

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన ।
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥
ఈ బ్రహ్మాండంలో తిరుమల (వేంకటాద్రి) క్షేత్రానికి సమానమైన పుణ్యక్షేత్రం మరొకటి లేదు. అలాగే, శ్రీ వేంకటేశ్వరునికి సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు. శ్రీ వేంకటేశ్వరునికి నిరంతరం జరిగే ఉత్సవాల గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. జేష్ఠమాసంలో ప్రత్యేక ఉత్సవాలలో జ్యేష్ఠాభిషేకం ప్రత్యేకమైనది. వైఖానస ఆగమం ప్రకారం దీనిని జూన్ 26 నుంచి 28వ తేదీవరకు నిర్వహిస్తారు. జ్యేష్ఠాభిషేకమును ‘అభిధేయక అభిషేకం’ అని కూడా సంప్రదాయ సిద్దంగా పిలుస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది.
జ్యేష్ఠాభిషేకం అనేది శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు అనేక హిందూ దేవాలయాల్లో జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వార్షిక పవిత్రోత్సవం. ఉత్సవ మూర్తులకు తరచూ చేసే ఉపచారాలు, అభిషేకాలు, పంచామృత స్నపనాల వల్ల విగ్రహాలు చెక్కుచెదరకుండా, వాటి కళాకాంతి పరిరక్షించేందుకు చేసేప్రక్రియ. ప్రత్యేక మంత్రాలతో శాస్త్రోక్తంగా అభిషేకం ఉత్సవ మూర్తులకు చేస్తారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో అభిధేయక అభిషేకం ఉత్సవం మూడు రోజుల పాటు వైభవంగా ఈ సంవత్సరం జూన్ 26 నుంచి 28వ తేదీవరకు జరుగుతుంది.
జ్యేష్ఠాభిషేకం మొదటిరోజు, శ్రీవారికి మాధ్యాహ్నిక ఆరాధన అయిన తర్వాత, శ్రీమలయప్ప స్వామి వారిని, ఉభయదేవేరి సమే తంగా విమానప్రాకారప్రదక్షిణగా, సంపంగి ప్రాకారంలోని యాగ శాలలో ‘అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం’ అనే వైదికక్రియను 108 కలశాలతో నిర్వహిస్తారు. కల్యాణమండపంలోని యాగ శాలకు వేంచేపు చేస్తారు. వైఖానస భగవచ్ఛాస్త్ర విధిగా దేవతా ప్రార్ధన, విష్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యా హవచనం, అంకురార్పణం, రక్షా బంధనం, అగ్నిప్రణయనం మొద లైన క్రియలను శాస్త్రోక్తంగా, వేద మంత్ర పురస్సరంగా నిర్వహిస్తారు. యాగశాలలో 108 కలశములను, 9 కలశములను ఒక అమరికగా- 4 వరుసలలో ఉంచుతారు. ఇలాంటి వరుసలు మూడుంటాయి. మధ్యలో ఉన్న ప్రధాన కలశంలో వరుణదేవతను ఆవాహన చేసి ఉపచార సమర్పణ చేస్తారు. ప్రధానహోమం, ప్రాయశ్చిత్తహోమం, అంతహోమాలను పూర్ణాహుతి నిర్వహించి అగ్ని ఉపస్థానం చేయడంతో హోమకైంకర్యం సమాప్తి అవుతుంది. అనంతరం శ్రీవారి ఉత్సవమూర్తులకు 12 రకాల ద్రవ్యాలతో మరియు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనాదులతో విశేష స్నపన తిరు మంజనం జరుగుతుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామివారిని, అతివిలువైన, ముగ్ధమనోహరమైన వజ్ర కవచంతో అలంకరించి, నాలుగు తిరుమాడావీథులలో ఊరేగింపు నిర్వహిస్తారు.
రెండో రోజు ఉత్సవం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉత్సవ మూర్తులకు ‘ముత్యాల కవచం’ సమర్పిస్తారు.
మూడో రోజు ఉత్సవంలో భాగంగా స్వామివారికి తిరిగి ‘స్వర్ణ కవచం’ అలంకరిస్తారు. ఇలా మÖడు రోజులపాటు
శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు పరిరక్షణ ప్రక్రియను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహించడం ఆచారం. చేపడతారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా అంటారు.
మÖడవరోజు స్వామికి అలంకరించిన ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే దర్శనం ఇస్తారు. స్వర్ణకవచ సమర్పణకు ముందు, శ్రీవారిమూర్తులకు సుగంధ తైలమును సమర్పించి, నిజతిరు మేనుపై చందనం, ఆపై పల్చటి శ్వేత వస్త్రం ధరింపజేసి, కవచ ధారణ చేస్తారు. ఇటువంటి మహత్తరమైన జ్యేష్ఠాభిషేక మహో త్సవం, తిరుమలలో అంగరంగ వైభవంగా, నేత్రపర్వంగా తిలకించి తరించాలి.
జ్యేష్ఠాభిషేకం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. అయితే తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు.
శ్రీవారి మూలవిరాట్రూపంలో దివ్యమైన సాన్నిధ్య శక్తిని, కౌతుకరూపంలో ఉన్న విగ్రహమునందు నిత్యం ఆవాహనం చేసి, విధిపూర్వకంగా అరాధన నిర్వహిస్తారు. ఇది ‘ఐహిక ఆముష్మిక’ ఫలప్రదంగా చెప్పబడింది. అంటే ఎటువంటి భౌతికమైన కోరికలు లేక మోక్షాన్ని కోరి స్వామిని సేవించేవారు. అలాగే తమ ఇష్ట కామ్యార్థసిద్ధికోసం స్వామిని దర్శించేవారు. ఇరువర్గాలవారి కొరకు తప్పనిసరిగా కౌతుకమూర్తి ఆరాధన జరపాలని వైఖానస ఆగమం పేర్కొన్నందు వలన, తిరుమలలో 614వ సంవత్సరంలో, పల్లవరాణి ‘సామవై పేరుందేవి’ ద్వార, వెండి విగ్రహమైన, శ్రీభోగశ్రీనివాస మూర్తి బహూకరించారు. నాటినుండి ఇది కౌతుకబేరంగా ప్రతిష్ఠగావించ బడింది. క్రమేపి ఆలయంలో ఉత్సవాలను జనరంజకంగా నిర్వ హించటానికి 1339 సంవత్సరంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారి పంచలోహవిగ్రహాలు ప్రతిష్ఠించబడినాయి.
శ్రీవారి ఆలయంలో ఏటా 365 రోజులకు గానూ, సుమారు 470 ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహింపబడుతున్నాయి. వైఖానసాగమోక్తంగా జరుపబడే ఈ ఉత్సవాలలో భాగంగా, శ్రీమల యప్పస్వామివారికి అభిషేకాలు, స్నపన తిరుమంజనాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అభిషేకాలు జరుపడం వల్ల బింబముల మూలస్వరూపంలో మార్పులు, అరుగుదల సంభవించే అవకాశం ఉంది. దీని పరిష్కారం కొరకు 90వ దశకంలో శ్రీవారి ఆలయంలో సంవత్సర ఉత్సవంగా ‘జ్యేష్టాభిషేకం’ అనే ఉత్సవం ప్రవేశపెట్టబడి శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతున్నది. జ్యేష్ఠాభిషేక మహోత్సవానికి 15 రోజులు ముందుగా శ్రీవారి ఉత్సవమూర్తు లైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి గత సంవత్సరం సమర్పించబడిన స్వర్ణకవచములు సడలింపు చేస్తారు. ఈ ఉత్సవ నిర్వహణకు ప్రత్యేకంగా ‘కంకణ భట్టర’ అని పిలువబడే వైఖానస అర్చకునికి ప్రధానా చార్యునిగా బాధ్యతలు ఇస్తారు. వారు ఉత్సవమూర్తుల మీదున్న స్వర్ణకవచమును ‘పరిలిఖిత…’ అను మంత్రంతో స్వర్ణకవచ చక్కగా పరిశోధన చేయడానకి వీలుగా . అటుపై ఆ ములలో ఏదైనా లోపములుంటే, వాటిని పడలింప చేసి, సుశిక్షితుడైన శిల్పిచే వాటిని సరి చేసిసిద్ధంగా ఉంచుకోవాలని శాస్త్ర వచనం.
ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ, శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యాశీసులతో, అన్ని కార్యాలు నిర్విఘ్నంగా నెర వేరుతాయి. సమస్తమనోవాంఛలు సిద్ధిస్తాయని భృగుమహర్షి పేర్కొన్నాడు. స్వామివారికి నిత్యం అలంకరించి ఉన్న వజ్రకవచ వృత్తాంతం మరింత ఆసక్తి కలిగిస్తుంది.
–వొద్దిపర్తి రామచంద్రమÖర్తి (సీనియర్ జర్నలిస్టు)





