వెండితెరపై ‘‘రామచంద్రోదయం’’

  • అయోధ్య, భద్రాచలంను తెరపై ఆవిష్కరించిన దర్శకులు *
    భావోద్వేగాలకు చిరునామా వెండితెర. ఒక విధంగా సినిమా ప్రస్ధానానికి నాంది పలికింది భక్తి భావోద్వేగం. కథలు, కవితలు, కావ్యాల కన్నా ఊహలకి ఉపిరిపోసే సినిమా కథనాలు అందరికీ ఆరాధ్యంగా మారాయి. ప్రజలందరికి ఇతిహాసాలను పరిచయం చేసింది కూడా వెండితెర. ఇతిహాసాలకు , ప్రజలకు మధ్య వారధిగా వెండితెర పనిచేసింది. వెండితెర గవాక్షం నుంచి పురాణపాత్రలన్నీ జనం హృదయాలపై అడుగులు వేసాయి. శ్రీ రామచంద్రుడి రూపం “ఆజానుబాహుం … అరవిందదళాయతాక్షం..” గురించి రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకున్న జనం వారి ఆలోచనలకు , ఊహలకు దగ్గరగా, ఎన్టీఆర్ తన అందమైన రూపం, ప్రత్యేకతలని తన వేషధారణతో సంప్రదాయాలను అనుసరించి నిష్టగా ధరించడం వలన, వెండితెర అయోధ్యగా మారింది. పరిమితంగా శ్రీరాముడు పాత్రలని పోషించినా ‘తారకరాముడు’ నిజంగా దశరధ రాముడిగా సజీవతను పొందారు. 60-70 దశకంలో పౌరాణిక చిత్రాలు రావడం వలన ‘రామయ్య తండ్రిగా’ ఎన్టీఆర్ ని సందర్శించే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. ‘అడవిరాముడు’ చిత్రంలో ఆరుపదులు దగ్గరగా అవుతున్న సమయంలో కూడా ఎన్టీఆర్ అందంగా మెరిసారు. ‘లవకుశ’ చిత్రంలో వైరాగ్యం, విషాదం, నిస్తేజం, విచారం అభినయాలని అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ నటనలో కొంచెం ఉద్వేగాల పాలు అధికంగా ఉంటుంది అనే విమర్శకి సమాధానంగా శ్రీరాముడి పాత్రలో తనని తాను నియంత్రించుకుని ప్రజల అభినందల్ని అందుకున్నారు నటరత్న. అంజలి దేవి సీతగా, ఎన్టీఆర్ తో సమంగా నటనని పండించారు . ఆయనది విచిత్రమైన ధోరణి. ప్రతినాయక పాత్రలని ఇష్టపడేవారు. రావణుడి పాత్రకు సీతారామకళ్యాణంలో వందశాతం న్యాయం చేసారు. శివభక్తుడిగా, వేదపండితుడిగా తీర్చిదిద్దారు. ఉషశ్రీ వంటి వాఖ్యాతలు ఈ శైలిని అంగీకరించలేదు. ఇదే సమయంలో అందాలతారగా ‘హరనాధ్’ రాముడిగా ప్రేక్షక హృదయాలని రంజింపచేసారు. ఎన్టీఆర్ రామకధని సరికొత్తగా ఆవిష్కరించారు. శ్రీరామాంజనేయ యుద్ధంలో ఎవ్వరికి అంతగా తెలియని శ్రీరాముడి మారుతి ‘సంవాదం’ తెరమీద పలికించారు. ఎన్టీఆర్ తరువాత ‘శ్రీరామభక్తుడు అయిన’ బాపు గారు ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం ద్వారా ‘శోభన్ బాబు’ని రాముడిగా, చంద్రకళని సీతగా ఎస్వీఆర్ ను రావణాసురుడిగా ‘చిరస్మరణీయంగా… తెరస్మరణీయంగా… తీర్చిదిద్దారు. రామచంద్రుడు అడుగులు వేసిన గోదావరి తీరంలో తన భావుకత ద్వారా అందరికి ఇష్టమైన రీతిలో రసరమ్యం చేశారు. శోభన్ బాబు చిత్రాలను కూడా ఎన్టీఆర్ ప్రోత్సహించారు. ‘శ్రీరామ జననం’ చిత్రం కూడా రాముడి చరిత్రని పారవశ్యంగా సమర్పించింది.
    70వ దశకం తరువాత, పౌరాణిక చిత్రాలు తగ్గాయి ‘సమాజ పరిస్ధితులు’ మారాయి. ప్రజల అభిరుచులు దారి తప్పాయి. ‘మాస్ చిత్రాలు’ పరంపర పెరిగింది. ఎన్టీఆర్ మాస్ చిత్రాల వైపు వెళ్లారు. అడవిరాముడు చిత్రంలో కూడా ఒక పాటలో రాముడిగా అభినయం
    చేశారు.
    80వ దశకంలో పరిచయమైన ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణకు కూడా ‘ఇతిహాసాల కథలు’ అంటే అభిమానం. అందుకే మంగమ్మగారి మనవడు, బాబాయి అబ్బాయి చిత్రాలలో రాముడిగా అతిథి పాత్రలో కనిపించారు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యంలో ‘రామచంద్రుడి’గా తెరమీద అలరించారు. ఆ చిత్రాన్ని లవకుశ చిత్రానికి అనువాదం అనే విమర్శలు వినిపించాయి. బాపు బాల మారుతి పాత్రని సృష్టించారు. చిత్రంలో చాలా పాటలు ఉన్నాయి గానీ ‘జగదానంద కారక’ పాట ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడం విశేషం. బాలు స్వరం, ఇళయరాజా ప్రతిభ, పాటకు జీవం పోశాయి.
    దర్శకేంద్రుడు అనగానే ప్రతీవారికి రసజ్ఞత, శృంగార భావాలు అందరికి గుర్తువస్తాయి. పూలు, పండ్లు, పరిమిళాలు బదులుగా ‘అన్నమయ్య’ చిత్రం తరువాత, శ్రీరామదాసు చిత్రం ద్వారా ‘అంతా రామయం’ గా వెండితెరని భద్రాచలంగా మార్చారు. పండితులకి అవగాహన కలిగిన రామదాసు కీర్తనలని సంకీర్తనలుగా కీరవాణి సంగీతం ద్వారా రంజింపచేసారు. సినిమా అంతా ‘దృశ్య, సంగీత భావోద్వేగాల’ ని అశేషజనానికి వరంగా అందించారు. భద్రాచలంలో చిత్రీకరించాలని ప్రయత్నించినా జనవాహినిని అదుపు చేయలేకపోయారు. కీలక సన్నివేశాలు భద్రాచలం రామాలయం వద్ద చిత్రీకరించారు.
    రాముడి గురించి ఎన్నో పాటలు వచ్చాయి. దేవుళ్ళు చిత్రంలో ‘అందరి బంధువయా భద్రాచల రామయ్య’ అనే పాట గోదావరి తీరంలో రాజేంద్రప్రసాద్ అద్భుత అభినయ స్పర్శ ద్వారా జన హృదయాలకు సన్నిహితమైంది. ఇన్నేళ్ల తరువాత కూడా ఆ పాట తెలుగిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది.
    ‘ప్రపంచ మార్కెట్’ను దృష్టిలో ఉంచుకొని న్యూమిలీనియం చిత్రాలు వస్తున్నాయి. కమర్షియల్ రంగులు అద్దారు. కధలు, కథనాలు మారాయి. అయినా ఆధ్యాత్మికత అడపా దడపా వినబడుతున్నాయి. ‘శ్రీమంతుడు’ చిత్రంలో శ్రీరామనవమి వేడుకల గీతం అందరి ఆదరణ పొందింది.
    శ్రీ రాముని ప్రస్తావన ఆదర్శాల సంగతి కథలలో క్రీనీడగా అందరికి పంచుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ‘ఆది పురుష్’ చిత్రంలో గ్రాఫిక్స్ ద్వారా కొత్తగా ‘రామకధని’ వినిపించారు. కధలో ‘భావోద్వేగాలు’ కరువయ్యాయి అనే విమర్శ వినబడింది.
    ఎన్టీఆర్ కు ప్రియమైన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాలరామాయణం’ చిత్రంలో రాముడిగా మెప్పించారు. గుణశేఖర్ సాగరతీరంలో పరిశ్రమించి రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సాయి పల్లవి సీతగా రామాయణం చిత్రం రూపుదిద్దుకుంటున్న వార్తలు వెలువడ్డాయి.
    దూరదర్శన్ ద్వారా ప్రసారమైన ‘రామాయణ్’ రామానంద్ సాగర్ కు మంచి పేరు తెచ్చింది. శ్రీరామకథ నీతికి, నిజాయితీకి, సంస్కారానికి ప్రతిబింబం. ‘శ్రీరామనవమి’ సందర్భంగా సీతారామచంద్రస్వామికి అక్షర వందనం.

-డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
సినీపరిశోధకులు — 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *