మాఘమాసంలో ఐదవ రోజున వచ్చే పర్వదినాన్ని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. కొందరు దానిని మదన పంచమి అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజు. భారతావని అంతటా విశేషంగా జరుపుకునే ఈ పండగ నాడు చదువుల తల్లి సరస్వతి దేవికి పూజ చేయాలి. హిందువులు ఆరాధించే త్రిమూర్తులతో ముడిపడిన రోజు ఇది. శిశిరఋతువులో వసంతుణ్ణి స్వాగతించడానికి చిహ్నంగా వసంత పంచమిని భావిస్తారు. శ్రీ పంచమి నాడు ఋతురాజు వసంతుణ్ణి, మదనుణ్ణి, రతీదేవిని పూజించడం కూడా జరుగుతుంది. దక్షిణాదిలో వసంత పంచమిని శ్రీ పంచమి అంటారు.
లక్ష్మిదేవికి ఉన్న మరొక పేరు శ్రీ. ఇది ఆకులు రాలే కాలం. అమ్మవారి రాక కోసం ప్రకృతి కూడా సిద్ధమై ఉంటుంది. సరస్వతి దేవికి పసుపురంగు ఎక్కువ ఇష్టం. ఆమెకు స్వాగతం చెప్పడానికి చెట్ల నుంచి రాలిన పాండుతాకులతో పర్యావరణం నేలంతా పసుపుతో అలికారా అన్నట్లు ఉంటుంది.రతి దేవి,కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు కూడా. వసంత పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెట్టినవారు చదువులో రాణిస్తారని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే తెలుగువారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బాసర (ఆదిలాబాద్), వర్గల్ (మెదక్) తదితర సరస్వతి క్షేత్రాలకు ఆ రోజు వెళ్లి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో సరస్వతి పూజను మూడు రోజులు జరుపుతారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బడులు, కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు. శ్రీ పంచమి రోజు పిల్లలతో సరస్వతి శ్లోకాలు ముఖ్యంగా సరస్వతి ద్వాదశ నామాలు చెప్పించడం వల్ల సరస్వతి కటాక్షం లభిస్తుందని పురాణ పండితులు చెబుతున్నారు. సరస్వతి పూజను ఇంటిలో కూడా చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ముందు ధూపం మరియు దీపం వెలిగించండి. విగ్రహం లేదా ప్రతిమకు పసుపు, కుంకుమ మరియు గంధపు చెక్కను పూయండి. విగ్రహాన్ని దండతో అలంకరించి, పండ్లు మరియు స్వీట్లను నైవేద్యంగా ఉంచండి. ఆయా ప్రాంతాల వారు తమకు తోచిన విధంగా ఈ పండగను జరుపుకుంటారు. ఎవరు ఎలా జరుపుకున్నా ఆ తల్లి దీవెనలు అందరినీ వరించాలని కోరుకుందాం.





