కాల్జేతులు లేని సాహిత్యం

‘మాయాబజార్’ అందరికీ ఇష్టమైన సినిమా. అందులో ఘటోత్కచుడూ, అతడి అనుంగు పరివారం సృష్టించిన మాయాబజారూ, అందులోని విందు వినోదాలూ, ‘వివాహభోజనంబు పాటా’ తెలుగు ప్రజల సాంస్కృతిక స్మృతి పథంలోంచి ఎన్నటికీ చెరిగిపోనివి. అయితే ఇందులో ఒక తమాషా వుంది. మాయాబజార్ ను సృష్టించిన వారు రాక్షసులు. అందులో విడిది చేసిన వారు కౌరవులు కురు వంశ క్షత్రియులు. వంటలు తయారు చేసిన వారు రాక్షసులు. భోజనాలు చేసిన వారిలో శర్మా, శాస్త్రీ తప్ప మిగిలిన వారు రాక్షసులో, కౌరవులో అయి తీరతారు. అవునా? సినిమా తీసినవారు రెడ్డి కులస్తులు, సినిమా డైరెక్ట్ చేసిన వారు పెదరెడ్డిగారు. కానీ అది బ్రాహ్మల సినిమా అయిపోయింది.
క్షత్రియుల కోసం రాక్షసులు బ్రాహ్మణ శాకాహారభోజనాలు వండుతారు. అప్పడాలు, దప్పళాలు, పులిహోర, దద్దోజనం, ఆకుకూర పులుసులు, కాయగూర కూరలు, రకరకాల పిండి వంటలు, అన్నీ కూడా ఘటోత్కచుడు చక్కగా బ్రాహ్మల పిల్లవాడిలాగా తిన్నాడు. సినిమాలో ఆ భోజన దృశ్యం ఎంత రక్తి కట్టిందో తెలియని వారెవరు? శుభ కార్యాల రోజున బ్రాహ్మణేతరులు కూడా మాంసాహారాల్ని ముట్టుకోరు. నిజమే కానీ పెళ్లి ముందు రోజు, పెళ్లి తరువాత రోజూ నిక్షేపంగా తింటారు. ఇంతకూ ఇది మాయాబజార్ లో డైరెక్టర్ పప్పులో కాలు వేశారని చెప్పడం కోసం ప్రస్తావించలేదు. శాకాహార భోజనానికి ఉన్నంత ప్రాచుర్యం, ప్రచారం మాంసాహారానికి లేదని చెప్పడం కోసం మాత్రమే.
బాతు మాంసం కూడ ఆవపెట్టి మజ్జిగ పులుసులాగా వండితే ఎంత మజాగా వుంటుందో ఎప్పుడైనా చూశారా? పోనీ చదివారా? నెత్తళ్లూ, చుక్కకూర వేడి అన్నంలో కలిపి తింటేనూ, అడవి పంది ఓర్ల పులుసు కలిపిన అన్నం తింటూ కొబ్బరి ముక్కలాగా వుండే దాని ఓరుని మునిపంట కసక్కని కొరుకుతుంటేనూ ఎంత కమ్మగా వుంటుందో తెలుసునా? కణుజు మాంసం కూర్లో వేడి వేడి పూరీలు అద్దుకు తింటుంటే జిహ్వకు ఎంత పండుగగా వుంటుందో గమనించేరా? పీత కాళ్లలోని ములుగు మధురంగా, నాజూకుగా నోటిలో వెన్నపూసలాగా కరగక ముందే గొంతులోకి జారిపోతుందని తెలుసునా? తిత్తి తీసేసిన కుందేలును పొట్లం మాంసంగా వండి ఎపుడైనా తిన్నారా? ఇసుక దొంది చేపల్లోని చిరుచేదునూ, బులకొక్కులనే చేపల్లోని చిరు తీపినీ మీ నాలుక గుర్తించిందా? బైట వర్షం పడుతుంటే వేడి చేపల పులుసులో వేడి వేడి అన్నం తింటుంటే చెవిలోంచి ఆవిర్లు ఎప్పుడైనా వచ్చాయా? చాతకాని వాడెవడో కోడిని కోస్తే సేసి కట్టుతెగిపోయి మాంసమంతా చేదెక్కిపోవడం గుర్తున్నదా?
మంచి మంచి పుట్టకొక్కులు పీక్కొచ్చి కూర వండించుకు తిన్నారా? చిన్న ఈతచెట్టును నరికేసి దాని మొవ్వలోని గుజ్జును ప్రాణ ప్రదంగా భావిస్తూ తిని వాత పరుస్తుందేమోనని భయపడ్డారా? తాటిటెంక రెండుగా నరికి దానిలోని కురిడీ ఎంత వర్ణనాతీతమైన రుచిగా వుంటుందో గుర్తున్నది కదా? నల్లేరు పులుసు నచ్చుతుందా? వెల్లుల్లి పాయలూ, తెలకపిండీ కలిపి కూర చేసే ఏ మాత్రం భోజనం ఆ పూట ఎక్కువ తింటారు. ఉడుం మాంసం దొరికితే ఒదులుతారా? ఏదుపంది మాంసంతో ఎలాంటి కూరలు చేయవచ్చో తెలుసునా? చచ్చువాతమొస్తే పోలుగు పిట్టల కూర ఏమైనా పనికి వస్తుందా? ఈసుళ్లు వేయించుకు తింటే ఇతరులు నవ్వుతారా? ఉడత మాంసం కమ్మగా వున్నదంటే ఎవరైనా అసహ్యించుకుంటారా? అడవి పంది మాంసాన్ని దంచి తయారు చేసిన ఆయుర్వేదం మందు పునర్ యవ్వనాన్ని ప్రసాదించుతుందంటే నమ్ముతారా? ఇంట్లో ఎలుకల్ని చంపి పారేసినా, పంట పొలాల్లోని ఎలుకలను కొందరు హాయిగా తింటారని తెలుసునా?
ఇందులో చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. తొంభై అయిదు శాతం ప్రజలు ఏమి తింటున్నారో మన పుస్తకాల్లో ఎవరూ రాయరు. మాంసం తినే ప్రజలు మాంసాన్ని ‘నీచు’ అని సిగ్గులేకుండా వ్యవహరిస్తారు. ఫలానీ వారు ఫలానావి తింటారని రాయనక్కర్లేదు. కథ రాసినపుడో, పాట కట్టినపుడో, నవలలో ఏదో సందర్భం వచ్చినపుడో భోజనాల ప్రస్తావనే రాదా? మాయాబజార్లో రాలేదా? గంటివెన్నులను ఊచకొట్టి ఆ గింజలు నలుపుతూ ఒక రైతు కథలో ప్రవేశించవచ్చు గదా.
తిండి గురించే గాదు, చావుల గురించి కూడా తెలుగు నాట ఊహించనలవి కాని వైవిథ్యం ఉంది. కంసాలి శవాన్ని కూచోబెట్టి శ్మశానానికి తీసుకుపోతారని అందరికీ తెలుసునా? ఇంత ప్రాచీనమైన తెలుగు సాహిత్యంలో ఎపుడైనా కంసాలి శవం కనిపించిందా? చాలా కులాల్లో స్త్రీలకు మారు మనువులుండేవి. భర్తని కుల పెద్దల సాక్షిగా వొదిలేసి వేరే మగాడ్ని హాయిగా పెళ్ళి చేసుకుని, అవసరమైతే అతడిని కూడా వదిలేసి వేరే మనిషిని పెళ్ళాడేవారు. వారి గౌరవానికి ఎలాంటి లోపమూ వుండేది కాదు. ఇలాంటి మారు మనువుల కథలు మనకెపుడూ ఎందుకు రాలేదు?
అలాగే, తెలుగు జీవితంలో చాలా విషయాలు అదృశ్యం అయిపోయాయి. సరైన లెక్క తీసేనాధుడే దొరికితే ఎన్ని కులాలు, జాతులు, వృత్తులు అంతరించి పోయినాయో లెక్క తేలుతుంది. డి.ఎఫ్. కార్మికేల్ దొరలాంటి మహానుభావులు పని గట్టుకు సేకరించిన లెక్కలు నిండా నూరేళ్లక్రితంవే. విశాఖమండలం అని నాడు ఆయన పేర్కొన్న ప్రాంతాలలో అప్పటికి గుర్తించిన అనేక కులాలు ఇప్పుడు లేవు. నాగాసపు జాతి ఏమైనది? కొమ్మదాసర్లు, మాల దాసర్లు ఏమైపోయారు? శెట్టి బలిజలు ఇప్పుడెక్కడ? కజ్జెపువాళ్లు, నెయ్యల వాళ్ళు, మొండికూట్లు, విప్ర వినోదులు ఏమైనారు? నల్లచీనా వాళ్లు ఎవరు? ఈ జనమంతా జీవితంలో భాగంగా వున్న సంగతి ఇంగ్లీషు దొరలూ, శాస్త్రవేత్తలూ చెబితే తెలుస్తుంది గానీ తెలుగు సాహిత్యం చదివితే ఎందుకు తెలియటం లేదు?
అశోకుడనే చక్రవర్తి ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చి కళింగ రాజ్యాన్ని సర్వనాశనం చేసినట్టు తెలుసుకానీ ఆ కళింగరాజు ఎవడో మనకు ఎందుకు తెలియదు? ఇండో చైనా దేశాలను ఆక్రమించి, రాజ్యాన్ని స్థాపించి శతాబ్దాల తరబడి ఏలిన కళింగ రాజులు తెలుగు వారే అయినప్పటికీ వారి గురించి ‘జయవర్మ’ అనే
పేరు తప్ప మనకెవరికీ ఏమీ ఎందుకు తెలియదు? బహుశా తెలుగు వారికి ఇపుడూ, అప్పుడూ కూడా తెలిసిన విషయాల మీద రాయాలన్న ఆసక్తి లేకపోవడం దానికి ఒక కారణం కావచ్చు. ఉన్నది ఉన్నట్టు ఎవడైనా రాయగలడు, ఆఖరికి తెల్ల దొరలు కూడా రాయగలరు, వున్నది లేనట్టు మనం తప్ప మరొకరు రాయలేరని మన లోపల ఒక నమ్మకం వుండవచ్చు.
మనము రాసినదే ఉన్నది. కడమది కల్ల అని మరో నమ్మకం కూడా మన వారిలో వుండవచ్చు. అపుడు కూడా ఆ ప్రమాదాలు సంభవం. కారణాలు ఇంకా గంభీరమైనవి వేరేగా వుండవచ్చు. ఏక్సిడెంట్ కారణాలు మనం కనిబెట్టలేకపోవచ్చు గానీ ఫలితాలు అనుభవిస్తున్నాం. కాళ్ళూ చేతులూ సవ్యంగా లేని సాహిత్యాన్ని చూస్తున్నాం.

  • కె.ఎన్.వై.పతంజలి

మా గురువు గారు కె.ఎన్.వై.పతంజలి జయంతి సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరిస్తూ గురువు గారు రాసిన వ్యాసం మీ కోసం సమర్పిస్తున్నాను — ముక్కామల చక్రధర్.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *