ప్రకృతి సౌందర్యాల విశ్వం విశాఖపట్నం

నసు అనుభవాల నుంచి అనుభూతి వైపు పయనిస్తుంది.   ప్రతి అనుభవం అనుభూతిగా మాత్రం మారదు. ఒక్కొక్కసారి ఒక్కో ప్రాంతంలో పర్యటించినప్పుడు అదొక మరవలేని జ్ఞాపకంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశాఖ నగరాన్ని స్మరించినప్పుడు విశ్వంలోని ప్రకృతి సౌందర్యాలన్నీ కళ్ళముందు మెదులుతాయి.  వఖ అనే మూడు అక్షరాలకు 'కడలి' అనే పదానికి అవినాభావ సంబంధం ఉంది.   ప్రపంచంలో సముద్ర తీరాలలో ఉన్న నగరాలు, పట్టణాలు  ఎన్నో ఉన్నాయి.  అయితే విశాఖపట్నం  నగరాన్ని సందర్శించినప్పుడు కలిగే అనుభూతి వేరు.  పచ్చని కొండలను ఢీకొని వెనక్కు మరలిపోయే సముద్ర తరంగాల ఘోష ఒక్క విశాఖకే సొంతం.    డాల్ఫిన్స్ కొండలు ఆభరణంలా మెరుస్తున్నాయి.  అలలు నిత్యం ఎగసిపడుతూ నేల తల్లిని అభిషేకిస్తున్నాయి.  

 1980వ దశకంలో విశాఖ నగర పాలక సంస్థ అవతరించినప్పటి నుంచి విశాఖ బీచ్ రూపురేఖలు మారుతూ వచ్చాయి.  రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు సాగరం పలకరిస్తుంటే పరవశులమవుతాము. ఆ అనుభూతిని   వర్ణించడానికి అక్షరాలు సరిపోవు.  విశాఖ బీచ్ చెంత అద్భుతాలు కనువిందు చేస్తాయి.  పర్యాటకులకు వరంగా నిలుస్తాయి. రామకృష్ణా బీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు దారి పొడవునా మ్యూజియంలు,  పిల్లల పార్కులు, ప్రముఖుల విగ్రహాలు, శిల్పాలు  సందర్శకులను  ఆకట్టుకుంటాయి.   పలు సినిమాలలో బీచ్ సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించారు.     కైలాసగిరి నుంచి విశాఖ నగరాన్ని చూడటం మరువలేని అనుభూతి.   మొత్తం నగరం ఓ పిచుక గూడులా కనిపిస్తుంది.  కొన్నేళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం వారు గీతం కాలేజీకి చేరువలో కొండపైన వేంకటేశ్వర ఆలయం నిర్మించారు.  కొండపైకి ఎక్కి అక్కడ బాలాజీని దర్శించుకోవడం అపర తిరుపతి అనే భావన కలుగజేస్తుంది. 

  విశాఖ నగరంలో ఆధ్యాత్మికతను పెంపొందించే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.   బీచ్ ఒడ్డున కాళీ మాత ఆలయం, సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , నగరం నడిబొడ్డున కనకమహాలక్ష్మి ఆలయం, కాంప్లెక్సు చేరువలో సంపత్ వినాయక కోవెల, బెల్లం గణపతి ఆలయం ఇవన్నీ భక్తులకు కొంగు బంగారం వలె ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు విశాఖ విద్యల నగరం కూడా.  ఆంద్ర విశ్వకళా పరిషత్తుతో పాటు గీతం విశ్వవిద్యాలయం కూడా విశాఖలో ఏర్పాటైంది.  ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఒక్కొక్కటే విశాఖలో ఏర్పాటవుతున్నాయి.    విశాఖ తలవాకిట నిలిచిన భీమిలి, ఎండాడ, గంగవరం  ప్రకృతి అందాలు  పలు సినిమాలలో తెరపై విరాజిల్లాయి.  విశాఖ సందర్శన ఎన్నటికీ మరువలేని గొప్ప అనుభూతి.  

–డాక్టర్ డి.వి.ఎస్.ఎస్. శర్మ,
మొబైల్: 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *