సరదాకి….. ఆకాశం నీ హద్దురా..

“గాల్లో తేలినట్టుందే.. ప్లేనూ ఎక్కినట్టుందే.. వోవర్ నైటూ అంబానీలా మారినట్టుందే..”
హుషారుగా పాడుకుంటూ వస్తున్న సిమ్మాద్రిని పలకరించాడు సూరప్పడు. “ఏటి మాయ్యా, అంత హేపీసుగున్నవూ? ఏదన్నా లాట్రీ తగిలిందేటి?”
” నాకో సూపరు అయిడియా వచ్చింది. అది వింటే నువ్వు హేపీసు అయిపోతావురా సూరప్పడూ”
“ఏటేటి..బేగి సెప్పు”
“సెప్తా గాని నువ్వు సీ ప్లేను గురించి ఎప్పుడన్నా విన్నావా?”
“విన్లేదే..ఏటి మాయ్యా అది?” అమాయకంగా అడిగేడు సూరప్పడు.
సిమ్మాద్రి అతడికేసి జాలిగా చూసి “సీ ప్లేను అంటే విమానంలాగా గాలిలోనా ఎగురుతాది, షిప్పులాగా సముద్రం మీద కూడా నడుస్తాది..అదన్న మాట సీ ప్లేను అంటే!”అన్నాడు.
“బలేగున్నాదే..సరే..దానికీ, నీ హేపీసుకీ సమ్మందం ఏటీ ?”
“అది సెప్పాలంటే నీకు మొత్తం స్టోరీ ఇవరంగా సెప్పాలి. కూకో.. సెపుతా, ఆలకించు” అంటూ సిమ్మాద్రి కుర్చీలో కూలబడి చేతి సంచీ నుంచి పేపరు తీశాడు. సూరప్పడు కూడా ఇంకో కుర్చీలో సెటిలయ్యాడు. సిమ్మాద్రి పేపరు చూపిస్తూ మొదలుపెట్టాడు.
” ఈ నూసు సూసేవా? మన రాష్ట్రంలో సీ ప్లేన్ల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. టూరిజంని అభివృద్ధి చెయ్యడానికి పెట్టిన ఈ పథకంలో ప్రభుత్వం, ప్రయివేటు వ్యక్తులు కలిసి ఈ సీ ప్లేనులు నడుపుతారు. దీనిని అడ్వెంచర్ టూరిజం అంటారు”
సూరప్పడులో ఆసక్తి పెరిగింది.”బావుంది..సెప్పు, సెప్పు” అన్నాడు.
సిమ్మాద్రి మళ్లీ ప్రారంభించాడు. ” ఈ సీ ప్లేనులకి అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లో మన వొయిజాగు కూడా ఉందిరా సూరప్పడూ! నిజానికి ఈ సీ ప్లేనులు సరిగ్గా నడుస్తున్నాయా లేదా అని సూడడానికి రెండేళ్ల కిందటే విజయవాడ నుంచి శ్రీశైలం దాకా క్రిష్ణా నదిలో ఓ ట్రయిలు ట్రిప్పు నడిపేరు. మన సిఎం చంద్రబాబు గారు కూడా ఆ సీ ప్లేనులో వెళ్లి వచ్చారు.”
” ఒరే, సిమ్మాద్రీ, ఇలా అంటున్నానని అనుకోకు గాని ఊళ్లో పెళ్లయితే కుక్కల హడావిడి సామెతలాగా ఆ సీ ప్లేను ప్రాజెట్టుకీ నీకూ సమ్మందం ఏంట్రా?” అడిగాడు సూరప్పడు.
“అదేనో సెబుతున్నా, నాకో గొప్ప అయిడియా వచ్చిందన్నాను కదా..అదేటంటే, మనం కూడా ఒక సీ ప్లేను నడపబోతున్నాం” ముసిముసి నవ్వులతో అన్నాడు సిమ్మాద్రి.
ఉలిక్కిపడ్డాడు సూరప్పడు. ” ఒరే, మతుండే మాట్టాడుతున్నావా? ప్లేను అంటే కోట్ల రూపాయల ఖర్చు కాదేటి? సరే, డబ్బు సంగతి అటుంచు. మన కాడ ఏటుందని గవర్నమెంటు మనల్ని ఒప్పుకుంటాది? అసలు సీ ప్లేను గురించి మనకేటి తెలుసూ అని?” ప్రశ్నల వర్షం కురిపించాడు.
“నువ్వలా అడుగుతావనే నేను అన్నీ రెడీ చేసుకుని వచ్చాను. మన ప్లానేంటో, అది ఎలా చేస్తామో అన్నీ వివరంగా రాసుకొచ్చాను” అంటూ సంచీలోంచి ఓ ఫైలుని లాగేడు సిమ్మాద్రి.
“నాకవేటీ అర్ధం అయి చావదు గానీ మామూలుగా నోటితో చెప్పు” అన్నాడు సూరప్పడు.
“చెప్తా గాని నేను చెప్పేదంతా నువ్వు సినిమా సీన్ల మాదిరిగా ఊహించుకో. తేలిగ్గా అర్ధమైపోతాది” సూరప్పడి బుజం తట్టి చెప్పేడు సింహాద్రి.
********
దృశ్యం – 1
********
ఢిల్లీలో విమానాల మంత్రి, మన ఉత్తరాంధ్ర బిడ్డ రామ్మోహన్ నాయుడి కార్యాలయం.
తలుపు తోసుకుని లోపలికి వచ్చిన సిమ్మాద్రి, సూరప్పడుని సాదరంగా ఆహ్వానించారు మంత్రి రామ్మోహన్ నాయుడు.
“రండి, రండి..మీరు మన విశాఖవాళ్లేనట కదా..చెప్పండి, ఏం పని మీద వచ్చారు?”
” సార్, త్వరలో సీ ప్లేన్లు నడుపుతారట కదా.. మేం కూడా ఒక ప్లేను నడపాలని వచ్చాం” చేతులు కట్టుకుని వినయంగా చెప్పేడు సింహాద్రి.
” వెరీ గుడ్.. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి పది రూట్లని అయిడెంటిఫై చేశాం. వాటికి పర్మిషన్లు ఇచ్చాం. మీరు ఏ రూటుకి అప్లయ్ చేస్తున్నారు? విశాఖా? అరుకా? లంబసింగా?” అడిగారు రామ్మోహన్ నాయుడు.
” అవేమీ కావు సార్.. తమరోసారి ఈ ఫైలు చూడండి.అన్నీ వివరంగా రాశాం” భక్తిగా ఫైలు తీసి ఇచ్చాడు సింహాద్రి.
“అవేమీ కావా? మరేంటబ్బా?” అంటూనే ఫైలు తీసి చూశారు రామ్మోహన్ నాయుడు. చదువుతుంటే ఆయన కళ్లు పెద్దవి అయ్యాయి. మొహంలో ఆశ్చర్యం, ఆనందం, చిరునవ్వు ఏక కాలంలో తొంగి చూశాయి. ఫైలు మూసేసి, సింహాద్రి, సూరప్పడుల బుజాలు పట్టుకుని ఊపేస్తూ “సూపర్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్” అంటూ చిన్నగా అరిచారు రామ్మోహన్ నాయుడు.
సిమ్మాద్రి, సూరప్పడు “థాంక్యూ సార్, థాంక్యూ సార్” అంటూ జపించడం మొదలుపెట్టారు.
రామ్మోహన్ నాయుడు ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పారు. “అసలు మీకు ఇలాంటి అయిడియా వచ్చినందుకు ముందుగా మీకు నా జోహార్లు. ఇప్పుడే ప్రధానమంత్రి గారితో మాట్లాడతాను. మీ స్కీమ్ కి స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను. అంతే కాదు. ఇదొక యునీక్, స్పెషల్ ప్రాజెక్టుగా పరిగణించి మీకు ఒక సీ ప్లేనుని కూడా ఉచితంగా శాంక్షన్ చేయిస్తాను. మీరొకసారి సిఎం చంద్రబాబు గారిని కూడా కలవండి. నేను కూడా ఆయనకి ఫోన్ చేసి చెబుతాను. ఆల్ ద బెస్ట్ మై వైజాగ్ బ్రదర్స్!”
సిమ్మాద్రి, సూరప్పడుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు.
*******
“బాంది బాంది మాయ్యా, తర్వాత సీనేంటో చెప్తే ఊహించేసుకుంటాను” సంబరంగా అన్నాడు సూరప్పడు.
“చెప్తా, ఆలకించు” అన్నాడు సిమ్మాద్రి.
********
దృశ్యం -2
*******
అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం.
సిమ్మాద్రి, సూరప్పడు వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నించున్నారు. చంద్రబాబు వారి ఫైలుని పూర్తిగా చదివి ప్రశంసాపూర్వకంగా వాళ్లని చూశారు.
“తమ్ముళ్లూ, మన రామ్మోహన్ నాయుడు గారు మీ గురించి చెప్పాడు. మీ ఆలోచన చాలా వినూత్నంగా, అద్భుతంగా ఉంది. మీలా ఇన్నోవేటివ్ గా ఆలోచించేవాళ్లే రాష్ట్రానికి కావాలిప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఓర్వకల్లులో పెడుతున్న పైలెట్ల శిక్షణ అకాడమీలో మీ ఇద్దరికీ ఉచితంగా పైలట్ల శిక్షణ ఇప్పిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.”
సాక్షాత్తూ ముఖ్యమంత్రి అలా హామీ ఇచ్చేసరికి గాల్లో తేలిపోతూ బయటికి నడిచారు సిమ్మాద్రి, సూరప్పడు.
******
“అంతా బానే ఉంది గానొరే సిమ్మాద్రీ.. అందరూ అంత మెచ్చేసుకుంటన్నారు, ఇంతకీ ఆ ఫైల్లో ఏటి రాసుంది? మన సీ ప్లేను రూటేంటసలు? నాక్కూడా నువ్వు సరిగ్గా చెప్పలేదు” నిష్టూరంగా అన్నాడు సూరప్పడు.
“వినవో, అదే మన క్లయిమాక్స్ సీను. మన సీ ప్లేనుకి మనమే యజమానులం, మనమే పైలట్లం. మా యావిడి సీతారత్నంని ఎయిర్ హోస్టెస్ గా పెట్టేసుకుందాం. మళ్లీ వేరే స్టాఫూ, జీతాలూ, ఖర్చులూ ఎందుకని ఈ ఏర్పాటు చేసేను. మన ముగ్గురి పేర్లు కలిసొచ్చేలా మన సీ ప్లేనుకి ‘ఎస్ ఎస్ ఎస్ ఎయిర్ సర్వీసెస్’ అని పేరెట్టుకుందాం. ఇక మన సీ ప్లేనుని ఏ రూట్లో తిప్పుతామంటే..” చెబుతున్నాడు సిమ్మాద్రి. ఊహించుకుంటున్నాడు సూరప్పడు.
******
దృశ్యం – 3
********
“సూరప్పడూ, మళ్లీ ఎవరి దగ్గరా సెప్పకొరే.. మన సీ ప్లేనుని గంగవరం బీచ్ కాణ్ణించి భోగాపురం బీచ్ దాకా నడుపుతాం. భోగాపురం ఎయిర్ పోర్టుకి వెళ్లడానికి బోలెడు టైము పట్టేస్తున్నాదని జనం గోల పెడుతున్నారు కదా..ఆళ్ల కోసం ఈ రూటుని నేనే కనిపెట్టా.. మొదట గంగవరం బీచ్ లో గాజువాక, అనకాపల్లి వైపు నుంచి వచ్చే పాసింజర్లని ఎక్కించుకుంటాం. ఆనక రంయ్యిమని ఆర్కే బీచ్ కి వచ్చేస్తాం. అక్కడ వొయిజాగు పాసింజర్లని ఎక్కించుకుంటాం. మళ్లీ ఝుమ్మని భోగాపురం ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉన్న బీచ్ కి వెళ్లిపోతాం. అక్కడ చంద్రబాబు గారు ఏర్పాటు చేయించే పికప్ బస్సుల్లోకి మన పాసింజర్లు ఎక్కేసి ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. ఇప్పుడు వొయిజాగు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకి వెళ్లడానికి కనీసం గంటన్నర పడుతోంది కదా..అదే మన సీ ప్లేనులో అయితే ఎంతసేపు పడుతుందో సెప్తే ఆచ్చెర్యపోతావు.. జస్ట్, పావుగంటా ఇరవై నిమిషాల్లో వెళ్లిపోతాం అంతే..అలా రోజుకి ఓ పదిహేను ట్రిప్పులు ఎయిర్ పోర్టుకి వేస్తాం. ఖాళీ టైముల్లో టూరిస్టుల్ని షికారు తిప్పుతాం. ఎలా ఉంది మన సీ ప్లేను.. కొత్త ప్లాను?”
“సూపర్ మాయ్యా.. మన త్రిబుల్ ఎస్ ఎయిర్ సర్వీసెస్ కీ జై” అన్నాడు సూరప్పడు.
“ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా..” అని పాడుకుంటూ బయటికి నడిచారు సిమ్మాద్రి, సూరప్పడు.

— మంగు రాజగోపాల్
(లీడర్ దినపత్రిక 1-10-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *