
- ఆర్వీ రామారావు
లోకాన్ని, మనుషులను ప్రేమించే వారు తమను తాము అంతగా పట్టించుకోరేమో! సాహిత్యోద్యమ నిర్మాణం కోసం తమ సృజనాత్మక శక్తిని త్యాగం చేసే వారు కొందరే ఉంటారు. డా. ఏటుకూరి ప్రసాద్ అలాంటి విశిష్ట వ్యక్తిత్వం గల మనిషి, అనేక విషయాల గురించి సమగ్ర అవగాహన ఉన్న వారు ఏదో ఒక రంగం మీద దృష్టి నిలిపి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకోరు. ఏటుకూరి ప్రసాద్ సరిగా అలాంటి వారే. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన అభ్యుదయ పథంలోనే నడిచారు. 1955లో అనుకుంటా అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. అప్పటికి ఆయనకు 19 ఏళ్లు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరగానే అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో చేరినప్పటి నుంచి ఆయన కమ్యూనిస్టు భావాల వేపు ఆకర్షితులయ్యారు. దీనికి కారణం ఆయన పెదనాన్న ఏటుకూరి సీతారామయ్య ప్రభావం, వారి కుమారులు ఏటుకూరి బల రామమూర్తి, కృష్ణ మూర్తి నడిచిన బాటే కారణం. 1955 తరవాత అభ్యుదయ రచయితల సంఘం - నిస్తేజంగా మారింది. 1970 ఆరంభంలో అభ్యుదయ రచయితల సంఘ పునర్నిమాణ ప్రయత్నాలు మొదలైనప్పుడు అందులో ప్రసాద్ క్రియాశీల పాత్ర ధారి. అక్కడి నుంచి ఆయన అభ్యుదయ రచయితల సంఘం జెండాను కడదాకా బుజం మీంచి దించనే లేదు. జీవితాంతం కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సభ్యుడిగానే - కొనసాగారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు రాంభట్ల కృష్ణ మూర్తి, గజ్జెల మల్లా రెడ్డి ఆ ప్రయత్నాలకు చుక్కానులుగా ఉన్నా, ప్రధాన నిర్మాణ బాధ్యత అంత ప్రసాద్ దే. 1970లో మొదలైన ప్రయత్నాలు 1973లో గుంటూరు మహాసభలో సంఘటితమయ్యాయి. అప్పుడు ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ విభాగం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటికే ఆయన 1972లో హైదరాబాద్ అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. శనివారం (2026 మే 23) దాకా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షవర్గ సభ్యులుగా కొనసాగారు.ఎర్ర జెండా, ఎర్రబాట, శివాలయ్య (రూపకం) ఆయనకు కవిగా మంచి గుర్తింపు తెచ్చాయి. ఆయన తన గేయాలను తానే పాడి వినిపించే వారు. ఆయన పాడే తీరు జనాన్ని బాగా ఉత్సాహ పరిచేది. ఈ మధ్య కాలంలో కూడా . ఆయన ఏ కవిత రాసినా నాబోటి వారు కొందరికి ఫోన్లో చదివి వినిపించే వారు. ఇది మీరు విశాలాంధ్రలో వేసుకుంటారా అని అడిగేటంతటి సౌమ్య మూర్తి ఆయన. తాపీ ధర్మా రావు మీద ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన పిహెచ్ డి. సిద్ధాంత గ్రంథం అత్యంత ప్రామాణికమైంది. మానుష శాస్త్రంలో తాతాజీ కృషిని ఎత్తి చూపింది ఈ సిద్ధాంత గ్రంథమే. శిష్ట్లా ఉమా మహేశ్వర రావు "నవమి చిలుక”, “విష్ణు ధనువు” గ్రంథాలను వెతికి పట్టుకోవడానికి ఆయన పడ్డ శ్రమ అసామాన్యమైంది. ఈ రెండింటినీ ఆవంత్స సోమసుందర్ దగ్గరుంటే తీసుకుని ప్రసా కు పంపించాను. అలాగే కొంపెల్ల జనార్దన రావు రచనలన్నింటినీ సేకరించి ముద్రించారు. ఆ తరవాత మొదటి ప్రయత్న సమయంలో దొరకని, జారిపోయిన కొంపెల్ల రచనలన్నింటినీ సేకరించి ఇటీవలే పరివర్ధిత ప్రతి ప్రచురణ పని పూర్తి చేశారు. ఆ గ్రంథం నమూనా ప్రతిని ఇటీవలే కళ్లారా చూసుకున్నారు. ఇది ప్రస్తుతం ముద్రణలో ఉంది. త్వరలో వెలువడుతుంది. మొదటి సారి కొంపెల్ల రచనల కోసం ప్రసాద్ ప్రయత్నిస్తున్న సమయంలో నేను విశాఖపట్టణంలో ఉండే వాడిని. ఓ కార్డు ముక్క రాసి విశాఖపట్నంలో ఫలానా వాళ్లు ఉంటారు. వారిని కలిసి కొంపెల్ల గురించి సమాచారం సేకరించి పంపు అని అడిగే వారు. ప్రసాద్ మాట అంటే నాకు సుగ్రీవాజ్ఞే. విశాఖ పట్నం వీధులన్నీ తిరిగి మరుగున పడ్డ అనేక మంది రచయితల ఆచూకీ తెలుసుకుని, వారితో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. వడ్డాది సీతారామాంజేయ కవి, కాళూరి నరసింగ రావు, అయల సోమయాజుల నరసింహ శర్మ లాంటి వారి గురించి ఈ ప్రయత్నంలోనే తెలుసుకోగలిగాను. ఇటీవల కొన్నేళ్లుగా యామిజాల ఆనంద్ ఆయనకు తోడయ్యారు. ఆనంద్ ప్రసాద్ కు దాదాపు పదాతి దళ సైనికుడిలా పని చేశారు. ఆయన కవిమాత్రుడు కాదు. నికార్సైన పరిశోధకుడు. ప్రతి చిన్న అంశాన్ని కూడా వదలకుండా నిరంతరం పరిశోధించిగాని వదిలేవారు కాదు. ఆయన చేసిన గొప్ప పని “పొయెట్రీ వర్క్ షాప్" వెలువరించడం. ఇది వినూత్నమైన గ్రంవా థం. కవుల చేతి రాతలను సంపాదించి ఒక వేపు చేతి రాత, మరో వేపు ముద్రణా రూపం కలిపి అందించారు. గతంలో లభించని వాటికోసం, కొత్తగా చేర్చాల్సిన కవుల రచనలను చేర్చడం కోసం ఆయన ఎంత శ్రమ పడ్డారో ప్రత్యక్షంగా చూసిన వాడిని.ఇలాంటి ప్రయత్నం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే లేదని ‘తేలింది. ఈ సంపుటిలో గురజాడ అప్పారావు మొదలుకుని యాకూబ్ దాకా అనేక మంది చేతి రాతలను సేకరించడం ప్రసాద్ లాంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమయ్యే పనేమో. 2022లో దీని రెండో ముద్రణ వచ్చింది. కానీ ఈ క్రమంలో ఆయన తన సృజనాత్మకత శక్తిని తానే చిదిమేసుకున్నారన్నది నా బాధ.ఆయన కేవలం కవో, పాటలు రాసే వాడో కాదు. గొప్ప పండితుడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలిసినా ఫలానా పదం ఎలా వచ్చిందో తెలుసా అని ఆ పదం నేపథ్యాన్ని, పుట్టు పూర్వోత్తరాలను వివరించే Tతీరు ఆయన పాండిత్యానికి అద్దం పట్టేది. అవన్నీ రాయొచ్చుగా అని నేను పోరే వాడిని. కొన్ని సార్లు కటువుగా కూడా చెప్పాను. ఆ తరవాత ఆర్వీ రామా రావ్ వచ్చినప్పుడల్లా నన్ను తిట్టిపోతున్నాడు అని అనే వారు. నా మాట కొంచెం కటువైన మాట నిజమే. కానీ 'అపారమైన జ్ఞాన భాండాగారం ఆయనతోనే అంతరించి పోవడం ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తోంది.అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణం దగ్గర నుంచి ఆయన ధ్యాసంతా దాని మీదే. ఇంట్లో ఏదైనా చిన్న ఖాళీ డబ్బా కనిపిస్తే “కుసుమా (ఆయన జీవిత సహచరి. దాదాపు అయిదేళ్ల కింద పోయారు) ఇది తీసుకెళ్లనా, ఇందులో పిన్నులు పోసుకుంటాం” అనే వారు. “అ.ర.సం. ఆఫీసుకేగా తీసుకెళ్లు” అనే వారామె. ఇద్దరూ, ఉద్యోగాలు చేసే వారు. పెళ్లింట్లో హాలులో ఓ టేబుల్ ఉంటుంది. దానికి రెండు సొరుగులు. ఎవరికి డబ్బు అవసరమైనా అందులోంచి తీసుకెళ్లే వారు. ఇది నా సంపాదన అన్న భావన ఇద్దరికీ ఉండేది కాదు. ఆయన నాకు పితృ సమానుడు. నాకు ఉద్యోగం సద్యోగం లేనప్పుడు ఎన్ని సార్లు చేయూతనిచ్చారో లెక్కే లేదు. ఆ మధ్య అభ్యుదయ రచయితల సంఘానికి, ప్రజా నాట్య మండలికి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. తన సంపాదన అంతా జనం కోసమే అన్నట్టుగా ఉండేది ఆయన ధోరణి. కొందరికైతే విదేశీ యానానికి అవకాశం వస్తే బూట్ల దగ్గరి నుంచి కొనిపెట్టారు. ఆయనకు చాలా రోజులు కొనసాగిన మరో అలవాటు కవిత్వం పుస్తకం ఏది వచ్చినా వెతికి వెతికి దాన్ని కొని దాచే వారు. ఆ గ్రంథ సంచయమంతా కొద్ది నెలల కింద “నవ చేతన” ప్రచురణాలయానికి ఇచ్చేశారు. ఆయన నవచేతన ప్రచురణాలయానికి సంపాదకులు. పని చేసే వారి బాగోగుల్ని ప్రసాద్ చూసుకున్నట్టు చూసుకున్న వారు మరొకరు ఎవరూ నాకు తారస పడలేదు. ఆయన తన సృజానాత్మక శక్తిని పూర్తిగా వినియోగించి ఉంటే సాహిత్య రంగం మరింత సుసంపన్నం అయ్యేది. ఆయన ఇంకా ప్రసిద్ధుడయ్యే వారు. కానీ ఇతరుల అలభ్య రచనలను వెలికి తీసి వెలుగులోకి తీసుకురావడం మీద ఆయనకు ఉన్న శ్రద్ధ తనను తాను మరిచి పోయేట్టు చేసింది. సాహిత్య రంగ కొవ్వొత్తిగానే మిగిలిపోయారు.- (విశాలాంధ్ర సాహితి పేజీ సౌజన్యంతో — సంస్మరణ సభ సందర్బంగా నివాళి)


