*పట్టుదల+కృషి+నిబద్ధత= ఎన్టీఆర్

అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనందరిని వదిలి పోయి మూడు దశాబ్దాలు. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా చలామణి అవుతున్న రోజుల్లోనే తనని ఆదరించిన ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఇందిరా గాంధీ లాంటి రాజకీయ దిగ్గజంతో తలపడి అఖండ విజయాన్ని సాధించారు.

ఒకప్పుడు”నేను న్యూస్ పేపర్లు చదవను” అన్న వ్యక్తి అచిరకాలంలోనే రాజకీయాల్ని అపోశన పట్టి, పాలన వ్యవస్థలో ప్రజలే దేవుళ్ళు అంటూ ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

ఆయన తన సామాజిక వర్గానికే పదవులు ఇచ్చుకున్నాడు అని మొన్న ఈ మధ్య ఎవరో పోస్టు పెట్టడం చూసి నవ్వుకున్నాను. తెలుగుదేశం వచ్చిన తర్వాతే బీసీలు, దళిత సామాజిక వర్గాలు, ఎస్టీలు అనేకమంది రాజకీయంగా ఎదిగారు. మన తెలంగాణలో చూస్తే తలసాని, కృష్ణ యాదవ్, దేవేందర్ గౌడ్, రమణ, ఎర్రబెల్లి, సాయన్న ఇంకా చాలామంది నేతలు ప్రజానాయకులయ్యారు. ఈ విషయం రాజకీయాలు తెలిసిన ఎవరైనా చెబుతారు. అవినీతి పట్ల కఠినంగా వ్యవహరించడం, లౌక్యం తెలియకపోవటం, అందరినీ నమ్మడం ఆయన బలహీనతలు. ఆయన విషయంలో సొంత కుటుంబ సభ్యులు కూడా కొంత అమానవీయంగా ప్రవర్తించారని చెప్పక తప్పదు.

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువాడి సత్తా చూపిన నేత ఎన్టీఆర్. ఆ మధ్య సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ గారు ఒక విషయం చెప్పారు. ఇండియా టుడేలో పనిచేసేటప్పుడు – ఎన్టీఆర్ పై తను కథనం రాసి తీసుకువెళ్లి ఎన్టీఆర్ ఫోటోని పత్రిక కవర్ పేజీ గా వేయండి అని అడిగితే సదరు ఎడిటర్- “హూ ఈస్ ఎన్టీఆర్?” అని అడిగాడట. మీరు కథనం వేసి కవర్ పేజీ వేస్తే మీకే తెలుస్తుంది అని వెంకటనారాయణ గారు చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా ఎన్టీఆర్ ఎవరో తెలిసింది.

ముఖ్యంగా తెలుగు జాతి ఒకటి ఉందనే విషయం మన ఢిల్లీ పెద్దలకే తెలియని రోజుల్లో- వాళ్లు మనందరినీ మదరాసీలుగా గుర్తుచేసుకుంటున్న రోజుల్లో తెలుగు వాడి ఉనికిని ఢిల్లీ గడ్డపై చాటిన రాజకీయ యోధుడు ఎన్టీఆర్!

విపక్షంలో ఉన్నప్పుడు1994లో “సింహ గర్జన” పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిపిన తెలుగుదేశం పార్టీ సభకు వచ్చిన జనంతో సికింద్రాబాద్లో ఏ బజారు చూసినా జనమే!

ఆయనను వ్యతిరేకించే వాళ్లు కూడా ఈ సత్యాలను ఒప్పుకోక తప్పదు. తెలుగు వాడి వేడి లోకానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇప్పటికీ నాకు గుర్తు! ఆయన పరమపదించినప్పుడు ఈనాడు సిటీ డెస్క్ లో పనిచేస్తున్నాను. ఎల్బీ స్టేడియంలో వారి పార్థీవ దేహాన్ని ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ మహానేతకు కన్నీటి నివాళి అర్పించి వెనుతిరగటం ఈ కళ్ళతో చూశాను.

అంత్యక్రియల సమయంలో కూడా ఇసుక వేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాలు నిండిపోయాయి. కొందరు చెట్ల మీద కెక్కి, స్తంభాల మీదకి ఎక్కి తమ ప్రియతమ నేతను కడసారి చూపు చూడాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు, గాయాల పాలైన వారు ఎందరో! ఆయన వారికి ఏమైనా బంధువా? తోడబుట్టిన వాడా? కాదే! ఇంకా చెప్పాలంటే అంతకుమించి! అందుకే ఆ సాహసాలు!

ఒక వ్యక్తి చావు అంటే ఇలా ఉండాలి కదా? ఇన్ని లక్షల మంది తమ కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్నంత దుఃఖంతో వచ్చి నివాళి అర్పించడం చూసినప్పుడు నాకు అనిపించిన మాట నిజం.

ఇంకో విషయం చెప్పాలి ఆయన పార్టీ పెట్టిన తర్వాతే మాలాంటి వాళ్ళకి (అప్పుడు యువకులం కదా) అసెంబ్లీ స్థానాలు ఎన్ని? పార్లమెంటు స్థానాలు ఎన్ని? స్పీకర్ అంటే ఎవరు? పార్టీ విప్ పని ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలిసాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే స్తబ్దతగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఆయన ద్వారానే పుట్టింది.. ముఖ్యంగా యువతలో! అది సినిమాలపై మోజుతో కావచ్చు మరేదైనా కావచ్చు.

అలాంటి ఎన్టీ ఆర్ – రాజకీయ భిక్షతో ఎదిగిన నేతలు, ప్రజా నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం ఆయనను విస్మరించటం, హద్దులు మీరి విమర్శించడం, విగ్రహాలని కూల్చుతామనడం చాలా బాధాకరంగా ఉంది.

సాధారణ ప్రజలు కూడా ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు, మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్ పట్వారి విధానం రద్దు వంటి అన్నింటినీ ఆదరించి ఆనందించారు. ప్రతితల్లి, ప్రతిచెల్లి, ప్రతి యువకుడు ఆయనను సొంత అన్నగానే భావించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. రాష్ట్ర విభజనతో వాళ్ళందరూ ఏదో ఒక పార్టీల్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ అందరి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా ఉంటారు.

ఎన్టీఆర్ అమర్ రహే!
(జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి)

——చంద్ర ప్రతాప్ కంతేటి

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *