
**జ్యేష్ఠాభిషేకం సందర్భంగా వరుసగా వజ్రకవచ సమర్పణలో, ముత్యాల కవచసమర్పణలో, సువర్ణకవచన సమర్పణలో మలయప్పస్వామి వారు**
నారాయణం పరబ్రహ్మ సర్వ కారణకారణమ్ |ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ||
శ్రీ వేంకటేశ్వరుడిని దివ్య నామమే వజ్రాయుధం లాంటి రక్షా కవచము కాగా శ్రీవారు వజ్రకవచం శోభతో భక్తజనులను రక్షించడానికి కొలువై న వేళ… మనం దర్శించి తరించాలి. వజ్రకవచ స్వామి కి సమర్పించడం వెనుక పూర్వాపరాలు తెలుసుకుందాం!!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (ఉత్సవ మూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి) ధరించే అత్యంత ఖరీదైన, అపురూపమైన వజ్ర కవచం అలంకారం అత్యంత తేజోవంతంగా, దివ్యమైన కాంతులతో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలలో భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీవారి వజ్రకవచ సమర్పణలో, ముత్యాల కవచసమర్పణలో, సువర్ణకవచన సమర్పణలో మలయప్పస్వామి వారిని దర్శించి తరించాల్సిందే. కవచం ధరించిన శ్రీవారు తిరుమల తిరువీధులలో ఊరేగింపు చూసేభాగ్యం లభించాలంటే ఎంతోపుణ్యం చేసుకోవాలి. వైఖానస ఆగమం ప్రకారం జ్యేష్ఠాభిషేకము జూన్ 26 నుంచి 28వ తేదీవరకు నిర్వహిస్తారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా సంప్రదాయ సిద్దంగా పిలుస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారికి వజ్ర కవచం సమర్పిస్తారు.
శ్రీవారి (మలయప్ప స్వామి) వజ్ర కవచం తయారీ మరియు దాని వెనుక ఉన్న చరిత్ర ఆసక్తికరంగా ఉంది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో గల కొల్లేగలకు చెందిన వీరన్న శెట్టి అనే ఒక పరమ విష్ణు భక్తుడు (వ్యాపారి) తయారు చేయించినట్లు ప్రచారంలో ఉంది. శ్రీవారు వీరన్న శెట్టి కలలోకి వచ్చి తనకు వజ్రాల కవచాన్ని చేయించాల్సింది ఆదేశించారు. ఆయన భక్తితో కవచాన్ని చేయించి మొదట మేలుకోటే చెలువనారాయణ స్వామికి, తర్వాత శ్రీరంగం రంగనాథునికి, కాంచీపురం వరదరాజస్వామికి అలంకరించడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడా ఆ కవచం విగ్రహాలకు సరిపోలేదు. చింతాక్రాంతుడైన వీరన్నశెట్టికి అర్చకుల సూచన మేరకు ఆ వజ్ర కవచాన్ని తిరుమలకు తీసుకువచ్చి మలయప్ప స్వామికి సమర్పించగా, అది స్వామివారికి చక్కగా సరిపోయింది. మలయప్పస్వామి కొలతలకు అణుగుణంగా చేయించినట్లు ఉంది. దీనితో వీరన్నశెట్టి ఆనందపరవశులయ్యారు. ఈ అపురూప వజ్ర కవచం నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానం సంరక్షణలో భద్రంగా ఉంటూ, కేవలం జ్యేష్ఠాభిషేకం మరియు వైకుంఠ ఏకాదశి వంటి విశేష దినాలలో మాత్రమే ధరింపజేసిన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
మైసూర్ నాల్గవ కృష్ణరాజ వడయార్ 1930ల కాలంలో ఈ కవచాన్ని సమర్పించినట్లు కూడా కథనం ప్రచారంలో ఉంది. ఈ వజ్ర కవచం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఇది అద్భుతమైన శిల్ప కళాఖండం. వజ్రం ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధంతో సమానం కావడం వల్ల, ఈ కవచాన్ని ధరించడం ద్వారా స్వామివారి శక్తి వంద రెట్లు పెరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. తిరుమలలో ప్రతి సంవత్సరం నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలలో మొదటి రోజు స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే శుక్రవారం నాడు కూడా ఈ అలంకారం చేస్తారు. ఇలా ముఖ్యమైన రోజులలో వజ్రకవచ ధారి అయిన శ్రీవారిని దర్శించేందుకు భక్తులు ఆసక్తి కనపరుస్తారు. వజ్రకవచ పాదాలపై కన్నడలిపిలో కోల్లెగాల వీరన్న శెట్టి సేవ అని లిఖించి ఉన్నట్లు చెబుతారు.
ఈ కవచం అత్యంత విలువైనది కావడంతో, సంవత్సరంలో మిగిలిన రోజుల్లో దీనిని శ్రీవారి ఆలయంలోని అత్యంత సురక్షితమైన ‘బొక్కసం’ (ఖజానా) లోని 6 లాకర్ల భద్రత మధ్య ఉంచుతారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం, ఒకసారి స్వామివారికి సమర్పించిన వజ్ర కవచాన్ని మళ్లీ ఎప్పుడూ తూకం వేయరు లేదా రత్నాలను విడిగా లెక్కించరు. ఆలయ రికార్డులలో ఉన్న వివరాలే తుది లెక్క. శతాబ్దాలుగా ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేయడం వల్ల విగ్రహాలు అరిగిపోకుండా కాపాడేందుకు ఈ కవచాల సంప్రదాయాన్ని ప్రారంభించారు. వజ్రకవచ ధారి అయిన మలయప్ప స్వామికి హారతులు సమర్పించే సమయంలో కనిపించిన దృశ్యాన్ని తిలకించినవారు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. మలయప్పస్వామి స్వయంభూ మూర్తి. మానవ నిర్మితాలు కావు, స్వయంభూగా వెలిశాయి. క్రీ.శ. 1339 లో ఇవి కనుగొనబడ్డాయి. మలయప్ప స్వామి తన ఇద్దరు దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతుడై మొదటగా ‘మలయప్ప కోన’ అనే పర్వత ప్రాంతంలో లభించాయని చెబుతారు. ఈ స్వామి వారిని మొదట ‘మలై కునియ నిన్ర పెరుమాళ’ (వంగి ఉన్న పర్వతం మీద కొలువైన వేంకటేశ్వరుడు) అని పిలిచేవారు. కాలక్రమేణా అదే పేరు మలయప్ప స్వామిగా రూపాంతరం చెందింది. అంతకుముందు ఉగ్ర శ్రీనివాసుడిని ఉత్సవ మూర్తిగా ఉపయోగించేవారు. స్వామివారి ఆదేశాల మేరకు తరువాత మలయప్ప స్వామిని ఉత్సవాలకు వినియోగించడం ప్రారంభించారు.
మలయప్ప స్వామికి ప్రధాన గర్భాలయంలోని మూలవిరాట్టుకు (ధ్రువ బేరం) ఎలాంటి భేదం లేదని, భక్తులను కరుణించడానికి వచ్చిన ప్రత్యక్ష రూపంగా శ్రీవారుగా భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చడానికి తిరుమలలో కొలువైన శ్రీవారు భక్తులను కరుణించే గాధలు ఎన్నో ఎన్నెన్నో.
—వొద్దిపర్తి రామచంద్ర మూర్తి , సీనియర్ జర్నలిస్టు


