ప్రభల తీర్థానికి అక్షర నైవేద్యం. ప్రభ మనందరి ఆధ్యాత్మిక వారసత్వం. ప్రభ అనగానే దేవాలయాలు వద్ద నెలవైన ఉత్సవ సమయాన ఊరేగే దేవుని ఉత్సవ విగ్రహములు స్మరణకి వస్తాయి. మా సీమవాసులు గర్వపడేలా జగానికి పరిచయం అయిన ప్రభల ప్రపంచం జగ్గన్నతోట సంబరం మది నిండారా పులకరింపచేస్తుంది. శివయ్య ఆజ్ఞ లేనిదే ఏది క్షణం అయినా కదలదు, నిలవలేదు. 50 వసంతాలు పైగా కోనసీమ వాసిగా ఉన్న నన్ను ఈసారి అన్నవరం వెళ్ళాలి అన్న ఆలోచన నుంచి నన్ను తీర్థం వైపు నడిపించారు. భావకుడిగా నా అక్షరాలు ప్రభల తీర్థంతో భావనతో జతకలిసాయి. అక్షరాలు అన్నీ అమ్మవారు, అయ్యవారు మీద ప్రేమతో నన్ను దీవించి నా అంతరంగాన్ని కదిలించింది. ఈ అనుభూతులకి ఆశీస్సులకి ఆదరణని అందించండి.
సంక్రాంతి పర్వదినం ఆనందంకి రేయింతా బంధుమిత్రులు సందడులు, కొత్త సినిమా పలకరింపుల నుంచి దిగి వచ్చి సూర్యుడి కన్నా ముందే మంచుతెరల మధ్య శీతాలాన్ని హాయిగా ఆస్వాదిస్తూ పదకొండు పల్లెలు ఒళ్ళు విరుచుకున్నాయి. స్యూరుడు సిగ్గుపడి, సుప్రభాత కిరణాలని నింగి నుంచి నేలకి దించినప్పుడు ఆరు అయినది. ముందురోజుముస్తాబు అయిన ప్రభ, రేయింతా సుముహూర్తం కోసం నిరీక్షించింది. గుడి తలుపులు తెరిచి దేవదేవుడికి జనం నమస్కరించారు. ఒక్కక్షణం అందరూ హరహరా అని పిలిచినప్పుడు కైలాసం కలవరపడింది. దేవేరి, దేవదేవుడు కొలువైన ప్రభలకి సర్వశక్తి యుక్తులు ఉపయోగించి మ్రోయాలని భుజాలు ఆరాట పడినప్పుడు మ్రోసినప్పుడు ప్రతీ హృదయం నందీశ్వరుడిలా మారింది. పుడమి మురిసిపోయింది. అడుగులు అడుగులు అన్నీ అణువణువు గమ్యం చేరాలి అన్న తపన తపస్సుగా అవతరించింది. పచ్చటి పట్టు చీరలా, ప్రతిబించించిన పచ్చని చేలు ఒక్కసారి మనసారా తాను ఉత్సవానికి సాక్షి సంతకం చేస్తున్నందుకు ఆనందంగా పచ్చగా నవ్వింది. పొలంలో చెలిమి చేసే కాలువ ప్రభల తనల్ని దాటి చేరుతున్నందుకు ఉత్సాహంగా హరిణంలా పరుగులు తీసింది. ఆశ్చర్యంగా జనం అందరూ లక్షల మారుతి లా మైమరిచినప్పుడు సంబరం అంబరాన్ని తాకింది.
పండుగకి వచ్చిన అతిధులు సైతం ఒక్కక్షణం అన్నీ మరిచి మేము సైతం అని కళ్యాణ పల్లకి మ్రోసిన వారిలా ప్రభలని చిన్నారి పాపలా అక్కున చేర్చుకున్నప్పుడు కొబ్బరాలు దారిపొడవునా స్వాగతించాయి. తియ్యని మాధుర్యాల్ని సమర్పించే అరటి పళ్ళు, ఈసారి ప్రసాదాలుగా వరంగా చెంత చేరాయి.చినుకు పడితే చిగురులని తన జ్ఞాపకంగా అందించే మట్టి. అది మట్టి రోడ్డు అయినా, తారు రోడ్డు అయిన పాదాల స్పర్శతో సందడిగా ఉంటే ప్రభలు నడిచి వెడుతున్నప్పుడు రాముని పాదం తాకిన అహల్యలా అంతరంగం అద్భుతంగా పులకరించింది.కళాతపస్వి భావనలలో శివయ్య ముక్కోపి, తిక్కశంకరుడు, రుద్రుడు అనగానే అందరికి కలవరం కలిగించే దక్షయజ్ఞం భావోద్వేగాలు రౌద్రం మెదులుతుంది. గానీ ప్రభల తీర్థం కరుణని పెంచే శివయ్య రూపం సాక్షాత్కరిస్తుంది. ఏకాదశ రుద్రులు, ఆధ్యాత్మిక సిరులుగా పండుగ సమయానికి ప్రభల తీర్థం సాక్షిగా కలసినప్పుడు నింగి సైతం అపురూపంగా మెరిసింది.వెలుగుల్ని పంచే దినకరుడి స్పర్శ నులివెచ్చని చలిని దూరం చేసింది. మధ్యాహ్నన సమయంలో చండ ప్రచండుడైన భానుడు జనానికి సేదతీర్చాలనే ఆకాంక్షతో మబ్బుల చాటున దాగి అమ్మ ఒడిలో దాగిన చిత్ర విచిత్రంగా ఉషస్సు వెలుగులు క్రీనీడగా మెరిసారు.
పొలాల చెంత వేడి వేడి పకోడీలు, మిర్చి సఖ్యత చేసిన బజ్జీలు, ఎర్రటి సింధూరంలా మెరిసిన చక్రాల జిలేబీలు అన్ని ఆకలిని గుర్తుచేసాయి. బాల్యాన్ని వెనుకకు తిప్పిన బూరాలు, రంగురంగుల బొమ్మలు, జీవకళతో ఉట్టిపడ్డాయి. పచ్చని చేలు, కొబ్బరాకులు, అరటి చెట్లు మధ్య వొదిగిన నెలవైన ప్రభలు అన్నీ కొలువైనప్పుడు శివయ్య పదకొండు అవతారాలుగా మదితలిచి నీరాజనాలు అందించింది.కోనసీమకి కనుమ అంటే పశువుల పండుగల ఒక్కటే గాదు. ప్రభల పండుగ. నాలుగు వందల సంవత్సరాలు అహరహం ఈ నేల గర్వంతో సంస్కృతిక సంపదతో పొర్లుతుంది.
పొలాల గట్లు, కాలువలని దాటే సమయాన ప్రభలని ప్రభంజనంలా చేర్చినప్పుడు ఆ తన్మయత్వానికి అమరపురి నుంచి మా అపర శ్రీనాధ కాళిదాసు వెండితెర ప్రతిభ ద్వయం వేటూరి, సిరివెన్నెల దిగి వచ్చి కలం కదిలిస్తే ఎంత బాగుంటుంది. ఆ ఊహ నిజం గావాలి అని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను.
లక్షల జనం పాదయాత్రగా తనువంతా నేత్రాలుగా ఈ ఉత్సవాన్ని వీక్షించారు. ప్రకృతి తెరలో సాయంకాలం కలిసి రేయి నెమ్మదిగా తరలి వచ్చినప్పుడు ప్రభలు అన్ని స్వస్థలాన్ని తరలిపోయారు. ఉత్సవానికి తెరపడిన అది మనస్సు తెరమీద కనబడుతుంది. పాత పరిచయాల గుబాళింపులు, స్నేహముల సుగంధాలు ఇవన్నీ తరం నుంచి తరానికి ప్రయాణిస్తూనే ఉన్నాయి. ప్రపంచం అంతా మారిన సంక్రాంతి అనగానే కోనసీమకి అన్ని ప్రాంతాల నుంచి ప్రభల తీర్థానికి ప్రపంచం కదులుతూ వస్తుంది. అది ముక్కామల, పెదపూడి, గంగలకుర్రు వంటి 11 రధాలుగా రుద్రులు “ఏకాదశ రుద్రులు”గా నిలిచే ఉత్సవానికి శతకోటి వందనాలు.
రచన : డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ అధ్యాపకులు, పరిశోధకులు.





