
ఓ యు టి కాలనీ రామాలయంలో …
అయోధ్య పురాధీశులు శ్రీ దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్ర మూర్తికి
మిథిల నగరాధీశులు శ్రీ జనకమహారాజు గారి జ్యేష్ఠ పుత్రిక సీతాదేవిని ఇచ్చి లోక కళ్యాణార్ధం
కళ్యాణం జరుగును. గ్రేటర్ హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్ లోని వివిధ దేవాలయాలు ,
కాలనీలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిపేందుకు
ఆయా ఆలయ కమిటీలు, ట్రస్టీలు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సైనిక్ పురి ఓ యు
టీచర్స్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ప్రయుక్త
వసంత నవరాత్రి ఉత్సవములలో భాగంగా శుక్రవారం (27న) కళ్యాణమహోత్సవం,
అన్న ప్రసాద వితరణ , శ్రీ రామభక్తి సామ్రాజ్యం బృందంచే శ్రీరామదాసు నవరత్న కీర్తనల బృందగానం.
శనివారం (28న) శ్రీ సీతారామచంద్ర స్వామి లక్షపుష్పార్చన, శ్రీరామ మహా సామ్రాజ్య
పట్టాభిషేకం, ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి ఉంటాయి. ఇతర వివరాల కోసం అర్చక స్వామిని
9704533470 నెంబరులో సంప్రదించవచ్చు.
శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ
సైనికపురి – మాధవపురి కాలనీలో సీనియర్ సిటిజన్స్, యువత కలసి ఏర్పాటు చేసిన
శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ గత పదహారేళ్లుగా గణపతి నవరాత్రులు, శ్రీ సీతారాముల
కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శుక్రవారం అభిజిత్ లగ్నంలో
లోక కళ్యాణార్ధం జరిగే క్రతువును వీక్షించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ,
మర్యాద పురుషోత్తముడు , సాధ్వీ సీతమ్మ తల్లి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని
కమిటీ సభ్యులు కోరుతున్నారు. శ్రీ సీతారాం కళ్యాణ మహోత్సవం శ్రీ ఆత్రేయపురపు
సాయి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కళ్యాణం తరువాత విందు ఉంటుంది.
సాయంత్రం కాలనీ పురవీధుల మీదుగా కాగడ పల్లకీ సేవ ఊరేగింపు జరుగుతుంది.
తదుపరి కాలనీ బాలబాలికలచే నృత్యప్రదర్శన, తంబోలా ఉంటాయి. మరిన్ని
వివరాలకోసం శ్రీ రామ వినాయక కమిటీ సెల్ నెంబరు 8008705038లో సంప్రదించవచ్చు.

శ్రీ శివ మార్కండేయ దేవాలయం
కాప్రా పద్మశాలి టౌన్షిప్ లోని శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో అభిజిత్ లగ్నంలో
వేద మంత్రోచ్ఛారణతో, మంగళవాయిద్యాలతో అతి వైభవంగా, కన్నుల పండువగా శ్రీ
సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. పద్మశాలి టౌన్షిప్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్
ట్రస్ట్ చైర్మన్ సీత ఆంజనేయులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ
మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానిస్తున్నారు.
శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని బ్రహ్మశ్రీ అనిల్ శర్మ నిర్వహిస్తారు. (సెల్ నెంబర్: 6301477384)
సైనికపురి శంకర మఠంలో
మార్చి 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి సందర్బంగా ఉదయం 8-30కు అభిషేకం.
తదుపరి పూజ, 10 గంటలకు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తదుపరి
భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సైనిక్ పురి శృంగేరి శంకర మఠంలో జరిగే
కార్యక్రమాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం భక్తులు 7981898489 / 939456676 నంబర్లలో
సంప్రదించవచ్చు.
యాప్రాల్ హాబిటాట్ రాయల్ సముదాయంలో

హాబిటాట్ రాయల్ అపార్ట్మెంట్స్ సముదాయంలో శ్రీ రామనవమి ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహిస్తున్నారు. మూడు రోజులు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
విశేషం. తొలిరోజు బుధవారం వేదిక ఏర్పాటు, సన్నాహాలు, విగ్రహాలను తేవడం,
తలంబ్రాలు కలపడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు
పడాల రాము, ప్రధాన కార్యదర్శి జి.వి.కె. విశ్వనాథ శాస్త్రి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సాకేత్ కాలనీలో త్యాగరాజ ఆరాధనోత్సవం
తెలంగాణ ప్రాంత సంస్కార భారతికి అనుబంధంగా ఉన్న సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో సాకేత్ కాలనీలో నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల వసంతోత్సవం 2026లో భాగంగా శుక్రవారం కళోత్సవం తొమ్మిదవ రోజు ఆధ్యాత్మిక భావనను పెంపొందించే విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. తదుపరి త్యాగరాజ ఆరాధనోత్సవం జరుగుతుంది. తొమ్మిది రోజుల కళోత్సవంలో రోజుకో కళారూపాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ముగింపుగా త్యాగరాజ ఆరాధనోత్సవం జరపడం సంస్కార భారతి ప్రత్యేకత.
ఇంకా డిఫెన్స్ కాలనీ రామాలయంలో, సైనిక్ పురిలోని సాయిబాబా మందిరాలలో కూడా
శ్రీ రామ నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.




