సంక్రాంతి అంటే సరదాల విందు. అందులో సినిమా ఒకటి. ఈ సారి సంక్రాంతికి వెండితెర సినిమా విందును పసందుగా అందిస్తోంది. చిరంజీవి మన శంకర వరప్రసాద్ బలమైన భావోద్వేగాలు నిండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి సినిమాలో హాస్యం దాగి ఉంటుందని అందరూ భావించారు. తన శైలికి భిన్నంగా కుటుంబ భాంధవ్యాలను జతగా మలచి మంచి కథనాన్ని అందించారు. చాలా రోజుల తరువాత చిరంజీవి నుంచి ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎంటర్ టెయిన్మెంట్ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చింది. పాత తరం ప్రేక్షకులకు డాడీ, అన్నయ్య చిత్రాలు గుర్తుకు వస్తాయి.
మామూలుగా చిరంజీవి చిత్రాలలో కనిపించే మాస్ మసాలా లేకుండా అనిల్ కథ నడిపిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. చాలా కాలం తారువాత మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంట్ బాటలో ఈ చిత్రం నడిచింది. ఇది ఇలాగే కొనసాగితే చిరంజీవి సినిమాలు మున్ముందు అద్భుతాలు సృష్టిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక కథ విషయానికి వస్తే మొదటి నుంచి కుటుంబ హాస్య కథలను నమ్మే అనిల్ రావిపూడి మొత్తం మీద అదే ఒరవడి కొనసాగించినా ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఆసక్తి అంశాలు కనబడ్డాయి. చిరంజీవిని రక్షణ శాఖకు చెందిన ఒక అధికారిగా చక్కగా చిత్రీకరించారు. అక్కడి నుంచి కథ గతంలోని వెళ్తుంది. చిరంజీవి పాత్రకు గతంలో ఒక ప్రేమ కథ ఉందని అది ప్రేక్షకులకు మరవలేని అనుభూతిని ఇచ్చేలా చిత్రీకరించారు. నూటా యాభైకి పైగా చిత్రాలలో నటించినా చిరంజీవి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా పాటలలో కొత్తదనం కోసం తనదైన రీతిలో అభినయం చేస్తారు. అదేవిధంగా హాస్యం పండించడానికి ఆయన పడే తపన మనకు కనిపిస్తుంది.చిత్రంలో స్కూల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.శశిరేఖ పాటా చిత్రీకరణ చాలా బాగుంది. ఈ చిత్రంలో ప్రథమార్ధం చిత్రానికి జీవం పోసింది.
చిత్ర కథలో రెండవ భాగం కథను విచిత్రంగా మలుపు తిప్పుతుంది. వెంకటేష్ చిరంజీవి పాటలకు, చిరంజీవి వెంకటేష్ పాటలకు అభినయించడం సరదాగా అనిపించింది. వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత తెరపై వెల్లివిరిసింది. లాజిక్ గురించి పట్టించుకోకుండా చూస్తే అనిల్ రావిపూడి మ్యాజిక్ మీకు ఆనందంగా అనిపిస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి విజేతగా నిలిచారు. నయనతార అభినందనీయంగా ఉంది. బుల్లిరాజు పాత్ర పరిమితంగా ఉంది. కోనసీమ ప్రాంతానికి చెందిన ఆనంద్ ఈ చిత్రంలో నటించారు. వడ్లమాని సాయి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ పాత్రలో మెరిసారు. ఈదరవల్లికి చెందిన ఆదినారాయణ సహరచయిత. మొత్తంమీద మమతల చిత్రం మన శంకర వరప్రసాద్. అందరి మనస్సులకు చేరువగా నిలుస్తుంది.
— డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, సినీపరిశోధకులు, అధ్యాపకులు.





