

ఆధునిక మానవుడు అనేక ఒత్తిళ్ల మధ్య జీవనం సాగిస్తున్నాడు. సాంకేతికత పెరిగింది. అదేవిధంగా
వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మానసిక స్థిమిత లేకపోవడం, జీవనశైలి వ్యాధులు
జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు.
ఈ సంవత్సరం యోగా దినోత్సవం సందర్బంగా భారత్ తో పాటు వివిధ దేశాలలో కూడా యోగాసనాలు,
యోగా గురించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మానసిక శాంతి కోసం మానవుడు జరిపే
వెదుకులాటలో దొరికిన సమాధానం యోగ అని సంబంధిత ఆసనాల గురించి యోగ గురువులు శిక్షణ
ఇస్తున్నారు. ఫలితంగా శ్వాస మీద ధ్యాస ఉంచి ప్రాణాయామం చేసి యోగ సాధకుల సంఖ్య
పెరుగుతోంది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జంట నగరాలలోని
వివిధ కాలనీలు, బస్తీలలో యోగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు.
కాప్రా సర్కిల్ లోని మాధవపురి కాలనీలో యోగ శిక్షకులు దిలీప్ కౌండిన్య ,కుశాయి గూడ లో
మరో యోగా శిక్షకుడు శంకర్ యోగా శిక్షణతో పాటు యోగా సాధనవల్ల కలిగే లాభాలను గురించి
వివరించారు. మాధవపురి కాలనీలో జరిగిన యోగ దినోత్సవ వేడుకలలో పిల్లలు, పెద్దలు ఎంతో
ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రవి సీతారాం నిర్వహించారు.
కోకాపేట లోని కొత్తచెరువు ప్రాంతంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులు
అనేకమంది యోగ శిబిరంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు.
సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, ఉద్యోగవత్తిడులతో పాటు వేగవంతమైన జీవనశైలికి
అలవాటు పడిన ఆధునిక మానవుడు ప్రతి రోజు కొద్దిసేపు యోగ, ప్రాణాయామం, ధ్యానం చేయాలని
యోగ గురువుల సందేశం. దానివల్ల భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. మనస్సు ప్రశాంతత
పొందుతుందని వారు చెప్తున్నారు. ఇందుకోసం సరైన ఆసనాలను ఎంపిక చేసుకుని
క్రమం తప్పకుండా ఆసనాలు వేయాలని ప్రాణాయామాలు చేయాలనీ వారి సూచన.


