సాహసానికి నిర్వచనం సూపర్ స్టార్


** మే 31 ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్బంగా**

    వెండితెర గర్వపడే కళాకారులు ఇద్దరు మే నెలలో జన్మించారు. నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరిని తెలుగుప్రజలు విపరీతంగా ఆరాధించారు. కృష్ణ గారు 1943లో జన్మించారు. ఎన్టీఆర్  అభిమాని అయిన కృష్ణ, ఆయన సలహాపై  డిగ్రీ పూర్తి చేసి తేనెమనస్సులు ద్వారా పరిచయం అయ్యారు.  కృష్ణ మితభాషి. ఆలోచనలు అద్భుతంగా ఉండేవి. తెలుగు సినీ పరిశ్రమ గర్వించే అంశాలుకి నాంధి పలికారు. హాలీవుడ్ స్ధాయిలో చిత్రాలు నిర్మించారు. మోసగాళ్ళకి మోసగాడు,గూఢచారి 116 చిత్రాలు చిరస్ధాయిగా నిలిచాయి. రాజస్ధాన్ లో కురుక్షేత్రం చిత్రీకరణ చేసారు. దర్శకుడు దివంగతులు అయినా అధైర్య పడకుండా అల్లూరి సీతారామరాజు చిత్రం సమర్పించారు. తెలుగుజాతి గర్వపడే సినిమా ప్రేక్షకులకి వరంగా అందించారు. కృష్ణగారు ఒకేరోజులో 3 షిప్టులు పనిచేసారు. సంవత్సరానికి పది సినిమాలు పైగా నటించారు. పండంటి కాపురం వంటి కుటుంబ కథని అందంగా తెరమీద నడిపించారు. ఎన్టీఆర్ తో దేవుడు చేసిన మనుషులు చిత్రం నటించి, నిర్మాతగా వ్యవహరించారు.
 1970-80 మధ్యకాలంలో కృష్ణ గారు విజయవంతమైన చిత్రాలకి చిరునామాగా నిలిచారు. ఈనాడు వంటి రాజకీయ చిత్రం అందించారు. ఎన్టీఆర్ రాజకీయాలులో వెళ్ళిన తరువాత, నెంబర్ వన్ గా ఎదిగారు. చిరంజీవి వంటి యువకధానాయకులతో పోటీగా నిలిచి అందరి ఆదరణని పొందారు.
 సూపర్ స్టార్ కృష్ణ మంచి విమర్శకులు. సినిమా విజయం గురించి ముందే చెప్పడం విశేషం. సింహాసనం చిత్రం 1985 సంవత్సరంలో సంచలనం అయింది. ఎన్టీఆర్ తో రాజకీయంగా విభేదించి ఆయన పాలనపై సినిమాలు తీసారు. ఎవ్వరూ చేయలేని సాహసం చేసారు. రాజకీయాలు మీద ఆసక్తి లేకున్నా, రాజీవ్ గాంధీ అభ్యర్ధన మేరకు ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా1989లో పోటీచేసి విజేత అయినారు. తరువాత కాలంలో రాజీవ్ గాంధీ మరణం తరువాత రాజకీయాలుకి దూరంగా ఉన్నారు.
 కృష్ణ గారు 1960-2010 వరకు అయిదు దశాబ్ధాలు నటుడిగా అన్ని తరాల దర్శకులు నటీనటులుతో నటించారు. శారద నుంచి సౌందర్య వరకు అందరి తారలతో అభినయించారు. ఆదుర్తి గారి నుంచి ఎన్వీ కృష్ణారెడ్డి వరకు అందరి దర్శకులు వద్ద నటించారు. విజయ నిర్మల  దర్శకత్వంలో అధికంగా నటించారు.
 సూపర్ స్టార్ కృష్ణ  పేరు వినగానే అల్లూరి సీతారామరాజు చిత్రం స్మరణకి వస్తుంది. సమకాలీన చిత్రాలపై తన అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పేవారు. ఆయన చిరునవ్వులో అందం దాగిఉంది. నిర్మాతలను ఆర్ధికంగా ఆదుకునేవారు. మహేష్ బాబు ని నటుడిగా తీర్చిదిద్దారు.
 ఎన్టీఆర్  తరువాత, కృష్ణను చాలా మంది అభిమానించారు. 1984 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారి చెంత కాకినాడ సభలో కృష్ణగారిని చూసే అదృష్టం కలిగింది. కృష్ణ గారు మన మధ్యలేకున్నా ఆయన చిత్రాలలో కృష్ణ ను ఎప్పటికి చిరంజీవిగా  నిలుపుతున్నాయి.

— దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
అధ్యాపకులు, పరిశోధకులు , సెల్ : 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *