

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించినవారందరూ తిరుపతిలోని గోవిందరాజస్వామిని దర్శించుకుని వెళతారు. స్థలపురాణం ఆంతర్యం ఏమిఉన్నా మనకు తెలిసి తెలియకుండానే భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. శ్రీవేంకటేశ్వరస్వామికి శ్రీగోవిందరాజస్వామి అన్నగారని చెపుతుంటారు. పూర్వం శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులు కొండఎక్కలేనివారు గోవిందరాజస్వామిని దర్శించుకుని తిరిగివెళ్లేవారు. ముందుగా గోవిందరాజస్వామిని దర్శించుకుని కొండఎక్కేవారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాక ముందుగా తిరుమలకే వెళ్తున్నారు. గోవిందరాజస్వామి వారు తిరుమల శ్రీవారికి అన్నగా భక్తులు చెప్పుకునే ప్రాచీన కథనం కూడా ఒకటుంది. సంతానం లేని కాశీ రాజు శ్రీనివాసునికి మొరబెట్టుకోడానికి తిరుమల వచ్చారట. స్వామి వారి కోరిక తీరేమార్గం రాణి కలలో కనిపించి చెప్పారట. రాణి ముక్కుకు ఉన్న నీనాసమణి ఇవ్వమని ఆదేశించాడు. దీనితో రాణివారు భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని అని బదులుచెప్పి, భర్త అనుమతిస్తే ఇస్తానని స్వామికి మొరపెట్టుకుందట. వేంటనే శ్రీస్వామివారు నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను - గోవిందరాజస్వామి నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడని చారిత్రక కథనం. అంటే నాటి నుండి గోవిందరాజస్వామిపైన భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే ప్రతియేటా జరిగే బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఉత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది.
తొమ్మిది రోజులు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు వైభవంగా జరిగాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం చక్రస్నానంతో పూర్తయ్యాయి. కపిలతీర్థం ఆళ్వార్ తీర్థం వద్ద జరిగిన ఈ దివ్య ఘట్టాన్ని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అంతకు ముందురోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తిరువీధులు మార్మోగాయి. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. గోవిందరాజస్వామి రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని బోధించే మహత్తర తాత్త్విక సందేశం కూడా. రథోత్సవం అనంతరం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ పండ్లరసాలతో విశేష అభిషేకం చేశారు. రథోత్సవంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 31, ఆదివారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 6 గంటలకు స్వామివారు, అమ్మవార్లు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలలో గజరాజులు ముందు నడుస్తుండగా ప్రతి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఒక్కోవేడుకకు ఒక్కో పరమార్థం ఇమిడి ఉంది. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నాదాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి వాహనసేవ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సముదాయం ఎన్నో చారిత్రక విషయాలను, ఆధ్యాత్మిక రహస్యాలను అందిస్తుంది. ఆలయం సమీపంలోని కోనేరు స్వాతంత్రోద్యమ ఘట్టాలను స్పురణకు తెస్తుంది. రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడిజరిగింది. అక్కడి పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని రామానుజాచార్యులు తయారుచేయించి తిరుపతిలో ప్రతిష్ఠచేసారు. చిదంబరం నుంచి తెచ్చిన ఉత్సవ విగ్రహాలకు ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు. తిరుమలలాగే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులతో ఆరాధనలు, నిత్య కైంకర్యాలు చేయడం శ్రీరామానుజుల కాలంనుంచి వస్తోంది. -----వొద్దిపర్తి రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్.


