కర్మ ఫలం


***
పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటిలాగానే చెట్టు వద్దకు వెళ్లి, శవాన్ని దింపి, వీపు మీద వేసుకుని శ్మశానం వైపు మౌనంగా నడక సాగించాడు. అప్పుడా శవంలోని బేతాళుడు బయటికి వచ్చి వికవికమంటూ నవ్వాడు.
” ఓ రాజా.. కర్మ అనేది ఒకటుంది చూశావూ.. అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కర్మ ఫలం ఊరికే పోదు. నీ సంగతే చూడు. నువ్వు ఒక మహా రాజ్యానికి చక్రవర్తివి. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ శ్మశానాల్లో శవాల్ని భుజాన వేసుకుని తిరుగుతున్నావంటే అది నీ కర్మ కాక మరేమిటి? నేను కూడా అంతే కదా! బేతాళుడి రూపంలో శ్మశానాల్లో తిరుగుతూ, శవాల్లో దూరి, నీ బోటివాడికి కాకమ్మ కథలు చెబుతున్నానంటే ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో! కర్మ ఫలం నన్ను మరణానంతరం తరుముతుంటే కొందరికి నీకు మాదిరిగా అదే జన్మలో కాటేస్తుంది. ఇలా అదే జన్మలో కర్మకి చిక్కిన ఒక రాజు కథ నీకిప్పుడు చెబుతాను, విను” అని బేతాళుడు కథ ప్రారంభించాడు.
విక్రమార్కుడు వింటూ మౌనంగా తన నడక కొనసాగించాడు.
****
దక్షిణాపథంలో విద్యానగర సంస్థానంలో సదాశివ వర్మ అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచి మనిషి. మెతక మనిషి. ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలకు కూడా వర్మ గారంటే అపారమైన గౌరవం, భక్తి కూడా.
ఆ సంస్థానంలోనే సత్య నాయుడు అనే ఓ కుర్రవాడు ఉండేవాడు. అతడికి చురుకుదనం హెచ్చు. చాలా చొరవగా జనంలోకి వెళ్లిపోతుండేవాడు. సదాశివ వర్మకి సత్యనాయుడి ప్రతిభాపాటవాలు బాగా ఆకర్షించాయి. వెంటనే అతడిని చేరదీశాడు. తన కులం కాకపోయినా తన సొంత కొడుకులకన్నా మిన్నగా ఆదరించాడు. ప్రజలకు సేవ చేస్తాడు కదా అని పదవులిచ్చి ప్రోత్సహించాడు. పూర్తిగా సత్యనాయుడు మీదే పాలన భారాన్ని విడిచిపెట్టాడు.
కొంతమంది కష్టపడి పైకొస్తారు. వీరు మొదటి రకం. మరి కొంతమంది అతి సులువుగా పైకొస్తారు. వీరు రెండో రకం. ఇంకొంతమంది జనాన్ని తొక్కుకుంటూ పైకొస్తారు. వీరు మూడో రకం. పైకి వచ్చాక తానెక్కివచ్చిన నిచ్చెనని ఎడమ కాలితో తన్నివేసే వారు కూడా ఉంటారు. వీరు నాలుగో రకం.
వీటిలో రెండు, మూడు, నాలుగో రకాలను మేళవించి అవుపోసన పట్టిన సత్యనాయుడు ఇంకో ప్రత్యేక రకం.
సదాశివ వర్మ ఇచ్చిన అలుసుతో సత్యనాయుడికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. విద్యానగర సంస్థానం మీద తన పట్టు పెంచుకున్నాడు. తనను పెంచి పెద్ద చేసిన సదాశివ వర్మ మాట ఖాతరు చెయ్యడం మానేశాడు. వర్మని సంప్రతించకుండానే కీలక అంశాల్లో సొంతంగా నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టాడు. వర్మ ఉనికిని సైతం విస్మరించాడు. తన సంస్థానంలో ‘ఇంతై, ఇంతింతై’ అన్నట్టుగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సత్యనాయుడిని చూసి సదాశివ వర్మ బెంబేలెత్తిపోయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరికి ఆ మనోవ్యాధితోనే తనువు చాలించాడు.
***
ఆ తర్వాత సత్యనాయుడు తనకు ఎదురేదీ లేదన్న ధీమాతో చెలరేగిపోయాడు. తన బంధువులని ఎక్కడెక్కడినుంచో వెతికి తెచ్చి కీలక పదవులు కట్టబెట్టాడు. తన అర్ధాంగికి కీలకమైన పదవిని కానుకగా ఇచ్చాడు. కూతురికీ, కొడుకుకీ, తమ్ముడికీ, తమ్ముడి కొడుకుకీ, మేనల్లుడికీ, మేనల్లుడి వియ్యంకుడికీ…ఇలా బంధు బంధు బంధు బంధువులందరికీ ఏదో ఒక పదవిని ఇచ్చి సంతోష పెట్టాడు.
***
మహారాజా! ఇప్పుడు ఈ కథలో నీకు మరో ముఖ్యమైన పాత్రని పరిచయం చెయ్యబోతున్నాను. అతడి పేరు గోవిందు నాయుడు. సత్యనాయుడికి స్వయానా మేనల్లుడు. అతడిని అందరూ చిన్నబాబు అంటారు.
సత్యనాయుడి ప్రాపకంలో చేరిన చిన్నబాబు అచిరకాలంలోనే సత్యనాయుడికి పరమ ఆప్తుడయిపోయాడు. సత్యనాయుడికి కుడి భుజంగా మాత్రమే కాదు, గుండెకాయగా మారిపోయాడు. సత్యనాయుడికి వీర విధేయంగా ఉంటూ సంస్థానంలో అతనికి ఉన్న ఆస్తులు, ఖజానాల మీద పూర్తి అజమాయిషీని చేజిక్కించుకున్నాడు. సత్యనాయుడిని కలవడానికి ఎవరు వెళ్లినా “చిన్నబాబుని కలిశారా, చిన్నబాబుతో మాట్లాడండి, చిన్నబాబుని చెప్పండి” అనే స్థాయికి సత్యనాయుడు, చిన్నబాబు ఇద్దరూ వచ్చేశారు.
ఇలా ఉండగా, సత్యనాయుడి సంస్థానంలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న చిన్నబాబుకి తన పదవిని తన కుమార్తె, తన గారాలపట్టికి కట్టబెట్టాలనే ఆలోచన వచ్చింది. అదే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చిన్నబాబు ఒకటి తలిస్తే సత్యనాయుడు వేరొకటి తలచాడు. చిన్నబాబు తర్వాత ఆ పదవిని తన కుమార్తెకు ఇవ్వాలని అప్పటికే సత్యనాయుడు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు.
ఒక రోజు చిన్నబాబు వచ్చి తన కోరికని బయట పెట్టగానే సత్యనాయుడు తేలిగ్గా తీసిపారేశాడు. “మీ అమ్మాయి సంగతి తర్వాత చూద్దాంలే, నీ పదవిని మా అమ్మాయికి ఇద్దామని అనుకుంటున్నాం” అని తేల్చి చెప్పాడు. దాంతో చిన్నబాబు మొహం మాడ్చుకుని వెళ్లిపోయాడు. ఇక అప్పట్నించీ సత్యనాయుడు, చిన్నబాబు అనే గోవిందు నాయుడుల మధ్య ఎడం పెరుగుతూ వచ్చింది.
బయటికి ఏమీ ఎరగనట్టు ఉంటూనే చిన్నబాబు నిశ్శబ్దంగా పావులు కదిపాడు. చాప కింద నీరులా తన వ్యూహాన్ని అమలు చేశాడు. మూడో కంటికి తెలియకుండా గప్ చుప్ గా తన కుమార్తెతో సహా శత్రు రాజయిన చంద్ర స్వామి దగ్గరికి వెళ్లి ఆయన శిబిరంలో దూరిపోయాడు. సత్యనాయుడుతో తెగతెంపులు చేసుకున్నాడు.
హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం సత్యనాయుడిని దిగ్భ్రమకి గురిచేసింది. విషయం తెలిసి సత్యనాయుడి ఆప్తులూ, అనుచరులూ ఆయన దగ్గరికి కట్టకట్టుకుని వచ్చారు. ప్రతి ఒక్కరూ సత్యనాయుడికి మద్దతు ప్రకటిస్తూ, చిన్నబాబు చేసిన ద్రోహాన్ని చీల్చి చెండాడుతూ ప్రసంగాలు చేశారు. అవి విన్న సత్యనాయుడికి దుఃఖం తన్నుకొచ్చింది. కుమిలి కుమిలి రోదించాడు. చెట్టంత మహారాజు చిన్న పిల్లాడిలా వలవలా ఏడుస్తూ కన్నీళ్లు పెడుతుంటే అక్కడ ఉన్నవారి గుండెలు తరుక్కుపోయాయి. సత్యనాయుడిని ఓదార్చడానికి ప్రయత్నించారు.
***
బేతాళుడు కథ చెప్పడం ఆపి , ” రాజా..ఇప్పుడు నేను రెండు ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు జవాబు చెప్పాలి. జవాబు తెలిసీ చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా?” అన్నాడు.
విక్రమార్కుడు తల ఊపాడు.
” నా మొదటి ప్రశ్న. సత్యనాయుడు ఎందుకంత పొగిలి పొగిలి ఏడ్చాడు?” అడిగాడు బేతాళుడు.
విక్రమార్కుడు రెండు క్షణాలు ఆలోచించి చెప్పాడు. ” ఏముంది? గతంలో తనను పెంచి పెద్ద చేసిన గురువు సదాశివ వర్మకు తాను ఎలాంటి ద్రోహం తలపెట్టాడో ఇప్పుడు అలాంటి ద్రోహమే తనకు జరిగిందని, ఎవరు చేసిన కర్మ వారు ఎప్పటికైనా అనుభవించక తప్పదని సత్యనాయుడిలో పశ్చాత్తాపం రగిలి ఉంటుంది. అదే ఏడుపు రూపంలో తన్నుకొచ్చింది”
బేతాళుడు వికటాట్టహాసం చేసి ” సత్యనాయుడికి అంత దృశ్యం లేదు గానీ సరిగ్గా ఆలోచించి చెప్పు” అన్నాడు.
విక్రమార్కుడు చిటికె వేసి చెప్పాడు. “తెలిసింది. సత్యనాయుడి ఆర్ధిక లావాదేవీలు, ఖజానాలు, ఆస్తుల గుట్టుమట్లు, రహస్యాలు అన్నీ చిన్నబాబు గుప్పిట్లో ఉన్నాయి. సత్యనాయుడు మాంత్రికుడయితే అతడి ప్రాణం దాగున్న చిలకేమో చిన్నబాబు. ఇప్పుడా చిలక ఎగిరి వెళ్లి శత్రువుల గూటిలో వాలింది. తన ఖజానాలన్నీ మళ్లీ తనకి దక్కుతాయా లేదా అని సత్యనాయుడికి గాభరా పుట్టి ఏడుపు రూపంలో కట్టలు తెగి ఉంటుంది. నిజమేనా?”
” నిజానిజాలు చెప్పడం నా బాధ్యత కాదు. నీకు మౌన భంగం కలిగించడం వరకే నా పని.. అది సరే గాని నా రెండో ప్రశ్న విను. ఈ కథలో కర్మ కోరల్లో చిక్కుకున్న మరో పాత్ర ఉంది. అదెవరు?”
విక్రమార్కుడు తడుముకోకుండా చెప్పాడు. ” ఇంకెవరు? చిన్నబాబు అనే గోవిందు నాయుడు”.
” అదెలాగో వివరంగా చెప్పు రాజా!”
విక్రమార్కుడు చిన్నగా నవ్వి చెప్పాడు. ” సత్యనాయుడి ప్రాపకంలో ఉన్నప్పుడు చిన్నబాబు మకుటం లేని మహారాజులాగా ఒక వెలుగు వెలిగాడు. అతడిని కలుసుకోడానికి చిన్నా పెద్దా నాయకులు బారులు తీరేవారు. శత్రురాజు పక్షాన చేరిన తర్వాత చిన్నబాబు పరిస్థితి తారుమారయింది. అక్కడ చిన్నా పెద్దా నాయకులని కలుసుకోడానికి తానే స్వయంగా ఎక్కే గడప, దిగే గడప తిరుగుతున్నాడు. ప్రతి ఒక్కడికీ వంగి వంగి దండాలు పెడుతున్నాడు. కర్మ ఇప్పుడు చిన్నబాబు వెంటపడిందనుకోవడంలో తప్పు లేదు”.
విక్రమార్కుడికి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో ఎగిరివెళ్లి తిరిగి చెట్టెక్కాడు.


       --- మంగు రాజగోపాల్

(లీడర్ దినపత్రిక 17-09-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *