
వేసవి ఆత్మీయతల బొమ్మరిల్లు .. అనురాగాల పొదరిల్లు!
అమ్మమ్మ తాతయ్యలు పంచిన మమతానురాగాల హరివిల్లు !
బంగినపల్లి, కొత్తపలి కొబ్బరి మామిడి పండుల రుచుల తియ్యదనాల చిరుజల్లు!
మామిడికాయ, నూనె, కారం, లవణం
సఖ్యతగా నడిచిన ఆవకాయ, మాగాయ అనుబంధాల నిలయం
దేశం అంతా గోవిందా అని స్మరించి తిరుమలవాసుని చెంతచేరే జన ప్రభంజనం
బాల్యం జ్ఞాపకాల ఇంద్రధనుస్సు
అనుభూతుల కలువల సరస్సు
కల్మషం తెలియని మనస్సు
వేసవి వెలుగుల ఉషస్సు
మనస్సుని మురిపించే ప్రకృతి సందర్శనం చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. చల్లదనాల వెన్నెలని పంచుతుంది. తనువుకి హాయినిచ్చే శీతలంలో చలిగాలి గిలిగింతలని అందిస్తుంది. చినుకు కబురులని కమ్మగా వర్షరాగంలో వినిపిస్తుంది. అయినా ప్రకృతి కాంత అంతరంగం ఒకేలా ఉండదు. అతివ మనస్సు గదా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం అసాధ్యం. ప్రకృతి ఒక్కొక్కసారి హాయిని వరంగా అందిస్తుంది. ఇంకోసారి హహకారాలు నిలయమైన మండువేసవి నిలుపుతుంది. సినీ రచయిత సిరివెన్నెల పదాలు అక్షర సత్యాలు. ప్రకృతి కాంతకు ఎన్ని సొగసులు.
మనస్సు తెరపై అత్మీయంగా అభిషేకించిన మంచుబిందువులు, పుడమిపై కప్పిన మంచు దుప్పటి శివరాత్రికి శివశివ అని వీడ్కోలు తీసుకుంటాయి. మరలా కార్తీకం వరకు కనబడవు. చైత్రమాస కోయిల పిలుపులేగాదు, గున్నమావి చిగురులు పండించిన మామిడి తియ్యదనాలు, గుబాళించే మల్లెపువ్వుల మత్తులే గాదు వేసవి ఉక్కబోతకు తలుపులు తెరుస్తుంది. చిరుగాలి చల్లదనం కనురెప్పకి కనబడదు. అదృశ్యంగా మారుతుంది. శరీరానికి తన్మయత్వం కలిగించే శీతలం స్ధానే అగ్నికి ప్రతిబింబంలా మండుటెండ వేధిస్తుంది. శరీరాన్ని స్వేదం నిలువెల్లా అభిషేకిస్తుంది. క్షణక్షణం గొంతు దాహం, దాహం అని పరితపిస్తుంది. శీతల పానీయాలు ఎంత త్రాగినా ఇంకా కావాలి అని అభ్యర్ధిస్తూ ఉంటుంది. చల్లదనాల ప్రతిరూపాలు ఎసి, కూలర్లు ఎంత తిరుగుతున్నా ఏదో తెలియని అలజడి వేధిస్తుంది. నిత్యం సందడిగా ఉండే రహదారి పదకొండు గంటలకే నిశ్శబ్ధాన్ని పాటిస్తుంది. సాయంసంధ్య వరకు ఒంటరిగా మిగిలిపోతుంది. సూర్యుడి ఉషస్సు చురుక్కు చురుక్కు అని తగిలి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అమ్మచేతి వంట అమృతంలా ఉన్నా ఈ వేసవి ఎండ వేడిమికి రుచించకుండానే వీడ్కోలు తీసుకుంటుంది. చల్లని నీరు, క్షణ క్షణం సేదదీర్చే మంత్రం అవుతుంది. నిత్యం సరదా సరదగా సంచరించే మూగ జీవాలు సైతం ప్రచండ భానుడి ప్రభావానికి విలవిలలాడుతాయి. చెట్ల చెంత చేరి దీనంగా సేదతీర్చుకుంటుంటాయి . ఎండదెబ్బకి పరికిణి భామ అయినా వయస్సు పిలిచిన బామ్మ అయినా హుషారుగా ఉన్నా కుర్రోడు అయినా, తాతగారు అయినా ఎండకి గాబరా పడాల్సిందే. పచ్చతోరణాల పెళ్ళి ఇల్లు సైతం ఎండకి కలవరపడుతుంది. సరదా సరదా సంగతుల్ని మరిచిపోతుంది. రేయి కరిగిపోతుంటే భయంగా అనిపిస్తుంది. అయిన పిచ్చిగాని పగలుకి, రేయికి తేడా ఏం ఉంది. వేడిమి దహించివేస్తోంది. వెలుగులు పరదా తెరిచే సూర్యుడ్ని వీక్షించి జగతి ఉలికి పడుతుంది. ఎర్రబడిన సింధూరం అందరిని స్పశిస్తుంది. జీవన ధర్మం తప్పదు గదా..
భానుడి ప్రతాపం ఎంత పెంచినా శ్రమవీరుల పొట్టకూటి కోసం ఆగదు ఈ ప్రయాణం. అక్షరం వారధిపై నడిచి, జ్ఞానాన్ని అర్హతగా ఉపాధిగా గమ్యం వెళ్ళాలని నిరీక్షించే పరీక్షలు పరుగులు తీస్తున్నాయి. ఊరంతా మూగబోయినా ఉనికి కోసం శ్రమించే జీవితం సూర్యుడికి దిక్సూచిగా నిలుస్తుంది. చల్లదనం వరంగా మేఘం చినుకులని వర్షించాలని, జడివాన కురవాలని చినుకు కబురు కోసం మనుషులే గాదు, మొక్కలు కూడా రుతుపవనాల రాకకై ఆశగా చినుకుకోసం నిరీక్షిస్తున్నాయి.
- డా.దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , పరిశోధకులు
సెల్ : 99490 39175





