అభయప్రదాత ఆంజనేయస్వామి

  నుమంతుని స్మరించినప్పుడు అనేక సద్గుణాలు మనలో అలవడతాయి. సమకాలీన ప్రపంచం చాలా వరకు రాగద్వేషాలతో నిండిపోయింది. అసూయ, సాటి వారిని ద్వేషించే మనస్తత్వం, తామే ప్రతిభావంతులమనే అహంకారం, పరస్త్రీ వ్యామోహం వంటి దుర్గుణాలు అనేక మందిలో కనిపిస్తున్నాయి. తమను తాము గొప్పవారిగా భావిస్తూ ఇతరులను చులకనగా చూడడం నేటి సమాజంలో సాధారణమైపోయింది.
నిజానికి ఎంత ప్రతిభ ఉన్నా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, నిత్యం నేర్చుకోవాలనే తపన, స్వామి భక్తి, నిరంతర సేవాభావం, అంకితభావం, ఇతరులను గౌరవించే సంస్కారం వంటి గుణాలను ప్రతి ఒక్కరూ హనుమంతుని నుంచి నేర్చుకోవాలి.

కుషాయిగూడలో 36 అడుగుల హనుమంతుని విగ్రహం

హనుమంతుడు వరప్రసాదాలను పొందినప్పటికీ వాటిని మితిమీరి వినియోగించకూడదనే ఉద్దేశంతో దేవతలు ఆయనకు కొన్ని పరిమితులు విధించారు.ఎవరైనా హనుమంతుని శక్తిని గుర్తు చేసినప్పుడే ఆయన తన అపార శక్తిని ప్రదర్శించేవారు. పెద్దలను, స్త్రీలను గౌరవించే సంస్కారం ఆయనలో పరిపూర్ణంగా ఉండేది. తన ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడిని హృదయంలో ప్రతిష్ఠించుకున్న మహోన్నత భక్తుడు హనుమంతుడు. బాల్యంలో సూర్యభగవానుని వద్ద విద్యలను, వ్యాకరణాన్ని అభ్యసించారు. ధర్మమార్గంలో నడిచారు. వాలి, సుగ్రీవులు సోదరులైనప్పటికీ ధర్మం పక్షాన నిలిచి సుగ్రీవుని ఆశ్రయించారు. హనుమంతుని సామర్థ్యాన్ని గుర్తించిన శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆయనకు అప్పగించారు.
సాగరాన్ని దాటడం అసాధ్యమని అందరూ భావిస్తున్న సమయంలో జాంబవంతుడు హనుమంతునికి తన శక్తిని గుర్తు చేయగా, ఆయన ఒక్క దూకుడుతో సముద్రాన్ని అవలీలగా దాటారు. హనుమంతుని వివేకం ఎంతో గొప్పది. దూతకు ఇవ్వవలసిన మర్యాదలను రావణునికి వివరించారు. సీతాదేవిని దర్శించి ఆమె ఆత్మత్యాగ సంకల్పాన్ని నివారించారు.
హనుమంతునిలో అసూయ అనే అవలక్షణం ఎక్కడా కనిపించదు. అసూయ ఒక మానసిక వ్యాధి. అది మనిషి ప్రవర్తనను దెబ్బతీస్తుంది. హనుమంతుడు మాత్రం పరుల విజయాన్ని హర్షించే మహోన్నత వ్యక్తిత్వానికి ప్రతీక. తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడు వేదనలో ఉన్న సమయంలో సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు. భీముడి గర్వాన్ని అణచివేశారు. మహాభారత యుద్ధంలో అర్జునుని రథధ్వజంపై విజయపతాకంగా నిలిచి పాండవులకు విజయాన్ని చేకూర్చారు.
హనుమంతుడు నిత్యం రామనామ సంకీర్తనలో పరవశించేవారు. ఒకసారి ఆయనకు బహుమతిగా ఇచ్చిన విలువైన రత్నహారాన్ని విరిచి, అందులో శ్రీరాముడు లేరని చెప్పి భౌతిక సంపద కంటే భక్తికే అధిక ప్రాధాన్యం ఉందని చాటిచెప్పారు. హనుమంతుడిని భావి బ్రహ్మగా అనేక పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆయన దేహబలం, బుద్ధిబలం, వివేకం, భక్తి, వినయం, సేవాభావం వంటి గుణాలకు ప్రతీకగా నిలిచారు. నిత్యం రామనామ స్మరణ చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.

       హనుమజయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక హనుమంతుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం పురాతనమైనది. శనివారం, మంగళవారం రోజుల్లో వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అలాగే తిరుమల సమీపంలోని జాపాలి తీర్థం (జాబాలి తీర్ధం), జంగారెడ్డిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందినవి.  ఇటీవల హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ మార్కెట్ వద్ద  36  అడుగుల ఎత్తయిన హనుమ విగహాన్ని ప్రతిష్టించారు. అహంకారం, నయవంచన, ఇతరులకు అపకారం చేయాలనే కుతంత్రాలతో జీవించే వారు ఎంతగా దేవుని ఆరాధించినా ఆ ఆరాధనను భగవంతుడు స్వీకరించడు. నిర్మల హృదయం, నిష్కల్మష భక్తి భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవి.
--డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
అధ్యాపకులు, పరిశోధకులు -- 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *