
వారాలు కాలగమనానికి ప్రతిబింబాలు. 52 వారాలు గడిచి సంవత్సరం వస్తుంది సోమవారం నుంచి ఆదివారం వరకు మన ఇతిహాసాలను అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి కేటాయించారు. సోమవారం శివయ్యకి మంగళవారం ఆంజనేయుడికి బుధవారం వినాయకుడికి గురువారం సాయిబాబా కి శుక్రవారం లక్ష్మీ కనకదుర్గలకి, శనివారం తిరుపతి వెంకన్నకు, ఆదివారం సూర్యుడికి భక్తుజనం నీరాజనాలు అర్పిస్తారు. సోమవారం అనగానే శివయ్య స్మరణకు వస్తారు. ఇతర మాసాలలో వచ్చే సోమవారం కన్నా కార్తీకంలో వచ్చే సోమవారం భక్తులకు పవిత్రమైంది. కార్తీక మాసం సాధారణంగా నవంబర్ నెలలో వస్తుంది . సోమవారాలు నాలుగైదు వస్తాయి. కార్తీక సోమవారాలలో శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసదీక్షలు చేస్తారు. సాయంత్రం ఆకాశములో నక్షత్రాలు మెరిసిన తరువాత ఆహారాన్ని తీసుకుంటారు . చాలామంది ఈ నెల అంతా సాత్విక ఆహరం భుజిస్తారు. కార్తీకమాసంలో వ్యక్తులు వారికి ఆర్షిక స్థోమతను అనుసరించి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు , పంచారామ క్షేత్రాలలో పర్యటిస్తారు. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం ఈ క్షేత్రాలను సందర్శించాలని పరితపిస్తారు. కార్తీక్ సోమవారం నాడు శివయ్యకు లక్ష పత్రి పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో దేవాలయాల వద్ద అన్నసమారాధన ప్రసాదంగా పంపిణీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట, ఇంకా పంచారామ క్షేత్రాలకు విరివిగా తరలివస్తారు. భక్త జనానికి సోమవారం పంచారామ క్షేత్ర సందర్శనకు వీలు కల్పించేలా రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలు పంచారామ క్షేత్ర దర్శిని ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. కార్తిక సోమవారం ఉపవాస దీక్ష మంచిడే గాని, ఉపవాసాలు చేసే వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి.
–డాక్టర్ దువ్వూరి శర్మ, పరిశోధకులు, 99490 39175.





