
తెలుగు సినిమా కథలు ఎప్పుడు భావోద్వేగాల అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక కధని రాసినప్పుడు దర్శకుడు, రచయిత ఊహలలో ఇమేజ్ గల కథనాయకుడిని భావిస్తారు. వారి అంచనాలు తెరపై దృశ్యంగా మారినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. కధలో మాస్ అంశాలను కథనాయకుడి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. ఒక్కసారి వారి ఊహ విజయవంతం అయితే అలాంటి కధలు వరుసగా వస్తాయి. గబ్బర్ సింగ్ తరువాత హరీష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో చాలా కాలం అనంతరం వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల గురించి సినీ అభిమానులు అందరూ నిరీక్షించారు.
ఈ ఉగాదికి విడుదల అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కధ, కథనాలు ప్రారంభం నుంచి చివరి వరకు దర్శకులు ఆసక్తిగా స్క్రీన్ ప్లేని రూపొందించారు. ఒకరకంగా మొత్తం కధ, కథనం అంతా పవన్ చుట్టూ తిరుగుతుంది. పవన్ ఇమేజ్ ని ఆయన భావజాలానికి అనుగుణంగా సంభాషణలు రాసారు అనిపించింది.
సినిమా ప్రారంభంలో వ్యాఖ్యానించిన విధంగా కధ ప్రారంభ సన్నివేశం అసలు కధని పరిచయం చేస్తుంది. గిరిజన ప్రాంతం నుంచి పాతబస్తీకి మరలా గిరిజన గూడెనికి కధ అనేక మలుపులు తిరుగుతుంది. అన్ని తెలుగు సినిమాలలో కనబడే పోలీస్, రాజకీయ వ్యవస్ధ, సంఘర్షణలు అధికంగా వీక్షించే సినీ ప్రేక్షకులకి సాధారణంగా అనిపిస్తాయి.
ప్రథమ భాగం అంతా సరదా సరదాగా నడుస్తుంది. పాతబస్తీ, మతపరమైన అంశాలు, రథయాత్ర ఇలా అన్నీ ఉద్వేగాల పరంగా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మరలా గుర్తుకి వస్తాయి.
సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల పాత్రలు ఉన్నాయి, గానీ శ్రీలీల పాత్ర ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకరకంగా శ్రీలీలకి చాల రోజులు తరువాత కధని మలుపు తిప్పే పాత్ర లభించింది. పవన్, శ్రీలీల సన్నివేశాలు సినిమా సీరియస్ నెన్ తగ్గించి వినోదాన్ని పంచాయి. తొలిప్రేమ పాట కాకుండా ఇద్దరి మధ్య ఒక పాటని చిత్రీకరిస్తే బాగుండేది. శ్రీలీల పాత్ర విషాదం చేయడం ప్రేక్షకులకి నచ్చలేదు. రాశిఖన్నా పాత్ర ప్లాష్ బ్యాక్ ని చెప్పడానికి దర్శకులు పెట్టారు.
పవన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత సమయం కేటాయించి సినిమా పూర్తి చేసారు. మొత్తం మీద సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమా కథని దర్శకులు తన అనుభవంతో కమర్షియల్ విలువలకి అనుగుణంగా తీర్చిదిద్దారు. తమిళ సినీ ప్రముఖులు కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలలో కనబడ్డారు. చిత్రంలో కోనసీమ ప్రాంతానికి చెందిన మిత్రులు శ్రీ వడ్లమాని సాయి శ్రీనివాస్ విలన్ పి.ఎ.గా కనబడ్డారు. దేవిశ్రీ, తమన్ సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో ప్రేమ, భయం, హస్యం భావోద్వేగాలు కనబడ్డాయి.
–డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
సినీ పరిశోధకులు, అధ్యాపకులు,
సెల్ : 9949039175




