23నుంచి చిత్తారమ్మ జాతర

నగర శివారులోని గాజుల రామారం ప్రాంతంలో ఉన్న శ్రీ చిత్తారమ్మ దేవత జాతర జనవరి 23వ తేదీ శుక్రవారం ప్రారంభమై 30వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో ఈ జాతర జరుగుతుంది.
పేద, అణగారిన వర్గాల ఆరాధ్య దేవత చిత్తారమ్మ దేవి ఆలయం గాజుల రామారంలో ఉషా ముళ్ళపూడి కంటి ఆసుపత్రి సమీపంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతరలలో ఇది ఒకటి. గాజులరామారం ఆలయంలో జరిగే ప్రసిద్ధ ఆలయ ఉత్సవం చిత్తారమ్మ జాతర.

యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తారమ్మ ఆలయంలో ఈ ఏడాది జాతర కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ కమిటీ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో పోలీసు భద్రత, పరిశుభ్రత, ట్రాఫిక్, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.23వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 24వ తేదీ శనివారం గవ్యాంత పూజలు, మూలమంత్రజపము, ఆవహియ దేవతాహోమాలు, చండీహోమము, పూర్ణాహుతి, బలిప్రదానం, ఋత్విక్కుల సన్మానం ఉంటాయి. సాయంత్రం గాజుల రామారం నుండి శ్రీ చిత్తారమ్మ ఆలయం వరకు పూలఘటం ఊరేగింపు ఉంటాయి. 25వ తేదీ ఆదివారం నాడు జాతరలో ముఖ్యమైన రోజు.ఈ రోజు కార్యక్రమాలు తెల్లవారుజామున 3-00 గంటలకు అభిషేకంతో ప్రారంభమవుతాయి.ఉదయం 4-00 గంటలకు విజయ దర్శనం, తర్వాత తలంబ్రాలతో
(ఒడిబియ్యం), అమ్మవారి పూజలు జరుగుతాయి. తరువాత బోనం, పోతరాజు ఊరేగింపు ఉంటాయి. 26వ తేదీ సోమవారం రంగం దివ్యవాణి, సాయంత్రం ఉచిత ప్రదర్శనలు ఉంటాయి. 26,27,28,29 తేదీలలో కుంకుమార్చనలు ఉంటాయి. 30వ తేదీ భక్తులకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. జాతర రోజులలో ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ కమిటీ ఆశిస్తోంది.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *