగా.
తన చుట్టూ లోకం లేదని తెలిసినా తానే వో కళాత్మకమైన… స్ఫూర్తివంతమైన లోకంగా మారిన కాలం అది “ఉదయం’లో నా కధ పడింది చక్రి” అంటూ ఆ పత్రికని నా ముందుంచేది ఆ తల్లి. ఆ రోజుల్లో… మరి… నాన్న.. అక్కలు దూరంగా ఉన్న రోజుల్లో.. అమ్మ సుతారామూ కనిపించదని తెలిసిన ఆ రోజుల్లో… ఒంటరి ఇళ్ల మధ్య ఒక్కడినే ఉన్న ఆ రోజుల్లో నా కడుపాకలిని… నా సాహిత్య ఆకలిని తీర్చే వాళ్లందరూ నాకు తల్లులే. ఆ మా పరిచయ తొలి రోజుల్లో కుప్పిలి పద్మ రాసిన కధలు నచ్చేవి కావు. ఓ దశ, దిశ ఉండేది కాదు. దాదాపు అన్ని ప్రేమకథలే. ఆ కధల్లోనూ స్త్రీ పాత్రలకే అగ్ర తాంబూలం. ఈ విషయం పద్మకి చెప్పేవాడిని కాదు. ఎందువలన చేత అంటే సాపాటు దొరకదని.
ఇలా రోజులు గడుస్తున్న సమయంలో ఓ పాలి ఆంధ్రజ్యోతి వార పత్రికలో ఓ కధ వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక కోసం బార్బర్ షాపుకి వెళ్లే నేను ఆ కధని అక్కడే చదివా. అంతే దిమ్మ తిరిగి.. కుప్పిలి పద్మ అయ్యింది. రాం నగర్ నుంచి ఎకాఎకిన నడుచుకుంటూ వెళ్లిపోయా పద్మ ఇంటికి. పొద్దున్నే కదా… తలుపులు తీసే ఉన్నాయి. ముక్కుపొడుం రంగు సోఫాలో కూర్చుని తన కధని తానే చదువుకుంటోంది పద్మ. చప్పుడు చేయకుండా వెళ్లి ఆ చేతుల్ని పట్టుకుని ఏడ్చేశా. మాటల్లేవు.. మాట్లాడుకోవడాలు లేవు. అదిగో ఆ రోజు నుంచి తాను రాసిన కధలు చదివి “మసిగుడ్డ”ని అయిపోయానంటే నమ్మండి.
అందరిలాగే నేనూ కుప్పిలి పద్మని ఫెమినిస్టు రచయిత్రిగానే తొలుత భావించా. కానీ “మౌన” కధ చదివిన తర్వాత పద్మ “మగిస్టు” అని నిర్ధారించుకున్నాను. ఈ కధని కచ్చితంగా మగవాళ్లే రాయాలి. రాస్తేనే బాగుంటుంది అనుకునే వారికి రాసింది కుప్పిలి పద్మ అని తెలిస్తే వాళ్లంతా ఫెమినిస్టు అభిమానులవుతారు. కవి సీతారాం అన్నట్లు రాజ్యం, మార్కెట్, కుటుంబం మధ్య సతమతమవుతున్న మనుషుల కధలన్నీ ఈ కుప్పిలి పద్మ రాసారని నేను కూడా భావిస్తా.
కుప్పిలి పద్మకు ప్రవాహ గుణం ఉంది. ఆ గుణం తనని ఎక్కడెక్కడికో తీసుకువెళ్తుంది. తాను ఒక్కర్తే వెళ్తే సరిపోదనే ఎరుక కూడా ఉంది. ఆ ఎరుకతోనే పాఠకుల్ని కూడా తన వెంట పరుగులు పెట్టిస్తుంది. కుప్పిలి పద్మ కథల్లో నాకు బాగా నచ్చిన కధ… నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసిన కధ వీడిఆర్‌ఎల్. ముఖ్యంగా నా భార్య ఈశ్వరి ఆరోగ్యంపై నేను శ్రద్ధ చూపించలేకపోయానేమో అని నన్ను నేను నిరంతరం ప్రశ్నించుకునేలా చేసిన కధ ఈ వీ.డి.ఆర్.ఎల్. ఇంట్లో స్త్రీల ఆరోగ్యం విషయంలో పురుషుడి నిర్లక్ష్యాన్ని నిలువునా పాతరేసింది కుప్పిలి పద్మ.
కధలు సరే… కవిత్వం కూడా సరే. కానీ కుప్పిలి పద్మ ఓ పత్రికలో కొన్నాళ్లు రాసిన ఓ కాలమ్ గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ కాలమ్ వస్తున్న సమయంలో హైదరాబాద్ సచివాలయంలో జర్నలిస్టులు ఆ వారం రాసిన అంశంపై చర్చించుకోవడం నాకు తెలుసు. కుప్పిలి పద్మ పాఠకులకు కధలతో కడుపు నింపే పూటకూళ్లమ్మ.
- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్. 99120 19929
- విశాలాంధ్ర దినపత్రిక ‘చక్రవాకం’ నుంచి





