
——————–బద్రీనాథ్—————————-
కేదారనాథ్ , బద్రీనాధ్ ఆలయాల మూసివేత
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్ ఆలయ ద్వారాలు శీతాకాలం సందర్భంగా సోమవారం 16వ తేదీ నుంచి మూసివేశారు. బద్రీనాథ్ ఆలయ మూసివేతతో ఈ ఏడాది వార్షిక చార్ధామ్ యాత్ర అధికారికంగా ముగిసినట్లయింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు, ఆరు నెలల శీతాకాల విరామం కోసం సోమవారం నుంచి మూతపడుతున్నాయి. ఈసీజన్లో దాదాపు 23.5 లక్షల మంది భక్తులు బద్రీనాథ్‌ను, 20 లక్షల మంది కేదార్నాథ్ క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. మొత్తం చార్ధామ్ క్షేత్రాలను సుమారు 65 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మూసివేత సంప్రదాయం ప్రకారం ద్వారాల మూసివేతకు ముందు ఐదు రోజుల పాటు ‘పంచ పూజలు’ నిర్వహించారు. మూసివేత సమయంలో మానా గ్రామానికి చెందిన మహిళలు ప్రత్యేకంగా అల్లిన ఉన్ని దుప్పటిని (ఘీ కంబల్) బద్రీ విశాల్ విగ్రహానికి కప్పడం ఆనవాయితీ.
ఆలయం మూసివేసిన తర్వాత ఉద్ధవ్ మరియు కుబేర ఉత్సవ విగ్రహాలను పాండుకేశ్వర్‌కు, జ్యోతిర్మఠ్‌లోని నరసింహ ఆలయానికి తరలించారు. వచ్చే ఆరు నెలల పాటు భక్తులు అక్కడే స్వామివారిని దర్శించుకోవచ్చు.శీతాకాలం ముగిసిన తర్వాత, వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటాయి. దీని ఖచ్చితమైన తేదీని వచ్చే ఏడాది వసంత పంచమి రోజున ప్రకటిస్తారు.
ఇది ఇలా ఉండగా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు నవంబర్ 11, 2026 ఉదయం 8:30 గంటలకు మూసివేశారు. నవంబర్ 11, 2026 ఉదయం 8:30 గంటలకు ఆలయం మూసివేసిన తర్వాత, కేదార్‌నాథుడి పంచముఖి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపుగా శీతాకాల నివాసమైన ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. వచ్చే ఆరు నెలల పాటు భక్తులు అక్కడే స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు. సాధారణంగా ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత వచ్చే ఏడాది అక్షయ తృతీయ సమయంలో ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.
ప్రతి యేటా చార్ధామ్ యాత్రకోసం మూడు నెలలు ముందుగా భక్తులు నమోదు చేసుకుంటారు. రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగైనాయి. కొండచెరియలు పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలలో సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. చార్ధామ్ యాత్రను సులభతరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి యేటా కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్న విషయం విధితమే.
- వొద్దిపర్తి రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్





